కొరోనా విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం. బతుక్కు, బతుకుదెరువుకు మధ్య పోరు సాగిస్తున్నాం. పని చేస్తేనే ముద్ద దొరికేది, పని దొరక్క పుస్తెలు అమ్ముకోవడం, పస్తులు ఉండడం చూస్తున్నాం. ఉపాధి లేకపోతే ఆకలి చావులు, పనికి వెళితే విపత్తుల అనారోగ్య చావులు, అడ కత్తెరలో పోక చెక్కలా నలిగిపోతూ, నరకయాతన అనుభవిస్తున్నాం.
కుటుంబ పెద్దల నిస్సహాయ దుస్థితి పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. పేద కుటుంబాల్లో వంటకు సరుకులు లేక పొయ్యిలో పిల్లులు నిద్రపోతున్నాం. నేటికీ రెండు పూటలా పోషకాహారం అందని ద్రాక్షే అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కొరోనా కోరడా దెబ్బకు బాల్యం చితికి పోయింది. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు శారీరకంగా, మానసికంగా కుచించుకు పోతున్నారు. నేటి బాలల బతుకులపై విపత్తుల దుష్ప్రభావం జీవితాంతం వెంటాడేలా ఉన్నది. పేద దేశాల్లో బాలల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. పేద కుటుంబాల ఆదాయం తగ్గడం, ఉపాధులు దొరక్క పోవడంతో బాలల బాల్యం విష వలయంలో చిక్కకకు పోతున్నది. నిరుపేదలకు సాంఫీుక, ఆర్థిక, విద్య, ఆరోగ్య, పోషకాహార భద్రత కరువైంది.
అంతర్జాతీయ బాలల దినం-2024
విశ్వవ్యాప్తంగా అధిక ప్రపంచ దేశాలు 01 జూన్ రోజున అంతర్జాతీయ బాలల దినం నిర్వహిస్తూ బాలల సంరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, బాలల హక్కుల ఉల్లంఘనలను వ్యతిరేకించడం, బాలల అక్రమ రవాణాను అడ్డుకోవడం, బాలల సంక్షేమానికి బాటలు వేయడం, పిల్లల జీవన ప్రమాణాలు పెంచడం లాంటి పలు అంశాలను చర్చిస్తారు. 01 జూన్ 1925లో జెనీవాలో జరిగిన ‘‘ప్రపంచ బాలల సంక్షేమ సదస్సు’’కు గుర్తుగా ఈ వేడుక ఐరాస చొరవతో 1954 నుంచి ‘‘అంతర్జాతీయ బాలల దినం’’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఇండియాలో నెహ్రూ జన్మదినం సందర్భంగా 14 నవంబర్ రోజున ‘‘జాతీయ బాలల దినం’’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 20న ‘‘విశ్వ బాలల దినం’’ పాటించే దేశాలు కూడా ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాల సమయంలో బాలల హక్కులను కాలరాయడం, విద్యకు దూరం చేయడం, పీడిరచడం, అణచివేయడం, వారి శక్తిని దుర్వినియోగం చేయడం, బాలల అక్రమ రవాణా, బాలకార్మిక సమస్య, పోషకాహారం అందించకపోవడం లాంటి సమస్యలు ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బాలలకు పోషకాహారం, వైద్య ఆరోగ్యం, ప్రేమ, సంరక్షణ, విద్య, వివక్ష నుంచి విముక్తి, హక్కుల పరిరక్షణ, సర్వతోముఖాభివృద్ధి లాంటివి కల్పించాల్సిన కనీస బాధ్యత పెద్దలుగా మనందరిదని గమనించాలి.
విపత్తుల దెబ్బలు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ ప్రతికూలతలు, కొరోనా విపత్తు ఫలితం గా ఏర్పడిన సాంఫీుక ఆర్థిక సంక్షోభంతో 142 మిలియన్ల బాలలు కొత్తగా కడు పేదరికంలోకి నెట్టబడ్డి వారి సంఖ్య 750 మిలియన్లకు చేరడం జరిగింది. అభాగ్య బాలల్లో 66 శాతం సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారే ఉండడం విశేషం. దాదాపు 150 మిలియన్ల బాలలు విద్య, ఆరోగ్యం, గృహ వసతులు, పోషకాహారం, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత నీరు లాంటి వసతులు కూడా లేకుండా మరింత బక్కచిక్కి పోవడం జరిగింది, నేటికీ జరుగుతూనే ఉన్నది. ప్రపంచంలోని 463 మిలియన్ల పిల్లలు (ప్రతి ముగ్గురిలో ఒకరు) విద్యకు దూరమైనారని, ఈ బాలల వ్యక్తిత్వ వికాసం సరిగ్గా జరగడం లేదు. పోషకాహార లోపంతో పిల్లల ఎదుగుదల కుంటుబడటం, పలు తీవ్ర అనారోగ్యాలు కలగడం పరిశీలించబడిరది.
పెడియాట్రిక్ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేయలేమా
విపత్తుల్లో బాలల మానసిక ఒత్తిడి, గాబరా పెరిగింది. దీనితో బాలల్లో అలసట, చికాకు, ఏకాగ్రత లేకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలకు లోనయ్యారు. బాలలకు పోషకాహారం, ఆదరణ, సక్రమ నిద్ర, మానసిక చైతన్యం, శారీరక శ్రమ, గృహ ఆవరణలో ఆటపాటలు, స్నేహితులతో సరదాగా గడపడం, మంచి అలవాట్లను నేర్పడం, ఆరోగ్య సంరక్షణ లాంటి జాగ్రత్తలు నేటికీ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడిరది. కరోనా రుద్దిన నిబంధనలతో వ్యక్తులకు, స్నేహితులకు దూరంగా ఉండడం, ఇరుగు పొరుగుతో అనుబంధాలు తగ్గడం, ఒంటరిననే భావన, బడులు/సాంఫీుక కలయికలు లేకపోవడం, అమ్మనాన్నలు పనికి వెళ్ళడం లాంటివి లేత మనసులను గాయాల పాలుచేసింది. రాబోయే రోజుల్లో సీజల్ వ్యాధులు, మంకీఫాక్స్ లాంటి విపత్తుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు వివిధ స్థాయిల్లో పెడియాట్రిక్ టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయడం, పిల్లల ఆసుపత్రుల్లో పడకలు కేటాయించడం, యూనివర్సల్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం, అత్యవసర ఔషధాలు, ఉపకరణాలు సిద్ధం చేయడం, తల్లితండ్రులను చైతన్య పరచడం లాంటి పలు చర్యలను ముందుగానే తీసుకోవాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులను తలచి, పిల్లల పెరుగుదలకు సహకరిస్తూ, విపత్తులకు దూరంగా ఉంచుతూ, ముందుకు సాగుదాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





