రెండు తీరాల్ని కలుపుతూ..
కదల్లేని పొడుగు కాళ్లను ధరిస్తూ..
మౌన మునిలా నిశ్చలంగా నిలుస్తూ..
పాములా అష్ట వంకర్లు తిరుగుతూ..
జనాన్ని ఓపిగ్గా ఒడ్డుకు చేర్చుతూ..
రవాణాకు తన వీపునే అందిస్తూ..
చక్రాల బండ్ల కాలుడిని భరిస్తూ..
దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యమై..
ప్రగతికే వారధైంది ఊరి వంతెన !

చీకట్లో వారధికి నక్షత్రాలే మిత్రులు
చందమామతో ఎన్నీల ముచ్చట్లు
రవి కిరణాలతో మెరిసి మురిసే బ్రిడ్జీలు
గాలితో మృదు స్పర్శల గిలిగింతలు
వర్షంలో తడిసి తన్మయత్వ తానాలు
వాడిన కొద్దీ తరిగి చెదిరే ఆరోగ్యాలు
అందరి గోల వినే మౌన వంతెనలు !

వారధి కాళ్లు కాలంతో బలహీనమైతే..
పండు ముసలిలా ఒకేపు వంగితే..
చిక్కి శల్యమై బీటలు వారితే..
రవాణ రాకపోకలకే నిషేధాలు..
చెట్లు చేమలే తన మీపుపై మ్నెలిచి..
వంతెన గత ఘనచరిత్రగా మిగిలి..
మూలన పడ్డది అనాథలా వారధి !

వాడి నలిపేసే టిష్యూ పేపర్లోలే..
వంతెన దాటగానే మరిచే నరులు..
తీరం దాటి తెప్ప తగిలేసే జనులు..
నిలబడ్డ నేలనే నిక్కంగా మరిచే..
సమాజపు ఆధునిక రీతి రివాజులు
మందబుద్ధిగల నడవంత్రపు నరులు
వంతెనకు చెప్పరు ఎప్పుడూ కృతజ్ఞతలు !

 – మధుపాళీ
               కరీంనగర్‌  9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page