కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఇప్పట్లో చిక్కుముడి వీడేట్లులేదు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ ఆయన విషమ పరిస్థితులే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్స్ ఇంకా అలకపాన్పుపై దిగటంలేదు. ఈ వైషమ్యాలతోనే పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా పోతున్నది. దశాబ్ధాలుగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఇవ్వాళ మూడవ స్థానానికే పరిమితమవుతున్నది. మరికొంతకాలం ఉపేక్షిస్తే అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. వీటన్నిటికీ మూలం రేవంత్‌రెడ్డిని పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. కునారిల్లుతున్న కాంగ్రెస• పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తాడని ఆ పార్టీ అధిష్ఠానవర్గం రేవంత్‌రెడ్డిని అధ్యక్షపదవిని అప్పగించింది. యువకుడు, మంచి వాగ్ధాటి ఉన్నవాడు, అధికార బిఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని అధిష్ఠానం భావించింది. కాని, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుండీ ఆ పార్టీ మరింత క్షీణిస్తూ వొచ్చింది.
సుమారు మూడు నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని కాదని తెలుగుదేశం పార్టీనుంచి వొచ్చిన రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం సీనియర్లకు ససేమిరా నచ్చడంలేదు. దీంతో అలిగిన కొందరు ఇప్పటికే పార్టీని వొదిలి వెళ్ళగా, మరి కొందరు అదేదారిలో వేళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ తరుచూ రేవంత్‌రెడ్డిని విమర్శిస్తుండడం, ఆయన రూపొందించిన కార్యక్రమాలకు దూరంగా ఉండటమేకాదు, కనీసం గాంధీభవన్ సమావేశాలకు కూడా హాజరుకాకుండా ఎగ్గొట్టడంతో ఇప్పుడా పార్టీ దిక్సూచిలేని నావలా తయారైంది. ఎన్నికల సంవత్సరంగా పేర్కొంటున్న ఈ నూతన సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఏ క్షణాన ఎన్నికలు వొచ్చినా పోటీకీ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయి కూడా. కాంగ్రెస్‌లో ఆలాంటి పరిస్థితి కనిపించడంలేదు. నాయకులంతా ఎవరికి వారన్నట్లుగా వారివారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. అసలే రేవంత్‌రెడ్డికి అధ్యక్షపదవిని కట్టబెట్టడంపైన ఆగ్రహంగా ఉన్న సీనియర్లకు పీసీసీ కమిటి నిర్మాణం పుండుమీద కారం చల్లినట్లైంది.
సీనియర్‌లను పక్కకుపెట్టి ఇతర పార్టీ నుండి వొచ్చినవారికి ముఖ్యంగా రేవంత్ అనుచరవర్గానికి పెద్దపీఠ వేశారని సీనియర్స్ంతా కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పార్టీ రెండుగా చీలుతుందా అన్నంత సీరియస్‌గా పరిస్థితులు మారాయి. పార్టీలో ఏర్పడిన ఈ గందగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్ఠానం పంపించిన దూతలుకూడా చేతులెత్తేయ్యాల్సిన పరిస్తితి ఏర్పడింది. వాస్తవంగా దూతలపైన కూడా సీనియర్స్ ఆరోపణ చేయడంతో ఆ పార్టీకి దిక్కుతోచకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూడడానికి తాజాగా మాణిక్‌రావ్ థాక్రేను అధిష్ఠానం పంపించింది. రెండు రోజులకింద ఆయన రాష్ట్ర రాజధానికి వొచ్చింది మొదలు అసమ్మతి నేతలందరితో విడివిడిగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వాస్తవ పరిస్థితిని ఇప్పుడిప్పుడే అంచనా వేసుకుంటున్నాడు. విచిత్రమేమంటే ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు సీనియర్స్‌తో పాటు జూనియర్స్ కూడా రాకపోవడం ఆ పార్టీలో ఇంకా గందరగోళ పరిస్థితిని చెప్పకనే చెబుతున్నది. కాంగ్రెస్‌నుండి బిజెపిలోచేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన ఆయన సోదరుడికి మద్దతివ్వాలంటూ తన సహచరులతో మాట్లాడిన ఫోన్ సందేశం బాహాటం కావడంతో షోకాజ్ నోటీసు అందుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీ భవన్ మెట్లు ఎక్కనని గతంలో ఆయన చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడినట్లు థాక్రే ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించాడు.
గాంధీ భవన్ కు కాకుండా ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో ఆయన థాక్రేతో ఏకాంతంగా మాట్లాడడం, రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ సీనియర్స్ ఏ మేరకు వ్యతిరేకిస్తున్నారనడానికి ఒక ఉదాహరణ. ఇదిలాఉంటే తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి జరుపతలపెట్టిన పాదయాత్ర మరో చిచ్చు లేపుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పాదయాత్రద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వొస్తుంది. అంతేగాక రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తోవడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విషయాలపైన కడిగిపారేయవొచ్చన్నది రేవంత్‌రెడ్డి అభిప్రాయం. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌తోపాటు,అనుచరగణాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. జనవరి 26 నుండి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా పాదయాత్రలను నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమైనారు. అయితే రేవంత్ పాదయాత్రకు అనుమతివ్వవొద్దని సీనియర్స్ కొందరు అధిష్ఠానానికి లేఖలు రాస్తున్నారు. ఆయనకు అనుమతిస్తే తమకు కూడా పాదయాత్రలకు అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి నియోజకవార్గల్లో వారిని పాదయాత్ర చేసుకోనిస్తే చాలంటున్నారు. ఇది ఇప్పుడు అధిష్ఠానానికి మరో తలనొప్పిగా తయారైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చూసేందుకు కొత్తగా వొచ్చిన థాక్రే అధిష్ఠానానికి ఈ విషయంలో ఎలాంటి సూచన చేయనున్నాడు, దాని పైనే సీనియర్లు ఏ విధంగా స్పందించనున్నారో చూడాలి.
గెస్ట్ ఎడిట్ …. మండువ రవీందర్‌రావు