రాహుల్‌ ‌పర్యటనపైనే టిపిసిసి ఆశలు

రాహుల్‌గాంధీపర్యటనపైనే తెలంగాణ కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ ‌స్థానాన్ని పక్కకు నెట్టి ఇప్పుడాస్థానంలో బిజెపి చేరింది. ఈ రెండు పార్టీలు 2023లో రానున్న శాసనసభ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని ఈ రెండు పార్టీలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసిన పార్టీగా ప్రజలు తమను తప్పక గుర్తిస్తారని కాంగ్రెస్‌, అం‌దుకు సంపూర్ణంగా సహకరించిన పార్టీగా తమ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని బిజెపి అంటోంది. అదే లక్ష్యంగా ఇప్పుడీ పార్టీలు దూకుడుగా ముందుకు పోతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చన్న భావన కలుగుతున్నది. అందకే పార్టీలు ప్రజా క్షేత్రంలో తిరిగేందుకు కార్యక్రమాలు రూపొందించు కుంటున్నాయి. ఇప్పటికే బిజెపి పాదయాత్రలు నిర్వహిస్తున్నది. అలాగే కాంగ్రెస్‌ ‌కూడా స్థానిక నాయకత్వం పాదయాత్రలను జరుపుతుండగా, త్వరలో వాటిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ‌ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకువచ్చే ప్రయత్నంచేస్తోంది ఆ పార్టీ స్థానిక నాయకత్వం. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో రాహుల్‌ ‌పర్యటన తేదీలుకూడా ఖరారు అయినాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలను రాహుల్‌ ‌రాక సందర్భంగా ప్రధానాంశం చేయాలని కాంగ్రెస్‌ ఆలోచన. అందుకే ఈ నెల ఆరున వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో రైతు సమస్యలను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. దాన్నిబట్టే ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణంచేశారు. రాష్ట్ర రాజకీయాల విషయానికి వొచ్చినప్పుడు రాజధాని హైదరాబాద్‌ ‌తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సహజంగానే వరంగల్‌ ‌వైపు చూస్తుంటాయి. రాజకీయంగా ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా వరంగల్‌నుండి ప్రారంభించడమన్నది ఆనవాయితీకూడా. అంతెందుకు మలివిడుత తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమం ఎప్పుడైతే చల్లబడుతుందనిపించేదో అప్పుడు కెసిఆర్‌కు వెంటనే వరంగల్‌లో సభ పెట్టాలని గుర్తుకు వొచ్చేది.. అలాగే సభ పెట్టేవాడు. ఆ సభ విజయవంతం అవడంతో ఇంకేముంది పార్టీకి మరోసారి గ్లూకోజ్‌ అం‌దించినట్లు అయ్యేది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కూడా అదే ఆలోచనతో వరంగల్‌లో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నది.

ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ ‌పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఒక విధమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నది. నిన్నటి వరకు అధికార టిఆర్‌ఎస్‌ ‌వర్సస్‌ ‌బిజెపిగా ఉన్న వాతావరణం ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌వర్సస్‌ ‌కాంగ్రెస్‌ అన్నట్లుగా మారుతున్నది. రాహుల్‌ ‌సభ తర్వాత మరింతగా మార్పులు సంభవించ వొచ్చనుకుంటున్నారు. రాహుల్‌ ‌పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడానికి అనుమతిచ్చే విషయంలో జరుగుతున్న ఘర్షణతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి అనుమతివ్వలేదు కాబట్టి, ఇప్పుడు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం అడ్డు చెప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్‌ఎస్‌యు విద్యార్థులు యూనివర్శిటీ పరిపాలన భవనంపై దాడి చేసి, ధ్వంసం చేయడంతో అరెస్టులు చోటుచేసుకున్నాయి. వారిని పరామర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలుకూడా నిర్బంధానికి గురైనారు. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో సహా పద్దెనిమిది మంది విద్యార్థి నాయకులను రిమాండ్‌చేసి చెంచల్‌గూడ జైల్‌కు తరలించారు. మరి కొందరు నాయకులు మంత్రుల క్వార్టర్‌లను ముట్టడించే ప్రయత్నించండం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్‌ ఇం‌టరాక్ట్ ‌కు సంబంధించి యూనివర్శిటీ విసి అనుమతి నిరాకరించడం తాజా పరిణామమైనప్పటికీ, రాహుల్‌ ‌రాకను పురస్కరించుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్రంలో ఒక హైప్‌ను క్రియేట్‌ ‌చేసింది. అయితే ఈ సభ కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభిస్తుందన్నది ఇప్పుడప్పుడే అంచనా వేయడం కష్టం. కాంగ్రెస్‌లో గ్రూపులు , విభేదాలు లేవంటే ఆశ్చర్య పడాల్సిందే. మొదటినుండి ఈ గ్రూపు రాజకీయాలున్నప్పటికీ డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి చాలావరకు వారందరినీ ఏక తాటిపైకి తీసుకురాగలిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొంతవరకు నెట్టుకువొచ్చినా, రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడైనప్పటినుండీ మళ్ళీ విభేదాలు పొడసూపాయి. రాహుల్‌ ‌గాంధీని తెలంగాణకు తీసుకువొస్తున్న సందర్భంగా అత్యధిక సంఖ్యలో సభకు ప్రజలను తరలించే విషయంలో రేవంత్‌రెడ్డి జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసిన దరిమిలా తమ జిల్లాలో పర్యటించాల్సిన అవసరం లేదని కోమటి రెడ్డి బ్రదర్స్ ‌పేర్కొనడం, అయినా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరు కాకపోవడం, దాదాపు ప్రతీ జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న పరిస్థితిలో గోలకొండ కోటపై మూడు రంగుల జండాను ఎగురవేయాలన్న కాంగ్రెస్‌ ‌లక్ష్యం ఎలా నెరవేరుతుందన్నది ప్రశ్న. ఇందుకు రాహుల్‌ ‌సభ దీనికి సమాధానం చెబుతుందా అన్నది వేచిచూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page