కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ తన రాజకీయ జీవితానికిక ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆమె సూటిగా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగ పాఠం మాత్రం ఆదే భావాన్ని కలిగించేదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల సందర్భంగా రెండవ రోజు కార్యక్రమంలో సోనియా సుమారు పదిహేనువేల మంది పార్టీ సభ్యులను ఉద్దేశించి చేసిన సుదీర్ఘ ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్‌గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర’గురించి ఆమె ప్రముఖంగా మాట్లాడారు. ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలు శాంతి, సామరస్యాన్ని కోరుకుంటున్నారని మరోసారి రుజువైందన్నారు. యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని ఆమె అభినందించారు కూడా. ఈ సందర్భంగానే ఆమె కీలక వ్యాఖ్య చేశారు. జోడో యాత్రతోనే తన ఇన్నింగ్స్ ముగిసినందుకు సంతోషంగా ఉందనడాన్ని బట్టి చూస్తే ఇక తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలోనే ఆమె ఉన్నట్లు స్పష్టమవుతోంది.
2024లో జరుగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో తిరిగి అధికారంలోకి వొచ్చేందుకు ఎదుర్కోవాల్సిన సవాళ్ళపై పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో సోనియా మాటలు అందరినీ ఆలోచనలో పడేశాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఒక విధంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ రెండుగా విడిపోతున్నాయి.
ఇప్పటివరకు తటస్థంగా ఉన్న మరికొన్ని ప్రాంతీయ పార్టీలుకూడా బిజెపి లేదా కాంగ్రెస్‌పార్టీల్లో ఎటో ఓ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కొన్ని ఇప్పటికే బిజెపి పాలనా తీరుపై అలకవహించాయి. పలు సందర్భాల్లో కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. రేపు జరుగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో బిజెపిని గద్దె దించాలన్న లక్ష్యంగా చాలా ముందునుండే పావులు కదుపుతున్నాయి. ఈ దశలో కాంగ్రెస్‌ను కలుపుకుని పోరాటం సాగిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందని కొన్ని ప్రాంతీయపార్టీల ఆలోచనగా ఉంది. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో సోనియాగాంధీ అస్త్రసన్యాసం చేయబోతున్నట్లు ధ్వనించేలాగా చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు, ఆ పార్టీని కలుపుకుపోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీలను ఇప్పుడు ఆలోచనలో పడేసింది. వాస్తంగా ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అమె చాలా కాలం కింది నుండే భావిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అమె కొనసాగడం అత్యంత ఆవశ్యకతంగా పార్టీ సీనియర్ నాయకులు భావించిన దృష్ట్యా తప్పనిసరి పరిస్థితిలో ఇంతకాలం పార్టీ పగ్గాలనుపట్టి నెట్టుకుంటూ వస్తోంది. రాహుల్‌గాంధీ ఈ బరువు బాధ్యతలను మోయలేనని ఖచ్చితంగా చెప్పడంతో ఆమెకు పార్టీ భారం మోయక తప్పలేదు. ఇప్పటికైనా విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనగానే ఆమె అలా మాట్లాడి ఉంటుందనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాను పార్లమెంటులో మొదటిసారిగా కాలుపెట్టిన నాటి పరిస్థితులకు నేటి పరిస్తితులకు చాలా వ్యత్యాసం ఉందంటూ, డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ప్రధానిగా 2004, 2009 ల్లో కొనసాగిన కాలంలో తాము సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తిని ఇచ్చిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. కాని నేటి ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం విద్వేషాలను సృష్టిస్తున్నదంటూ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ, కొంతమంది బడా వ్యాపార వేత్తలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నదంటూ ఘటైన విమర్శ చేశారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఇది సవాళ్ళతో కూడిన సమయం. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకుపెట్టి త్యాగాలు చేయాల్సిన తరుణమిది. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను , వారి అప్రజాస్వామిక పాలనా విధానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి, పోరాటానికి ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరాన్ని ఆమె పార్టీ శ్రేణులకు నొక్కి చెప్పారు. కాగా, రానున్న ఎన్నికలవరకైనా కాంగ్రెస్‌కు ఆమె నేతృత్వం వహిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.