నేను ఎప్పటికీ విూ సీతక్కనే…
మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన
కుమురమ్ భీమ్ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది
జైనథ్ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం అయిపోతము. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే విూ అక్క, విూ చెల్లిలాగా కలిసి పోతాం. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే శాశ్వతం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పుకోవచ్చు’ అంటూ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు ఇన్‌చార్జ్ మంత్రిగా సీఎం తనకు బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా తనను మేడమ్ అని సంబోదిస్తున్న అక్కడి కిందిస్థాయి ఉద్యోగులతో .. తానెప్పటికీ సీతక్కనేనని, తనను సీతక్క అనే పిలవాలంటూ సూచించారు. ఆదిలాబాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని..జిల్లా అభివృద్దికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాపాలనలో భాగంగా జామినికి రావడం.. కుమురమ్ భీమ్ గడ్డపై నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం ఆదివాసీ బిడ్డగా తనకు మరింత తృప్తినిచ్చిందని తెలిపారు. ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలు దరఖాస్తు పక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, సిబ్బందితో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అన్ని విధాలుగా సాయం చేస్తారని తెలిపారు. ఆదివాసీ గూడాల్లో నిరక్షరాస్యులకు స్థానిక యువత సాయం చేయాలని..దరఖాస్తులు నింపే విషయంలో స్థానిక యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతం ప్రభుత్వంలో లాగా జిరాక్స్ సెంటర్ల వద్ద..విూసేవల వద్ద లైన్లు కట్టి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని..ప్రజల వద్దకే అధికారులు , సిబ్బంది వొచ్చి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. ఇచ్చిన హావిూలను పక్కాగా అమలు చేస్తామని..కొత్త రేషన్ కార్డ్‌ల పక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.





