- త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయాలలో ఫిబ్రవరి 27న పోలింగ్
- మార్చి 2న కౌంటింగ్.. ఫలితాల ప్రకటన
- అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్
న్యూ దిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా.. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహించనున్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వొచ్చింది. నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చ్ 12న ముగుస్తుండగా.. మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ గడువు మార్చ్ 15, 22న పూర్తికానుంది. మార్చ్ నెలఖరులోగా ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రతి రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 62.8 లక్షల మంది వోటర్లు ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 1.76 లక్షల మంది వోటర్లు తొలిసారి వోటు వేయనున్నారు. 376 పోలింగ్ బూత్‌లు మహిళా సిబ్బంది ఆధీనంలో ఉండనున్నాయి. మూడు రాష్టాల్ల్రోనూ ఎన్నికల కౌంటింగ్ మార్చి 2వ తేదీన జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనున్న నేపథ్యంలో జనవరి 11వ తేదీన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఆ రాష్ట్రాల్లో పర్యటించింది. వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలపై ఆయా రాష్టాల్లోన్రి రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.