- ఇక్కడి సేట్లే సిద్ధిపేటకు బ్రాండ్ అంబాసిడర్లు
- గత ప్రభుత్వాలు వైశ్యుల నుండి మామూళ్ల వసూలు…బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ బాధల్లేవ్
- త్వరలో సిద్ధిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు
- సిద్ధిపేటలో వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్ రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలని వైశ్యుల తీర్మానం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : ‘సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు…మీ దీవెనతో సిద్ధిపేటను మరింత అభివృద్ధి చేస్తా’…అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం సిద్ధిపేట పట్టణంలోని కరీంనగర్ రహదారి సమీపంలోని రంగనాయకుల గుట్ట పక్కన నిర్మించిన వైశ్య సంక్షేమ సమితి(విఎస్‌ఎస్) కన్వెన్షన్‌ను ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, టూరిజం శాఖ మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, వైశ్య సంక్షేమ సంస్థ ప్రతినిధులు కొమరవెల్లి అంజయ్య, మురంశెట్టి రాములు, గంప శ్రీనివాస్, కొర్తివాడ లక్ష్మణ్, ఐత రత్నాకర్, తోట ఆశోక్ తదితరులతో కలిసి మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…7 కోట్ల 5 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించి ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో దూరదృష్టితోనే గతంలోనే 2 ఎకరాల విలువైన స్థలం ఇచ్చారనీ గుర్తు చేస్తూ..పేద ఆర్య వైశ్యులకు తమ ప్రభుత్వ సహకారం అందిస్తుందన్నారు. సిద్ధిపేట పట్టణం ఎదుగుదలకు వైశ్యులు ముఖ్య కారణమనీ, సిద్ధిపేట సేట్లే సిద్ధిపేటకు బ్రాండ్ అంబాసిడర్లన్నారు. సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది రుణం తీర్చుకుంటాన్నారు. సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకమన్నారు. పేట వైశ్యుల సేవలు ఎల్లలు దాటాయని కొనియాడారు. బద్రీనాథ్, కేదారినాథ్ లల్లో భక్తులకు అన్నదానం చేయడంతో పాటుగా అమోధ్యలో అన్నదానం చేయడానికి సిద్దమవడం గర్వకరణమన్నారు. గత ప్రభుత్వాలు వైశ్యుల నుండి మామూళ్లు వసూలు చేసేవి, ఈ ప్రభుత్వంలో ఆ బాధ లేవనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. 40 ఏండ్ల నుండి ట్యాగ్‌లైన్‌లుగా ఉన్న నినాదాలు నేడు నిజమవుతున్నాయనీ, మంగళవారం నుండి సిద్ధిపేటకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయన్నారు.
సిద్దిపేట ఎన్నికల నినాదాలుగా ఉన్న రైలు, గోదావరి జలాలు, సిద్దిపేట జిల్లా తదితర ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నేరవేర్చారన్నారు. రూ.1000 కోట్లతో రైల్వే లైన్ భూసేకరణ చేసినట్లు తెలిపారు. మంగళవారం నుండి తొలుత పుష్ పుల్ డీజిల్ రైలు సిద్దిపేట నుండి కాచిగూడ రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. త్వరలో రూ.150 కోట్లతో సిద్దిపేట మనోహరబాద్ రైల్వేలైన్‌ను ఎలక్ట్రిపికేషన్ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే సిద్ధిపేట నుండి తిరుపతి, బెంగుళూరు వరకు కూడా రైలు సేవలు ప్రారంభమవుతాయన్నారు. సిద్ధిపేట పట్టణాన్ని విద్య, వైద్యం, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. నిరుపేద ఆర్య వైశ్యులకు కల్యాణ లక్ష్మీ, తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 350 కోట్ల రూపాయలతో సిద్ధిపేటలో నిర్మించిన ప్రభుత్వ వెయ్యి పడకల దవాఖానను ఈ నెల 5న ప్రారంభించనున్నామన్నారు. త్వరలోనే సిద్ధిపేటలో వృద్ధాశ్రమంను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
మంత్రి హరీష్‌రావు లక్షా 50 వేల మెజారిటీతో గెలవాలని తీర్మానించిన వైశ్యులు…
సిద్ధిపేటలో వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ ప్రారంభం సందర్భంగా…రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు లక్షా 50 వేల వోట్ల మెజారిటీతో గెలవాలని వైశ్యులందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ..మంత్రి హరీష్‌రావుకు ప్రజలకు సేవ చేసి వారి ముఖాల్లో ఆనందం చూసినపుడు కిక్ ఉంటుందనీ, అంతేకాకుండా మంత్రి హరీష్‌రావు కమిట్‌మెంట్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మంత్రి హరీష్‌రావును గెలిపించాలని వైశ్యులకు పిలుపునిచ్చిన గణేష్ గుప్తా..ముఖ్యమంత్రి కేసీఆర్ బోళా శంకరుడన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, మాజీ మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్ నాయిని చంద్రం, కో అప్షన్ సభ్యుడు బచ్చు సుజాత రమేష్, గంప రామంచదర్‌రావు, నందిని శ్రీను, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, ధర్మవరం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.