డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..?
ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి
రాజ్య సభలో టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవ రావు
: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్ ఎంపి కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిసారి కన్‌ప్యూజ్ చేస్తున్నారని అన్నారు. శుక్రవారం రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ (డీసీపీ) విధానంలో ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రాల నుంచి కేంద్రం ధాన్యం కొంటుందా లేదా అని ప్రశ్నించారు. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్‌లో భాగంగా రాష్ట్రమే నేరుగా ధాన్యం కొని మిల్లింగ్ తర్వాత ఎఫ్‌సీఐకి ఇస్తుందన్నారు.
కానీ ధాన్యం కొనుగోలు సమయంలో జూన్ నెలలోనే మేం డబ్బులు చెల్లిస్తామని, కేంద్రం మాత్రం ఆగస్టులో ఆ అమౌంట్ ఇస్తుందని కేశవరావు అన్నారు. తమ వద్ద నుంచి ఎంత మొత్తంలో బియాన్ని కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని ఆయన అడిగారు. కేంద్ర ఆహార శాఖ తన లేఖల్లో కానీ ఒప్పందాల్లో కానీ వరి గురించి చెప్పిందని, కానీ ఎక్కడా బియ్యం అన్న పదాన్ని వాడలేదన్నారు. తెలంగాణలో భిన్న వెరైటీ ధాన్యం ఉంటుందని, ఒడిశాలో మరో రకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఆ వెరైటీలతోనే బాయిల్డ్ రైస్ తయారు అవుతుందని ఎంపీ కేశవరావు అన్నారు.