మహిళా సాధికారతకు పెద్దపీట

త్వ‌రిత‌గ‌తిన‌ 22 మహిళా శక్తి భవనాల ప‌నులు
శిల్పారామంలో 106 స్టాళ్ల‌తో ఇందిరా మహిళా శక్తి బజార్
తొలివిడతలో 1000 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు
మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, శిల్పా రామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ల ఏర్పాటు పనులు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్బంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. 22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణ పనులు మొదులు పెట్టి, 8 నెల‌ల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 106 షాపులతో ఏర్పాటు చేస్తున్న బాజార్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ మొదటి వారంలోగా ఈ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ ఇందిరా మహిళా శక్తి బజార్ లో నిత్యం వివిధ సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు చేయడానికి మహిళలకు ఆర్థిక చేయూత కోసం  నగరంలోని ఐ.టి సంస్థలు, ఇతర ప్రముఖ వాణిజ్య, వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.
రాష్ట్రంలో అద్భుతంగా పొదుపు సంఘాలను నిర్వహిస్తూ, అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసిన మహిళా సంఘాలచే బస్సులను కొనుగోలు చేయించి వాటిని టీఎస్ఆర్టీసి ద్వారా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఈ సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని, దీనిలో భాగంగా మొదటి దశలో 150 బస్సుల కొనుగోలును చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఈ బస్సుల నిర్వహణ బాధ్య‌తలను ఆర్టీసీ చేపడుతుందన్నారు.

మ‌హిళా సంఘాల ద్వారా సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు
మహిళా సంఘాల ద్వారా 4000 మేఘావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని వివరించారు. ఈ ప్లాంట్లను నీటిపారుదల శాఖ, దేవాదాయ, అటవీ శాఖలో నిరుపయోగంగా ఉన్న ఖాలీ భూములను లీజ్ పద్ధతిన సేకరించి ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు అనంతరం వీటి నిర్వహణ బాధ్య‌తలను తెలంగాణ రెడ్కో, విద్యుత్ డిస్కంలు చేపడుతాయని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుందని సిఎస్ తెలిపారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌, పీసీసీఎఫ్‌ ఆర్ఎం డోబ్రియల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page