గుంట భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేయగలవా?

రేవంత్‌ రెడ్డివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు
మాజీ మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌21:  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.  భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గురువారం అందోల్‌ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌ దగ్గర ఇరిగేషన్‌ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా13 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు వివరించారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్‌ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు తన చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఏ భూమిని అయితే నేను రిజిస్టేష్రన్‌ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు వొస్తావో చెప్పు రేవంత్‌ రెడ్డి.. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. నువ్వు ఎన్ని బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రైతుల పక్షాన సీఎంను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.

వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభలో రేవంత్‌ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా అని ప్రశ్నించారు.  ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో సైతం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్‌ సప్లై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. మరోపక్క సివిల్‌ సప్లై కమిషనర్‌ 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించారు.

దీని ఆంతర్యమేమిటని నిలదీశారు. మధ్యలో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎక్కడికి పోయిందో చెప్పాలన్నారు. రైతులు పండిరచిన ధాన్యంలో సగం దళారుల పాలయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..దళిత, గిరిజన, అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతున్నది. కంపెనీ నిర్మాణాల కోసం ఆ భూములను తన ఆప్తులకు కట్టబెట్టే ప్రయత్నం సీఎం చేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని హరీష్‌ రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page