10,831 ఎకరాల పంట….35 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టం
కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
మండలాల్లో బృందం విస్తృత పర్యటన
బూర్గంపాడు, ప్రజాతంత్ర, జూలై 22 : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వొచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, మిషన్ భగీరథతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలో పార్తిభన్ కె.మనోహరన్, కేంద్ర జలసంఘం డ్కెరెక్టర్ రమేష్‌కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ శివకుమార్ కుష్వాహల కేంద్ర బృందం శుక్రవారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి గూడెం, బూర్గంపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. సంజీవరెడ్డి పాలెం గ్రామంలో దెబ్బతిన్న పత్తి, డ్రాగేన్ ఫ్రూట్ రైతుల పొలాలు పరిశీలించారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. జి భాస్కర్ రెడ్డి తాను 15 ఎకరాలలో పత్తి పంట వేశానని వరదల వల్ల పూర్తిగా పాడైపోయినట్లు చెప్పారు. అలాగే యంఏ మజీద్ అనే రైతు యొక్క డ్రాగేన్ ఫ్రూట్ పండ్ల తోటను పరిశీలించారు. పంట పూర్తిగా నీట మునిగి కుళ్ళిపోయినట్లు అధికారులు గమనించారు.
బూర్గంపాడు గ్రామంలో దెబ్బతిన్న ఇళ్ళు, కుక్కునూరు , బూర్గంపాడు రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దెబ్బ తిన్న నష్టంపై నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందచేస్తామని చెప్పారు. అంతకు ముందు నష్ట పరిశీలనకు వొచ్చిన కేంద్ర బృందానికి ఐటిడిఎ కార్యాలయంలో దెబ్బతిన్న నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. అధికారుల బృందం నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖకు 10831 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, దెబ్బతిన్న పంటల విలువ 584.88 లక్షలు ఉంటుందని, ఉద్యాన వన శాఖ పంటలు 35 హెక్టార్లలో దెబ్బతిన్నాయని నష్టం విలువ 40.50 లక్షలని, విద్యుత్ శాఖకు 9 సబ్ స్టేషన్స్, 65 స్తంభాలు, 259 విద్యుత్ నియంత్రికలు దెబ్బతిన్నాయని వాటి విలువ 580.10 లక్షలని, పంచాయతి రాజ్ శాఖకు సంబంధించి గ్రామీణ రహదారులు 251.50 కిమి మేర దెబ్బతిన్నాయని వాటి విలువ 1280 లక్షలని, రహదారులు, భవనాల శాఖకు సంబంధించి 45 చోట్ల రహదారులు దెబ్బతిన్నాయని వాటి విలువ 9996 లక్షలని చెప్పారు.
మిషన్ భగీరథ 212 అవాసాల్లో నల్లాలు, మోటార్లు, ప్యానెల్ బోర్డస్ దెబ్బతిన్నాయని వాటి విలువ 220 లక్షలని, అలాగే జాతీయ రహదారులకు సంబంధించి 252 లక్షల నష్టం వాటిల్లిందని మొత్తం నష్టం విలువ 12953.48 లక్షలని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదికి 1986 సంవత్సరం తరువాత ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని, ఈ నెల 16 వ తేదీన రికార్డు స్థాయిలో గోదావరికి 71.30 అడుగుల వరకు వరద ఉదృతి వొచ్చిందని అన్నారు. వరదలు వల్ల ఎటువంటి మానవ నష్టం జరగలేదని అన్నారు. పశువులను కూడా ఎతైన ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ముంపుకు గురవుతున్న ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు కలెక్టర్ కేంద్ర బందానికి వివరించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట పంచాయతి రాజ్ డైరెక్టర్ హనుమంత రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతం, ఐటిడిఎ పిఓ పోట్రూ గౌతం, ఎఎస్పీ రోహిత్ రాజ్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, రభ ఈఈ భీంలా, పీఆర్ ఈఈ సుధాకర్, మిషన్ భగీరథ ఎస్‌ఈ ఎస్ భాస్కర రావు, ఈఈ తిరుమలేష్, నళిని, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీఈ విజయ్ కుమార్, జాతీయ రహదారుల డిఈ శైలజ, డిఆర్వో అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.