- భూబదలాయింపు చేసినా బుకాయింపులా
- ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్ రావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిమ్స్‌కు భూ బదలాయింపు జరిగినట్టు తెలంగాణ ప్రభుత్వం కాగితలతో సహా రుజువులు చూపించే సరికి కిషన్ రెడ్డి నాలుక కరుచుకున్నాడని హరీష్ రావు తెలిపారు. శుక్రవారం ఉదయం బీబీ నగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇంత వరకు పూర్తిస్థాయిలో కేంద్రం ప్రొఫెసర్‌లను నియమించలేదన్నారు.
185 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా 95 మందిని మాత్రమే నియమించారు. నర్సింగ్ నియామకాల్లోనూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నర్సింగ్‌కు సంబంధించి 812 నర్సింగ్ పోస్టులు ఉండగా 200 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఎయిమ్స్‌కు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇంతవరకు కొత్త భవన నిర్మాణం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు జరగకపోవడం దారుణమన్నారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న లోటుపాట్లను కేంద్ర వైద్య శాఖకు పూర్తిగా వివరిస్తామని మంత్రి తెలిపారు.