- రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
హైదరాబాద్, ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీజేఎస్ 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతలు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నామని రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిరంకుశ పాలన చేస్తూ ఇప్పుడు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడే ముందు రాష్ట్రం ఇప్పటి వరకు అమర వీరుల కుటుంబాలకు మీరు ఏం చేశారో ఆలోచించుకోవాలని సూచించారు.
ఉద్యమ ఆకాంక్షలు మరచిపోయి ఉద్యమ వ్యతిరేకులతో కేబినెట్‌ను నింపారిన ఆరోపించారు. ధర్నా చౌక్ లేకుండా చేశారనీ, నిరుద్యోగులు, నిరు పేదల గురించి మాట్లాడితే అక్రమ కేసులుపెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2 లక్షల 80 వేల ఉద్యోగ ఖాళీలు ఉండగా, కేవలం వేల సంఖ్యలో భర్తీ చేస్తూ నిరుద్యోగం మొత్తాన్ని లేకుండా చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్‌కు గట్టి గుణపాఠం చెబుతారని ఈసందర్భంగా ప్రొ.కోదండరామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాపురం వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోపగాని శంకర్రావు, నిజ్జన రమేశ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.