రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్
రతిపక్షాల పాత్ర గురించి డా.పరకాల ప్రభాకర్ తో ’ ప్రజాతంత్ర ‘ దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( అనువాదం ) గ్రహీత, సామజిక విశ్లేషకులు, స్ వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ చేసిన ఇంటర్వ్యూ ఆఖరి భాగం ..
Click Here: (నిన్నటి తరువాయి)
సజయ : నిజానికి చంద్రబాబు నాయుడు గానీ, నితీష్ కుమార్ కి గానీ ఈ పరిస్థితి ఒక మంచి అవకాశం. వారిద్దరినీ ఇండియా కూటమిలో జాయిన్ అవవలసిందిగా ఒక ఓపెన్ లెటర్స్ కూడా ప్రజా సమూహాల నుంచీ వెళ్లింది. అయితే వాళ్లిద్దరూ కూడా ఎన్డిఏ కూటమితోనే వుండాలనుకున్నారు. ఈ రాజకీయ సమీకరణాల్లో ఏం పనిచేసివుంటుంది? ఏమయివుంటుంది?
పరకాల ప్రభాకర్: ఇవి రాజకీయ సమీకరణాలు, ప్రయోజనాలు. ఎవరో ఓపెన్ లెటర్ రాస్తే సెంటిమెంటల్ గా రాజ్యాంగం అంటూ వెళ్లటం వుండదు. వాళ్లు హార్డ్ కోర్ పొలిటీషియన్స్. మన ప్రయోజనాలు ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ కాపాడబడతాయి అనే లెక్కలు బాగా వుంటాయి. ఆ లెక్కలు ఏమిటనేది మనకు తెలియదు. మనం వొప్పుకోవచ్చు, వొప్పుకోకపోవచ్చు. కానీ, వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయి. తరువాత, వీళ్ళిద్దరూ ముఖ్యంగా , మీరు ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నాను, వీళ్ళకి ఎన్డిఏ లో వుండటము కొత్త కాదు, దానిలో నుంచీ బయటకు రావటము కొత్త కాదు. అంచేత, రేపు వీళ్లు ఎన్డిఏ నుంచీ బయటకు రారు అని ఎవరూ చెప్పలేరు. అలాఅని ఎన్డిఏ లోనే కొనసాగుతారు అనేది కూడా కచ్చితంగా చెప్పలేరు. వుంటారని చెప్పలేం, వుండరనీ చెప్పలేం. నిరంతరం మెడ మీద కత్తిలానే వుంటుంది పరిస్థితి. ఒకటేమిటంటే, నరేంద్ర మోదీ గారి స్వంత పార్టీలో ఉద్ధండులైన నాయకులున్నారు. అనుభవజ్ఞులైన నాయకులు వున్నారు. బయట వున్నారు. ఆయన కూటమిలో కూడా వున్నారు. మీకూ నాకూ తెలిసినంత వాళ్లకు తెలియకుండా ఎందుకు వుంటుంది. మనకంటే వాళ్లకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్లందరూ రాజకీయంగా తలపండినవాళ్లు. నరేంద్ర మోదీ గారు బలహీనపడ్డారు. ఆయన పార్టీకి ఆయన స్వయంగా మెజారిటీ తీసుకురాలేకపోయారు. ఆ వచ్చినటువంటి సీట్లలో కూడా ముప్ఫై నుంచీ అరవై వరకూ కటాకటి గా వచ్చాయి. ఆయనకే ఆయన స్వంత నియోజకవర్గంలో ఇదివరకంతటి ప్రభ లేదు అక్కడ అనేది వారికి తెలియదా? బలహీనంగా వున్నటువంటి నాయకుడితో ఎలా డీల్ చేస్తారు.
బలిష్టంగా వున్నవాడితో ఎలా డీల్ చేస్తారనేది తెలిసిపోతుంది…ఎక్కడో పట్టు పడుతున్నారు, మాకిది కావాలి, అది కావాలి, మాకు ఇన్ని కావాలి అని. వాళ్లతో కలిసి పోటీ చేసిన ఎన్సిపి మరొక ఫాక్షన్ అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ వాళ్లు మంత్రులుగా మేం చేయము అన్నారు. వాళ్లు రాలేదుగా! అంటే, మేము ఇదివరకు కేబినెట్ మంత్రులుగా చేశాము, ఇప్పుడు మీరు మినిస్టర్స్గా చేయమంటున్నారు, మాకు అవసరం లేదు పొమ్మంటున్నారు. ధిక్కార స్వరాలు … నిరసన గళాలు ఎప్పుడొస్తాయి? బలహీనంగా వున్నప్పుడు వస్తాయి. అదే ఆయనంతటికి ఆయనకి మూడు వందలు దాటితే కిక్కురుమనకుండా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసేవారు. ఇక్కడే తెలిసిపోతోంది. లాస్ట్ టైమ్ మూడువందల మూడు వచ్చినా గానీ తమ మిత్ర పక్షాలు అందర్నీ కలుపుకునే వెళ్లారు. అయినా కూడా, బలం లేదు అంటే ప్రవర్తన ఒకలాగా వుంటుంది, బలం వుంది అంటే ఒకలాగా వుంటుంది. నిన్నటివరకూ అబ్బో నాది యాభైరెండు అంగుళాల ఛాతీ అని మరోటో అని ఏదేదో చెప్పారు. కానీ, ఇవాళ నువ్వు అలా కాదు అని అందరికీ అర్థం అయింది, కోరలు తీసేసినట్లు అయింది. భయపడటం లేదు ఎవ్వరూ! ఇది, ఎన్నాళ్లు ఇలా సాగుతుంది? ఎవరికీ తెలియదు. ఇందులో కొంతమంది ఏమంటారంటే, ఆ అధికారాన్ని పట్టుకుని మొత్తం ఎలా అయితే కూర్చున్నారో, ఈ పార్టీలను చీల్చడమో, కొనడమో, ఇండియా కూటమి నుంచీ కొనడమో , ఆ పార్టీలను చీల్చడమో ఇవన్నీ చేస్తారని! చేసి వాళ్ళంతట వాళ్లు మెజారిటీ తెచ్చుకుంటారని ఒకమాట కూడా వినపడుతోంది.
అయితే నాకు ఇందులో ఒక చిన్న అనుమానం ఏమిటంటే, ఇప్పుడు మీరు బలంగా వున్నప్పుడు ఎన్ని చేసినా చెల్లుతుంది. ఒక మాట అంటారు, వయసులో వున్నప్పుడు ఏంతిన్నా అరుగుతుందని, అలాగ బలహీనపడిన తర్వాత, ఇలాంటి ప్రయత్నం ఏదోకటి జరుగుతోందంటే, వీళ్లంతా కూడా వూరుకోరుగా! వాళ్లు తప్పకుండా దాన్ని ప్రతిఘటిస్తారుగా! ఇప్పుడు ఇవ్వాళ వున్నటువంటి మిత్రపక్షాలలో భారతీయ జనతా పార్టీ నుంచీ ఇలాంటి అనుభవం ఎదురుకానటువంటివాళ్లు ఎవరూ లేరు. ఉదాహరణకు, తెలుగుదేశాన్నే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులుగా వున్న కొంతమందిని గతంలో వాళ్లు తీసేసుకున్నారుగా! అలాంటప్పుడు ఈసారి అలా చేయరు అని జాగ్రత్త పడకుండా వుండారుగా! అలా చేస్తారు అనే జాగ్రత్త పడతారు. ప్రతివాళ్లు జాగ్రత్త పడతారు. వీళ్లేం చేస్తారో తెలుసు.
ప్రభుత్వాలను పడగొట్టారు, కొన్నారు, వాళ్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రాల్లో చేశారు, రాజస్థాన్ లో చేయబోయారు కానీ కుదరలేదు. అందుకని అందరూ జాగ్రత్తగా వుంటారు. వాళ్లు ప్రయత్నాలు చేయరు అని అనటం లేదు. వాళ్లు ప్రయత్నాలు చేస్తారు, వీళ్లు జాగ్రత్తగా వుండటమూ జరుగుతుంది. అయితే వాళ్లు చేసేటటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. సఫలీకృతం కావాలని వాళ్లు కోరుకుంటారు, దానికోసం అన్ని ప్రయత్నాలూ చేస్తారు. వాటిని మేము అడ్డుకోవాలి అని హెచ్చరికగా వీళ్లు కూడా వుంటారు. అందుకే నేనంటున్నాను, ఇదంత సజావుగా నల్లేరు మీద బండిలాగా వుండేటటువంటి ప్రభుత్వం కాదు. కాకూడదు. ఇది, చాలా వొడిదుడుకులతోటి వెళ్లే ప్రభుత్వపు నడక అని నాకనిపిస్తోంది.
సజయ: వొడిదుడుకులతో వుంటే వచ్చే పరిణామాలు ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం ప్రజారంగంలో వున్నటువంటివాళ్లకు వుంటుంది . అలాఅనీ, అన్ని వొడిదుడుకులనూ చక్కదిద్దుకుని వీళ్లంతా చెట్టాపట్టలేసుకుని నడిస్తే వచ్చేటటువంటి పరిణామాలూ ఎట్లా వుంటాయి?
పరకాల ప్రభాకర్: వాళ్లకు పూర్తి మెజారిటీ వుండి, ఎవరిమీదా ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసివుంటే, అయినాగానీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేశాము కాబట్టి వాళ్లను కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటే ఒకరకంగా వుండేది. కానీ ఇప్పుడు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా గానీ అది వీళ్ళతో మాట్లాడకుండా తీసుకోవటానికి కుదరదు. అలాంటప్పుడు, ఈ హిందూ ముస్లిం విషయాల్లో బాగా దూకుడుగా వెళ్లారనుకోండి, అది నితీష్ కుమార్ కి, చంద్రబాబు నాయుడు కి అంగీకారం కాకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్ కి, నితీష్ క్యాస్ట్ సెన్సెస్ కి కమిట్ అయివున్నారు. అలాగే, సిఎఎ గానీ, జ్ఞానవాపి లాంటివి గానీ వస్తే వీళ్ల మద్ధతు లేకుండా చేసే పరిస్థితి లేదు. లేనప్పుడు, మొత్తానికి ఏదో ఒక కట్టడి వుంటుంది అని నా ఉద్దేశం. కట్టడి, వీళ్లు భారత రిపబ్లికు, ఇది లౌకికవాదంగా వుండాలి, వైవిధ్యభరితంగా వుండాలి అనే విలువలకు కట్టుబడి వుండి కాదు. వాళ్ల వాళ్ల ఉనికి కోసం అన్నా చేయగలగాలి. ఇవన్నీ పొలిటికల్ కంపల్షన్స్. అంచేత అంత దూకుడుగా మోదీ గానీ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డిఏ గానీ, ఈయన వున్నా లేకపోయినా, ఇంకెవరైనా వున్నాగానీ అంత దూకుడుగా వెళ్లే అవకాశం వుంటుందని నేను అనుకోవటం లేదు. కట్టడి పడుతుంది. అడ్డుపడతారు.
ఇంకోటి, ఈ ఎన్నికలు, వీటి ఫలితాల్లో నిక్షిప్తమైనటువంటి, నిబిడీకృతమైనటువంటి సందేశం ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. ప్రజలు హిందూ ముస్లిం గొడవల అంశాన్ని వొప్పుకోలేదు. ఉత్తరప్రదేశ్ లోనే వొప్పుకోలేదు. ఒక నితీష్ కుమార్ గానీ, ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ, భారతీయ జనతా పార్టీతో జతకట్టినా కూడా నెగ్గారు కానీ, జతకట్టడం వల్ల మాత్రమే నెగ్గలేదు. జతకట్టడం వల్ల ఇంతో అంత వ్యతిరేకత వచ్చినాకూడా, స్థానికంగా వున్నటువంటి పరిస్థితుల వల్ల, ఇక్కడ జగన్మోహనరెడ్డిని ఏమైనా సరే వోడించాలనుకుని ఈయన భారతీయ పార్టీ తో జత కట్టినా గానీ నెగ్గగలిగాడు కానీ, అదే మామూలుగా వుండి వుంటే, ఎంతో కొంత నష్టమే జరిగివుండేదిగా! ఆ మాత్రం ఆయనకు తెలియదా? తెలుసు. అంచేత, ఈ ఎన్నికల్లో వుండే సందేశాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకుంటారు. బేరాలు కుదరాలి, మోదీ చుట్టూ వున్నవాళ్లు వొప్పుకోవాలి, ఆయన నైజం మారాలి. ఆయన రాత్రికి రాత్రి అటల్ బిహారీ వాజిపేయీలాగా మారితే పరిస్థితి ఏమిటి అని చెప్పలేము గానీ, మారతారని మాత్రం నేను అనుకోవటం లేదు.
సజయ: ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చినప్పుడు, చాలా స్పష్టమైన డిమాండ్స్ ఇక్కడి వాళ్లకు వున్నాయి. అవి కూటమిలో సఫలీకృతం చేసుకోవటానికి బేరసారాల్లో గట్టి ప్రయత్నం చేస్తారు అని చెబుతున్నారు. అవ్వలేదనుకోండి, కేసులు వంటి వాటి వల్ల బలవంతాన వుండే పరిస్థితి ఏమైనా వుంటుందా?
పరకాల ప్రభాకర్: కస్టమవుతుంది. భారతీయ జనతా పార్టీకి, మోదీ గారికి స్వయంగా బలం వుండుంటే భయపడొచ్చు. నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఏమవుతుంది? ప్రభుత్వం ఏర్పడదు కదా! తర్వాత రాజకీయంగా ఇవాళ వచ్చినటువంటి ఫలితాలను బట్టి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు నితీష్ కుమార్ గారు కానీ, మేము మోదీ వల్ల నెగ్గాము అని అనుకోవటం లేదుగా! మావల్ల నాలుగు సీట్లు వాళ్లకు వచ్చాయి గానీ, వాళ్ల వల్ల మాకు సీట్లేమీ రాలేదనేది స్పస్టంగానే వుందిగా వాళ్లలో! అలాంటప్పుడు ఎందుకు భయపడతారు? భయపడవలసిన అవసరం లేదు, ఆబ్లిగేషన్ లేదు. ఇంకోటేమిటంటే, 2018లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచీ బయటకువచ్చి, కేంద్రప్రభుత్వం నుంచీ విరమించుకున్నప్పుడు ‘ప్రత్యేకహోదా’ ఇవ్వట్లేలేదనే కారణం చూపించి చంద్రబాబు బయటకు వచ్చారు. ఇప్పుడు నీమీద ప్రభుత్వం ఆధారపడి వుంది. నువ్వు చెప్పినట్లు చేసే పరిస్థితి వుంది అక్కడ. మరి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావటం లేదని నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతారు! దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది! ఇక్కడ ఆయనకు పునాదులు కదులుతాయి! విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చూడాల్సిన అవశ్యకత; విశాఖపట్టణం రైల్వే జోన్ తీసుకురావల్సిన అవసరం, బాధ్యత విజయవాడ, విశాఖపట్టణాలలో మెట్రోరైలు తెచ్చుకోవలసిన బాధ్యత అమరావతికి నిధులు తెచ్చుకోవలసిన అవసరం వుంది! ఈసారి మట్టి, నీళ్లు ఇస్తే వూరుకుంటారా? అలానే పోలవరం పూర్తి చేయించాలనీ, చరిత్రలో మిగిలిపోవాలనే తపన ఆయనకీ వుంటుంది.
చేయించే బాధ్యత కూడా తీసుకోవాలి కదా! ఇన్ని డిమాండ్లు పెట్టి అక్కడికి తీసుకెళ్లినపుడు, అందులో ఇదివారకులాగా చూద్దాములే, చేద్దాములే అంటే కుదరదుగా! ఏమిటో చెప్పండి అని నిలదీయాలిగా! వెనక్కి వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన ఫీల్ అవుతాడు కదా! అవకుండా అయితే వుండలేదు కదా! ఇలాగే, నితీష్ కుమార్ గారు, మీరు ఏమైనా, ఎన్డీఏ లో మిత్రపక్షంగా వున్నాగానీ, క్యాస్ట్ సెన్సెస్ డిమాండ్ పెట్టాము. జనాభా ఎంతో, ఎవరెవరు ఎంతో గణించాలని అన్నాము. రేప్పొద్దున దానికి దామాషాగా ఏమేం చేస్తారు అని అడగాలి కదా ఆయన. వాళ్లు కూడా స్పెషల్ స్టేటస్, స్పెషల్ పాకేజీ ఎప్పటినుంచో అడుగుతున్నారుగా! వారికి అనేకరకాలైన ఆర్థికపరమైన డిమాండ్లు వున్నాయిగా! చాలా తొందరలో వాళ్లకి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కూడా! ఆ ఎన్నికలు వచ్చేముందు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచీ సాధించి తీసుకువచ్చాము అనేమాటను చెప్పుకునే పరిస్థితిలో వాళ్లు వుండాలిగా! ఇవి వుండాలంటే, వెంటవెంటనే ఇది చేయి అది చేయి అని చెప్పాలిగా! అడిగినప్పుడు వాళ్లు చేయాలి. మేము మద్ధతు ఇచ్చినందువల్ల అక్కడ ప్రభుత్వం వుంది, ఇదిగో బీహార్ కు ఇన్ని తీసుకురాగలిగాం అని చెప్పుకోగలగాలిగా! నా ఉద్దేశంలో ఇన్ని కంపల్షన్స్ ని కాదు అని చెప్పి, కేవలం అబ్బో మోదీ గారు చాలా గొప్పవారు అని చెప్పి, ఆయన్ని ఆరాధిస్తూ కూర్చోలేరుగా వీళ్లు!
సజయ: ఎన్డీఏ ముందు వున్న సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. అదేసమయంలో ప్రతిపక్షాల ముందు కూడా చాలా తీవ్రమైన సవాళ్లు వుంటాయి. ఇండియా కూటమిగా వుండే ప్రతిపక్షంలో వుండే సవాళ్ళేమిటి? వారు చేయాల్సిన పనులు ఏముంటాయి? ఎలా చేయాల్సి వుంటుంది?
పరకాల ప్రభాకర్: మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే, వాళ్లతో వున్నటువంటివాళ్లు జారిపోకుండా చూసుకోవాలి. వాళ్ల వాళ్ల పార్టీలు చీలిపోకుండా, వారి సభ్యులను కొనేయకుండా, వారిని ప్రలోభపెట్టి తీసేసుకోకుండా చూసుకోవాలి. వాళ్లు ఇవాళ ఎంతమంది వున్నారో అంతమంది వుండేలాగా, ఇంకా ఇద్దరినో ముగ్గురినో కలుపుకునేలాగా వుండటం ఒకటి. వచ్చే ఎన్నికలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు. ఈలోపల కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా వున్నాయి. నేను ముందే చెప్పినట్టు, ఈ లోక్ సభ అట్టే ఎక్కువకాలం వుండేట్టు నాకనిపించడం లేదు. అంచేత, ఎప్పుడో వస్తాయిలే ఎన్నికలు అనికాకుండా, ఎప్పుడొచ్చినా కూడా మనం మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనేదాని మీద ఒక అవగాహనకు రావాలి. అందులోనుంచీ మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అనేదాని మీద ఒక అవగాహన పెంచుకుని, వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గానీ మనం పూర్తి విజయం వైపు వెళ్లడానికి ఈ రకమైన విభజిత ఎజండాకు ఎలా అడ్డుకట్ట వేయగలుగుతాము అని ఆలోచించుకోగలగాలి. ఇది ముఖ్యమైనటువంటిది. కానీ, అంతకుమించి దేశం ముందు, సమాజం ముందు చాలా పెద్ద సవాలు వుంది. నా ఉద్దేశంలో గత పడి సంవత్సరాలుగా, ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున సమాజం మీద విషప్రయోగం జరిగింది. అంటే ప్రజల మనసుల్లో విషయాన్ని చొప్పించారు. మనకి చాలా సంవత్సరాల నుంచీ, దశాబ్దాల నుంచీ, బహుశా శతాబ్దాల నుంచీ మన ముందు ఒక ప్రశ్న వుంది. అది, ఈ దేశం ఎవరిది, ఎవరికి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజకీయాలు. ఒక విచారాధార ‘ఈ దేశం కేవలం హిందువులది, హిందువులకే చెందుతుంది, మిగతా వాళ్లకు ఇక్కడ స్థానం లేదు.
ఒకవేళ వాళ్లు ఇక్కడ వుండదలచుకుంటే, అణిగిమణిగి వుండవచ్చు, రెండో తరగతి పౌరులుగా, హిందువులు ఏం చెబితే అది వినేవారుగా, వారిముందు చేతులు కట్టుకుని నిలబడేలాగా, వాళ్లకి లోబడి వుండేలాగా వుంటే వుండవచ్చు. లేకపోతే కాదు. అది కూడా ఎన్నాళ్లు వుండవచ్చో మనం చెప్పలేం. కానీ, ఒకటి మాత్రం స్పష్టం, హిందువులదే ఈ దేశం’ అనేదే ఆ విచారధార. ఇది కొన్ని శతాబ్దాల నుంచీ నడుస్తోంది. కొంతమంది వున్నారు ఈ ఆర్గ్యుమెంట్ తో. మరికొంతమంది, ‘ఈ దేశం అందరిదీ, ఇది భిన్నత్వం కలిగిన దేశం, అందరికీ ఈ దేశం మీద సమాన హక్కు వుంది. ఈదేశం అందరికీ సమానంగా చెందుతుంది. నీ పుట్టుక వల్ల వచ్చినటువంటి మతమో, కులమో, ప్రాంతమో, భాషో..మరొకటో అది ఈ దేశం మీద నీకున్నటువంటి హక్కుని నిర్వచించలేవు’ అనేది మరొక ఆలోచన. ఈ రెండు కల్పనల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఈ పది సంవత్సరాలలో బాగా పదునుగా మరింత ఎక్కువగా జరిగింది. ఇవ్వాళ దానికి అడ్డుకట్ట పడింది. కానీ, ఈ విషం తొలగిపోలేదు. నరనరాల్లోకి పంపించారు. కొంతమంది తెలిసి మాట్లాడుతారు, కొంతమంది తెలియక అంటే ఆ రకమైన భావజాలంలోకి వెళ్లామనే స్పృహ లేకుండా మాట్లాడుతారు. ఉదాహరణకు, బాగా చదువుకున్నవాళ్లే, మతతత్వం వుండకూడదు, వుండొద్దు అనేవాళ్లే, అందరూ సమానమే అనేవాళ్లే నా మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు చిన్న ప్రశ్న వేస్తూ వుంటారు. ఏమండీ పరకాల గారూ, ఈ క్రైస్తవులకు చాలా దేశాలు వున్నాయి, ముస్లిములకు చాలా దేశాలు వున్నాయి, మరి హిందువులకు దేశం వుంటే తప్పేమిటండీ అంటారు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఏదోవిధంగా ఆ భావజాలం అయితే లోపలికి వెళ్లింది.
ఇది అలా వుంది కొన్నాళ్ళకు ప్రకోపిస్తుంది. ఇది ఒక వైరస్ లాంటిది. ఇలాంటి భావజాలం ఎప్పుడూ వైరస్ తోనే సమానం. ఈ వైరస్ కు వున్న బలమేమిటంటే, ఇది అలా అణిగిమణిగి వుంటుంది. ఇది ఎంతకాలమైనా వేచి చూడగలదు. అది ఒకరోజా .. వందేళ్ళా .. అంతవరకూ కూడా వుండగలదు. అలా వుండి, సమాజంలో రోగనిరోధక శక్తి క్షీణించినప్పుడు, తగ్గినప్పుడు ఒక్కసారిగా ప్రకోపిస్తుంది. అంటే, ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, 1925లో ప్రారంభమైన ఒక ప్రయత్నం ఇప్పటికీ ఈ దశకు చేరుకుంది. అంచేత, ఈ విషం తొలగాలంటే, ఈ విషానికి విరుగుడు ప్రజల మనసుల్లో నాటడానికి చాలా సమయం పడుతుంది. నా ఉద్దేశంలో కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా ఈ దేశం హిందువులది మాత్రమే అనేవాళ్లు కొంతమంది వుంటారు, ఇంతకుముందు వున్నారు, ఎప్పటికీ వుంటారు కూడా! వాళ్లు సున్నా అయిపోరు, వుంటూనే వుంటారు కూడా! కానీ, వాళ్ళకంటే చాలా ఎక్కువమంది ఈ దేశం అందరిదీ అనే భావనలో వుంటారు. దానిని పునరుద్ధరించాలి. దానిని మరింత పటిష్టం చేయాలి. నా ఉద్దేశంలో ఈ ప్రయత్నం, ఈ విషయాన్ని విరిచేటటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీల వల్ల కాదు. ఎందుకంటే, రాజకీయ పార్టీలు నాలుగు వోట్ల కోసం, నాలుగు సీట్ల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టటం, లేకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టే వాళ్ళతోని కలిసి పది సీట్లు సంపాదించుకోవచ్చు అని ఎక్కడో ఒకచోట రాజీ పడిపోవటం, జరుగుతున్నదంతా అదే కదా! లేకపోతే వాడితోని వుండాల్సిన అవసరం ఏమిటి వీళ్లందరికీ! భావసారూప్యత లేకపోయినా వాళ్లతోని వుంటున్నారంటే, దానివల్ల వాళ్లకి ఇంతో అంత మేలు జరుగుతుంది అనుకోవడం, స్వప్రయోజనాల కోసమే కదా!
పౌరసమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడేవారికి ఆదరణ వుండదు అనేటటువంటి భయం వుంటే గానీ వీళ్లందరూ మాట వినరు. అంటే పని ఎక్కడ జరగాలి? రాజకీయ పార్టీల వల్ల కానీ పని ఇది. అంటే పౌర సమాజంలో ఈ విధమైన భావజాలాన్ని, విషాన్ని విరిచే పని ప్రతిచోటా జరగాలి. ఉదాహరణకు, 2014 కి ముందు ప్రతి రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీతో సహా సెక్యులర్ అని చెప్పుకునేవాళ్లు. ఈ బిజేపీ వాళ్లు ఎలా చెప్పేవారూ, ‘మేము కూడా సెక్యులరే కానీ కాంగ్రెస్ లాగా కమ్యూనిస్టులలాగా కుహనా సెక్యులర్ కాదు, మేమే అసలు సిసలు సెక్యులర్, లౌకికవాదులం’ అనేవాళ్లు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాము అని చెబుతారు. ఇప్పుడేమిటి పరిస్థితి, కొన్ని కొన్ని మినహాయింపులు తీసేస్తే, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ‘మేము కూడా హిందువులమే కానీ వాళ్ల లాగా కాదు’ అని అంటున్నారు. మేము కూడా సెక్యులరే వాళ్లలాగా కాదు అనేదాని నుంచి భారత రాజకీయ పరిభాష, రాజకీయ సంవాదం ఎటు వెళ్లిందంటే, మేము కూడా మంచి హిందువులమే అనేదాకా వెళ్లింది. మేము నలుగురునీ గౌరవించే హిందువులమి అని వీళ్లు అంటున్నారు.
అయితే, భారతీయ జనతా పార్టీని, కొంతమందిని పక్కన పెడదాం, కానీ వాళ్లూ -మనం; మన మతం -వాళ్ల మతం; ఈ దేశం ఎవరిది అనేదానిమీద ఇటువంటి ధోరణే ప్రమాదకరం. అది బిజేపీపట్టుకొచ్చిందా, ఇంకోకళ్ళు పట్టుకొస్తారా అనేది, వేరేవాళ్లు పట్టుకొచ్చే అవకాశం వుందా అనేది పక్కన పెడదాం. ఇది పొర సమాజంలో వున్నంత వరకూ ఆ మాటలు మాట్లాడేవారికి ఆదరణ వుంటుంది. పౌర సమాజంలో ఈ మాటకి గౌరవం లేదనుకోండి, అటువంటి మాట మాట్లాడేవారిని ఆదరించరు. ఆదరించకపోతే రాజకీయ పార్టీలు కూడా దారిలోకి వస్తాయి. ఆదరణ వుంది కాబట్టే వారు ఈ మాట మాట్లాడుతున్నారు గానీ, అదే లేకపోతే ఎందుకు మాట్లాడుతారు. రాజకీయపార్టీలకు కావలసింది వోట్లు. ప్రజలు ఏం మెచ్చుకుంటే అది మాట్లాడటం మొదలు పెట్టారు కదా! ఇదివరకులాగా ఇది మా సిద్ధాంతం, వొప్పుకుంటే వొప్పుకో లేకపోతే లేదు అని అనటంలా! ఇప్పుడు ఏమంటున్నారు, మా మానిఫెస్టోలో ఏముండాలో మీరు చెప్పండి అంటున్నారు. దానికి కన్సల్టెంట్లని పెట్టుకుంటున్నారు. మీ సిద్ధాంతం ఏమున్నాగానీ, ఈ సభలో ఇలా మాట్లాడు, ఆ సభలో అలా మాట్లాడు, వాళ్లకి ఆ మాటలు చెప్పు అని ఆ కన్సల్టెంట్ చెబుతున్నాడు! అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేదాన్ని బట్టి, వాళ్ల వాళ్ల మానిఫెస్టోలని, విధానాలని మార్చుకునేటటువంటి స్థితికి ఇవాళ రాజకీయ పార్టీలు వచ్చేశాయి.
ప్రజల్లోనే ఒక చైతన్యం, ప్రజల్లోనే ఈ రకమైన ద్వేష భావానికి విరుగుడు మనం పుట్టించకపోతే, పౌర సమాజంలో పనిచేసే సంస్థలు, కార్యకర్తలు పూనుకోకపోతే, ఈపని మరో పదిహేనిరవై సంవత్సరాలు నిరంతరంగా, నిరంతరాయంగా అదేపనిగా చేయకపోతే మాత్రం చాలా దెబ్బతింటాం. మళ్లీ ఈ రకమైనటువంటి ప్రమాదం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. ఇంకొకవైపు నుంచీ చూస్తే, ఎంత విషపూరితం అయిపోయినదంటే, ఈ విషయానికి విరుగుడు ఏమిటి అని కనుక్కోవటం ఒకటయితే, మతమౌడ్యానికి మొత్తం ఆ రకమైనటువంటి విషాన్ని ప్రజల నరనరాల్లోకి ఎక్కించటానికి ఒక సైన్యం పనిచేస్తోంది. గత వంద సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చింది. ఆ సైన్యం అలానే వుంది, వుంటుంది. కొనసాగుతుంది. దానికి విరుద్ధంగా, లౌకికవాదానికి, ప్రజాస్వామ్య విలువలకీ, భిన్నత్వ విలువలకీ, సహనంతో కూడిన భారతదేశ విలువలకీ కట్టుబడి వున్నటువంటి మరో సైన్యం ఏది? అదే పెద్ద ప్రశ్న ఇప్పుడు.
ఆ సైన్యం లేకపోతే ఈ విష సైన్యానికి అడ్డుకట్ట ఎక్కడ వుంటుంది? అంచేత, మనం వూరికె ఇలా వుంటే బావుంటుంది అని మన ఇంట్లో మనం కూర్చుని, మన పుస్తకాలు మనం చదువుకుని, మన రాతలు మనం రాసుకుంటూ, మన పాటలు మనం పాడుకుంటూ, మన సంగీతం మనం వింటూ, మనం పెట్టుకునే చిన్న చిన్న మీటింగులకి వెళితే సరిపోదు. ఈ భావజాలాన్ని బాగా ప్రచారం చేసి ప్రజల్లోకి నాటుకునేలా చేసేటటువంటి ఒక సైన్యం తయారు కాకపోతే మాత్రం అవతలి సైన్యాన్ని అడ్డుకునే పరిస్థితి వుండదు. పార్టీల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ, పౌర సమాజంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులు దీన్ని ఒక ప్రధానమైన పనిగా తీసుకుని పనిచేయకపోతే మాత్రం మనదేశం చాలా ప్రమాదంలోకి వెళుతుంది.
సజయ:చాలా అవసరమైన పని, అలా పనిచేసే సమూహం తయారు కావాలి కచ్చితంగా. ఇప్పుడు దక్షిణ భారతదేశం దగ్గరికి వస్తే, ఒకప్పుడు దక్షిణభారతదేశంలో మతతత్వానికి స్థానం లేదు అనేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రత్యేకత లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు అస్సలు లేదు. దారితీసిన పరిణామాలు ఈ పదేళ్లలో వచ్చివుండవచ్చు కానీ, ఇది చేజేతులా చేసుకున్న పరిస్థితే కదా?
పరకాల ప్రభాకర్ : ఇక్కడ కొంచం జాగ్రత్తగా ఆలోచించాలి మనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ లో ఇప్పుడు ఒక స్థానం సాధించారు. ఈ పరిస్థితిని చూసి దక్షిణ భారతదేశం కూడా బాగా మతతత్వం వైపు వెళ్లిపోతోందని గబుక్కున ఒక తీర్మానానికి రావడం తొందరపాటు అవుతుందని నా ఆలోచన. అంత నిరాశాజనకంగా నాకు కనపడటం లేదు. తెలంగాణ ని తీసుకుందాం, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ త్రిముఖ పోటీలో బీఆరెస్ ఇంకొంచం పుంజుకుని వుంటే బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చి వుండేవి కాదు. ఎప్పుడైతే బీఆరెస్ బాగా క్షీణించిపోయిందో, బీఆరెస్ కి గతంలో వేసినటువంటి వోటర్లు చూస్తూ చూస్తూ కాంగ్రెస్ కి వేయలేదు. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు వీళ్ళని వోడించారు కాబట్టి. ఆ వోట్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గే అవకాశం నాకు కనిపించింది.
ఇక్కడ బీజేపీ గెలుపు వారి మతతత్వానికి ఆదరణ కాదు. స్థానిక రాజకీయ సమీకరణాలూ ఒక అంశం . ఆంధ్రప్రదేశ్ వైపుకి వస్తే, అక్కడ బిజీపీకి పడిన పది వోట్లలో తొమ్మిది వోట్లు టీడీపీ వల్ల పడ్డాయి తప్పించి, బిజేపీ ఎజండా వల్ల కాదు. ఇంక కేరళ విషయానికి వస్తే, అక్కడ పోటీ చేసినాయిన బాగా ప్రజాదరణ వున్న ఒక నటుడు. బీజేపీకి వున్న కొంత వోటు ఆయనకున్నటువంటి ప్రజాదరణ, అక్కడి స్థానిక సమీకరణాలు కలిసి వాళ్లకి అక్కడ ఒక స్థానం వచ్చింది. అక్కడ గుళ్ళు వున్నాయి, గురువాయూర్ టెంపుల్ వుంది, ఇతరత్రా అంశాలు వున్నాయి కానీ, అక్కడ ఇతను కాకుంటే వారికి కష్టమే అయ్యేది. ఇటువంటి స్థానిక పరిస్థితులూ, పార్టీ రాజకీయాల సమీకరణాలు చూడాలి. ఇక కర్ణాటక. కర్ణాటకలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా బిజీపీ అధికారం కోల్పోయింది కానీ, వారి వోటు క్షీణించలేదు. అధికారం కూడా ఎందుకు కోల్పోయింది, అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది.
దాన్ని బలహీనపర్చి వీళ్లు అధికారంలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అందుకని, అక్కడ పెద్దగా రాజకీయంగా మార్పు జరిగిందని నేను అనుకోవటం లేదు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా, నా పరిశీలన ప్రకారం, కోస్తా కర్ణాటక, బెంగళూరు, చుట్టుపక్కలా బిజీపీకి పట్టు సడలలేదు. వారి వోటు అలానే వుంది. అంతకుముందుదే పునరావృతం అయింది. అక్కడ, అంతో ఇంతో కోస్తా కర్ణాటకలో వాళ్లు వేళ్లూనుకున్నారు, అది పెకలింపబడలేదు. మనకు పరిస్థితి అర్థం అవుతుంది. తమిళనాడులో కూడా అక్కడక్కడా ఇంతకు ముందుకంటే వారి వోటింగ్ శాతం పెరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎన్నికల్లో పార్టీ సమీకరణాల మధ్య జరిగినవే. ఇప్పుడు బెంగాల్ తీసుకుందాం. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ తో కలిపి పోటీ చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది అన్నారు. నిజానికి వాళ్లు కలిసి పోటీ చేయకపోతేనే మంచిదని నేను రెండు మూడు చోట్లా కూడా చెప్పాను.
విడిగా పోటీ చేస్తే అందరికీ లాభం వుంటుంది, కలిసి పోటీ చేస్తే నస్తమే అని చెప్పాను. చాలామంది డాన్ని కొట్టి పారేశారు. తృణమూల్, సిపిఎం, కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే దానికి ప్రతిపక్షం గా బీజేపీ మాత్రమే వుంటుంది. వీళ్ళంటే ఇష్టం లేనివాళ్ళకి ఒకటే ఆప్షన్ వుంటుంది. ఎక్కువమంది పోటీలో వుంటే అందరికీ లాభం వుంటుందనేది నా వుద్దేశం. చాలామంది ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఎంఐఎం బిఎస్పీ లను ఉదాహరణలుగా చూపిస్తారు. ఫలానా చోట ఎంఐఎం కి రెండు వేలు పడ్డాయి, బిఎస్పీకి రెండు వేలు పడ్డాయి అంటారు. ఎంఐఎం పోటీలో లేకపోతే గనుక బిజీపీ వోడిపోయేది అని చెబుతారు. అలా ఎలా చెబుతాము మనం. వాళ్లు గనుక పోటీలో లేకపోతే ఆ రెండు వేలూ బీజేపీకే వెళ్లేవేమో ఎవరికి తెలుసు! అందుకే మనం ఒక నిర్ణయానికి వచ్చేసి, కన్క్లుషన్ కి వచ్చేసి చెప్పకూడదు. ఇవి చాలా కాంప్లికేటెడ్ ఎలక్టోరల్ అరిత్మాటిక్స్.
సజయ :అసలు మన ఎన్నికల సిస్టమే బహుళ పోటీ విధానం, రెండు పార్టీలు మాత్రమే వుండవు కదా?
పరకాల ప్రభాకర్ : మన ఎన్నికల సిస్టమ్ లో పెద్ద దోషం వుంది. మెజారిటీ ఏ డివిజన్ లోనూ రావాల్సిన అవసరం లేదు. సమీప ప్రత్యర్థి మీద ఒక్క వోటు ఎక్కువ వచ్చినా గానీ సరిపోతుంది, నెగ్గేసినట్లే. ఇవన్నీ వున్నాయి ఇందులో. వీటిని పక్కన పెట్టి, ఈ విష భావజాలానికి ఆదరణ లేకుండా చేయటమనే పని జరగాలి. అది కేవలం పౌర సమాజం, అందులోని లోని సంస్థలు, వ్యక్తుల వల్ల జరుగుతుందని నా నమ్మకం. రాజకీయ పార్టీలవల్ల అంత కాదు. పౌర సమాజం గనుక ఈ పని చేస్తే రాజకీయపార్టీలు పార్టీలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడటానికి సందేహిస్తారు, జాగ్రత్తగా వుంటారు. ఈ పని పౌరసమాజం చేతిలోనే వుందని నేను బలంగా నమ్ముతున్నాను.
సజయ: థాంక్యూ. పౌరసమాజం బలంగా పనిచేస్తేనే మతతత్వాన్ని అడ్డుకోగలమని చెబుతున్నారు ప్రభాకర్ గారు. అది నిజం కూడా. మీకు ప్రజాతంత్ర తరఫున మరోసారి ధన్యవాదాలు