- సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ
- ఏడాదిలో సుప్రీమ్ కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు
- హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ
- జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 29 : సంస్థ పట్ల మద్ధతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నానని చెప్పారు. సుప్రీమ్ కోర్టు ఆవరణలో జరిగిన హైకోర్టు జడ్జిల సదస్సును సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీలను ఏడాదిలోపు భర్తీ చేయగలిగామని వెల్లడించారు.
మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికీ ఖాళీలున్న హైకోర్టు సీజే పేర్లను పదోన్నతి కోసం పంపాలని కోరారు. ఏడాది కాలంలో సుప్రీమ్ కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు, హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వొచ్చారని చెప్పారు. తనకు సహకరించిన కొలీజియం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో హైకోర్టు జడ్జిల నియామకం, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, జడ్జిల వేతనాలు, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు పెంచడంపై చర్చించారు.
దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సూచించాలని సంబంధిత కోర్టు ప్రధాన న్యాయమూర్తులను సీజేఐ జస్టిస్ రమణ కోరారు. ఖాళీలను భర్తీ చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణలు అమలుకు శ్రీకారం చుట్టడంపై చర్చించారు. జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సుప్రీమ్ కోర్టు ఆవరణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు నిర్వహించారు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సదస్సు జరిగింది. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.