– పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా
– ఎమ్మెల్యే యాదయ్యను నిలదీసిన ప్రజలు
– ఎస్ఐ సస్సెన్షన్.. నిందితుడి ఆచూకీ కోసం రూ.2లక్షల రివార్డు
రంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 11 :రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ స్థానికులు నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి షాబాద్ పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హా ఇచ్చారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షాబాద్‌లో బాధితులను కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల బంధువులు షాద్‌నగర్-కంది రహదారిపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఇదిలావుంటే పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తామన్నారు. ఈ ఘటనలో షాబాద్ ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, టోల్‌ప్లాజా వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
ఘటనా స్థలిని పరిశీలించిన సిపి తరుణ్ జోషి
ఘటనా స్థలిని పరిశీలించిన ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి ఆరు హత్యల కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. రాత్రి హత్య జరిగిందని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రెండు ప్రాంతాల్లో హత్యలు జరిగాయని పేర్కొన్నారు. మొదట షాబాద్‌లోని బాధితురాలి ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు రాజ్ కుమార్ వెళ్లాడని, అక్కడ బాధితురాలి తల్లిని, నానమ్మను హత్య చేశాడని చెప్పారు. ఆ తర్వాత బాలికను నగర్‌కుంట దగ్గరకు తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలను చంపేశాడన్నారు. తమకు సమాచారం రావడంతో ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. రాజ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ఏడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. భార్యాపిల్లలను కూడా రాజ్‌కుమార్ చంపడం తమను ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. సొంత కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడన్నదే మిస్టరీగా ఉందన్నారు.
బెయిల్ రాకుండా అడ్డుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే : కేటీఆర్
హైదరాబాద్ : షాబాద్‌లో ఆరుగురిని హత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. షాబాద్‌లో జరిగిన సంఘటన అతి దారుణమైంది.. అందరం కూడా కలత చెందే ఒక దారుణ వార్త అని అన్నారు. పోక్సో కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర ప్రభుత్వం తన వాదనలను పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నానని అన్నారు. ఆ అమ్మాయి, కుటుంబ సభ్యులు భయపడుతూ ఆ దుర్మార్గుడికి బెయిల్ ఇవ్వొద్దు అని చెప్తుంటే కూడా పెడచెవిన పెట్టి కోర్టులో న్యాయమూర్తికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగిందన్నారు. ఈ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వాదించిన న్యాయవాదుల వైఫల్యమే కారణమన్నారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నరు.. ఏ కారణం చేత వాళ్లకు బెయిల్ ఇచ్చి ఈ మానవ మృగాలను సమాజంలోకి వదులుతున్నారు.. ఎవరు బాధ్యులు.. అని కేటీఆర్ అడిగారు. సిగ్గులేకుండా పబ్లిక్ ప్రాపిక్యూటర్లు నోరు మూసుకుని కూర్చుంటే రేపటి రోజున ఆడపిల్లలు ఏమన్నా జరిగితే బయటకు వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తరని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




