దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా

నాలుగు వేలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య
ప్రియాంకకూ కొరోనా పాజిటివ్‌

న్యూ దిల్లీ, జూన్‌ 3 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌ ‌కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ‌వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం.ఇక కొవిడ్‌ ‌కారణంగా పది మంది మృతి చెందారు. అలాగే యాక్టివ్‌ ‌కేసులు కూడా 20 వేల మార్క్‌ను దాటి 21,177కి చేరాయి. డెయిలీ పాజిటివిటీ రేటు..0.60 శాతంగా, వీక్లీ రేటు 0.56 శాతంగా నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే బుధవారం..2, 745 కేసులు నమోదు అయ్యాయి.

నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత మూడు వేల మార్క్‌ను దాటగా గురువారం యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 19, 509 ఉండగా..శుక్రవారం ఆ సంఖ్య 21, 177కి చేరింది. కొరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే..మాస్క్ ‌నిబంధనను మళ్లీ తెస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ ‌పవార్‌ ‌ప్రకటించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాలా చోట్ల కొరోనా నిబంధనలకు కాలం చెల్లింది. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటి గురించి ఆలోచించాలంటూ కేంద్రం, పలు రాష్ట్రాలను అప్రమ్తతం చేస్తుంది.

ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌
‌కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కూడా కోవిడ్‌ ‌బారినపడ్డారు. స్వల్ప కొరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం చేసిన కోవిడ్‌ ‌నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కొరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page