రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం దిల్లీకి వెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. జాతీయ వి•డియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో భేటీ అవుతారు. 22వ తేదీన సీఎం ఛండీగఢ్‌కు వెళ్తారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు.
వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెకులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి చేపడతారు. సుమారు 4 రోజులపాటు సీఎం కేసీఆర్ చండీగఢ్‌లో గడుపుతారు. 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమవుతారు. 27న బెంగళూరు నుంచి రాలేగావ్ సిద్దికి వెళ్తారు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకొని..తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. 29 లేదా 30వ తేదీన.. బెంగాల్, బీహార్ రాష్టాల్ర పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్ధం కానున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోనున్నారు.