‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించ బడింది. స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి రోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుప బడుతుంది. తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశ ప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ ‌గాంధీ అప్పట్లో చిన్న  వయస్కులైన నేతల్లో ఒకరు. రాజీవ్‌గాంధీ 1944లో ఆగస్ట్ 20‌న ముంబైలో జన్మించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్‌ ‌వయసు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆయన తల్లిదండ్రులు ఇందిరా ఫిరోజ్‌  ‌లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. 1984 అక్టోబర్‌ 31‌న తల్లి ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధాన మంత్రిగాను, కాంగ్రెస్‌ అధ్యక్షునిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు.   లోక్‌ ‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మే 20 మధ్యాహ్న సమయంలో బయలుదేరి భువనేశ్వర్‌ ‌మీదుగా, ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని కొన్ని నియోజక వర్గాలలో పర్యటించారు. లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా…రాజీవ్‌ ‌పర్యటనకు వినియోగిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికి చివరికి మరమత్తులు చేయించి సాయంత్రం 6.30కి వైజాగ్‌ ‌నుంచి బయలుదేరి చెన్నై చేరుకొని, సాయంత్రం 8.30ని, లకు స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకురాలు మరకతం చంద్రశేఖర్‌ ‌తో కలసి గ్రాండ్‌ ‌వెస్ట్రన్‌ ‌ట్రంక్‌ (+ఔ•) ‌రోడ్దు ఆలయ ప్రాంగణములో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

భారీగా వచ్చిన జనాన్ని నివారించే చర్యలు చేపట్టి, కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు కొందరు వి.ఐ.పి లను మాత్రమే కట్టుదిట్టమైన భద్రత ద్వారా ఆయన్ని కలవటానికి అనుమతించారు. అయినప్పటికి  రాజీవ్‌ ‌గాంధీ ఉన్న వేదిక పైకి  అనుమతి పొందిన వారితో పాటుగా థాను, శివరాజన్‌, ‌హరిబాబులు ( ముఖ్యమైన ముద్దాయిలు గుర్తించ బడ్డారు) కూడా వెళ్ళారు. థాను అనే ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని రాజీవ్‌గాంధీ వైపు మళ్లింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..తన నడుముకు ఉన్న ఆర్డీఎక్స్ అనూహ్యంగా  ప్రయోగించింది. చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. అలా రాజీవ్‌ ‌గాంధీ హతమార్చ బడ్డారు. ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం బాధ్యులు నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీఈ ఉగ్రవాదులతో కలిసి రాజీవ్‌ ‌గాంధీ హత్యకు కుట్ర పన్నారు. మే 21న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఆ భయంకర పేలుడు జరిగిన సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ ‌నేతలు మూపనార్‌, ‌జయంతి నటరాజన్‌, ‌రామమూర్తి అక్కడే ఉన్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రాజీవ్‌గాంధీని వెతకడం ప్రారంభించారు. అప్పటి ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ముక్కలై పోయింది. దాని నుంచి బయటి కొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. పేలుడు జరిగిన సమయంలో రాజీవ్‌తో పాటు పలువురి శరీరాలు ముక్కలు ముక్కలుగా ఎగిరి పడ్డాయి. కాగా, రాజీవ్‌ ‌గాంధీని చూసేందుకు సభా స్థలికి వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు. ఆ రోజు అందరి శరీరాలు ముక్కలు ముక్కలుగా మారిపోయాయి. రాజీవ్‌ ‌సెక్యూరిటీ అధికారి ప్రదీప్‌ ‌గుప్తా కొంత సేపు ప్రాణాలతో బతికినా తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రాజీవ్‌ ‌గాంధీ శరీరం కనిపించింది. ఆయన లోటో బూట్లు, తెగిపడిన చేయి, దానికి ఉండే వాచ్‌లను చూసి అవి రాజీవ్‌ ‌గాంధీయేనని నిర్ధారించారు.

రాజీవ్‌ ‌హత్య జరిగిన రోజు 10 గంటల 25 నిమిషాలకు ఢిల్లీలో రాజీవ్‌ ‌నివాసం 10 జన్‌పథ్‌ ‌లో  అప్పటికే సోనియా, ప్రియాంక కూడా నిద్రకు ఉపక్రమించారు. అయితే రాజీవ్‌గాంధీ ప్రైవేటు సెక్రటరీ జార్జ్‌కు ఓ ఫోన్‌ ‌వచ్చింది. రాజీవ్‌ ‌గాంధీ హత్యకు గురయ్యారనే వార్త తెలియగానే ఇంటి లోపలికి పరుగెత్తి సోనియా గాంధీకి తెలియ జేయడంతో ఆమె వెంటనే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నోటి మాట రాలేదు.  ఈ దుర్ఘటనలో సుమారు 14 మంది హతులైనారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి తెన్మోజి రాజరత్నం. ఈమె థానుగా పిలువ బడింది. ఈ హత్యోదంతానికి శ్రీలంక లోని లిబరేషన్‌ ‌టైగర్స్ ఆఫ్‌ ‌తమిళ ఈలం (ఎల్‌.‌టి.టి.ఈ) సంస్థ ప్రధాన కారకులు. కేసు విచారణ కోసం సీఆర్పీఎఫ్‌ ఐజీ డాక్టర్‌ ‌డీఆర్‌ ‌కార్తికేయన్‌ ‌నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.

ఈ కమిటి… హరిబాబు (ముద్దాయిలలో ఒకడు) తీసిన ఫొటోల ఆధారంగా విచారణ ప్రారంభించింది. ఈ దర్యాప్తు బృంద విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వామ్యులు అందరు ఎల్‌.‌టి.టి.ఇ. కి చెందిన వారుగా గుర్తించింది. తర్వాత కొన్ని నెలల్లోనే ఈ హత్యారోపణలతో ఎల్‌.‌టి.టి.ఇ.కి చెందిన ఏడుగురిని అరెస్ట్ ‌చేశారు. ముఖ్య ముద్దాయిలు శివరాజన్‌, ‌శుభలను వీరు ప్రాణాలతో పట్టుకొనలేక పోయారు. ప్రధాన నిందితుడు శివరాజన్‌, ఆయన సహచరులు అరెస్ట్ ‌కావడానికి ముందు సైనైడ్‌ ‌తీసుకున్నారు. కార్తికేయన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్‌ ‌హత్య జరిగిన ఏడాదిన్నర తర్వాత నివేదిక సమర్పించారు. 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటో గ్రాఫులను పరిశీలించి, వేలాదిమంది సాక్షుల్లో 1044 మంది సాక్షుల వాంగ్మూ లాలను ఉదహరిస్తూ, 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించింది.

ఈ కేసును సుప్రీం కోర్ట్ ‌ధర్మాసనం న్యాయ మూర్తులు కె.పిథమస్‌, ‌ది.పి.వాధ్వా, సయ్యద్‌ ‌షా మొహమ్మద్‌ ‌ఖ్వాద్రిల ఆధ్వర్యంలో నాలుగు మాసాలు చర్చ అనంతరం 1995 మే 5 న తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు ఉరి శిక్ష, మరి కొందరిని జీవిత ఖైదు విధించారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య కేసులో మొదట 26 మందికి మరణ శిక్ష విధించారు. తర్వాత వీరిలో ఏడుగురే దోషులుగా మిగిలారు. నళినికి, మరో ముగ్గురికి మరణ దండన పడింది. రాబర్ట్ ‌ప్యాస్‌, ‌జయకుమార్‌, ‌రవిచంద్రన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2000వ సంవత్సరంలో నళిని మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడం, మరణ శిక్ష పడిన మరో ముగ్గురికి 2014లో శిక్షను తగ్గించి, యావజ్జీవ కారాగారం విధించడం క్రమానుగతంగా జరిగాయి.
– రామ కిష్టయ్య సంగన భట్ల,9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *