తాయిలాల వీరులు!

బాపురే!
ఇంకా ఎంతని ఇస్తారు?
పొంగిపొర్లుతున్న
మీ హామీల వరద ధాటి
భరించడం మా వల్ల కావట్లేదు.
ఉచితాలకు నడకలు నేర్పే
నవరసనటనాసార్వభౌములైనజి
మీ నటన చూడలేకున్నాము.
కూర్చొంటే తాయిలం,
నుంచుంటే తాయిలమిచ్చి
ప్రజల్ని సోమరిపోతులుగా
మార్చేస్తోన్న ఓ నాయకుల్లారా!
ఇలా చూడండి,
నా మాట వినండి.
మా పుట్టి ముంచబోయే
మీ ఉచితాల హామీల వర్షంలో
తడిసి ముద్దై,
అలసి సొలసిన  నేను
కనురెప్పలు కుట్టేసుకుని నిద్రిస్తోంటే
నా కంటి పాప ఒక కమ్మని కల కంది.
అది మీకు చెప్పమంది.
ఒక  పని చేయ రాదూ!
ఇన్ని వాగ్దానాల గోల లేకుండా
ముప్పొద్దులా మా ఇళ్ళకే
వండిన ఆహారం పంపి,
మా నోట్లో మీరే పెట్టే,
మా మూతులు మీరే కడిగే
పధకాన్ని అమలుచేస్తే,
గుర్తింపులేని చాకిరీ,
జీతం లేని నౌకరీతో
వంటింటి యుద్ధంలో
సైనికులుగా మారిన,
మా ఆడోళ్ల ప్రాణం
రెక్కలు తొడుక్కుంటుంది,
వాళ్లకు కొత్త జవసత్వాలొస్తాయి.
ఓ నేతల్లారా!
మీ గెలుపు కోసం
మా బతుకులు తాకట్టు పెట్టొద్దు.
రాష్ట్రాన్ని, దేశాన్ని
మరో పాకిస్తాన్‌,శ్రీలంకల్లా మార్చొద్దు.
 -వేమూరి శ్రీనివాస్‌
9912128967

మన తెలుగు వెలుగు

భావోద్వేగాల వ్యక్తీకరణలో
ఆంగ్ల అక్షరమాలకే పట్టంకట్టి
అంతరిక్షపు ఆటల విన్యాసం
సాంకేతిక, సామాజిక
హద్దులను చెరిపేస్తున్న ఈ వేళ
కాలం కరుగుతూ, కదులుతూ
సంస్కృతి రూపు మార్చింది..!

భాషయాసల పరిణామం
గ్లోబలైజేషన్‌ దారిలో
రూటు మార్చి గేర్‌ మార్చి
దూసుకెళ్తుంది స్పీడ్‌గా..!

ఉగ్గు పాలతో ఊపిరి పోసుకున్న
గోరుముద్దల మన మాతృభాష
గత చరిత్రపు ఘనంగానే
మిగిలిపోతుందేమో..!

అమ్మ పాటల జ్ఞాపకాల తోట
మాయమయ్యిందెమో..!
పరభాషా పరిమళంలో..
మాతృభాష స్థాయి
వికసించడం ఆపేసిందెమో..!

ప్రకృతితో అప్‌ డేట్‌ అవుతూ
ప్రతి భాషలో ప్రావీణ్యం పొందుతూనే
మనమంతా తెలుగును ప్రేమించాలి.
తెలుగు వెలుగులోనే ప్రకాశించాలి.
తెలుగు మాట్లాడుతూనే జీవించాలి.
తెలుగు రాతలను గౌరవించాలి.

తెలుగు కవిత్వమై ప్రవహించాలి.
తెలుగు సాహిత్యం ప్రభవించాలి.
పోటీ ఏదైనా..
‘‘తెలుగు భావాన్ని’’ గెలిపిద్దాం..!
గడ్డ ఏదైనా..
తెలుగు భాష ను కీర్తిద్దాం..!!

-అరుణ్‌ కుమార్‌
ఫిజిక్స్‌ ఫ్యాకల్టీ,
నాగర్‌ కర్నూల్‌,
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page