భారీగా పెరిగిన మద్యం ధరలు
సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : మందు తాగక ముందే మద్యం ప్రియులకు పెరిగిన ధరలు కిక్ ఇస్తున్నాయి. మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేలా బీరు, విస్కీపై భారీగా ధరలను పెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి వొచ్చాయి. ఇప్పటికే ఓ వైపు కూరగాయలు, నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు…ఇలా మనం వాడే అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశన్నంటుతుంటే…ఇదేమీ చాలదన్నట్లుగా తాగుడుపైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చింది. క్వార్టర్ విస్కీపై 20 రూపాయలు పెంచింది. అంటే ఒక ఫుల్ బాటిల్‌పై 80రూపాయలు. ఇక బీరుపై 20రూపాయలు పెంచింది. 140రూపాయలు ఉన్న లైట్ కింగ్ ఫిషర్ 160రూపాయలకు పెరిగింది.
ఇలా అన్ని రకాల విస్కీ, బీరుపై తెలంగాణ ప్రభుత్వం ధరలను పెంచింది. ఇప్పటికే వైన్స్ దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యాన్ని లెక్కించి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపోతే.. తెలంగాణ వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి సేద తీరేందుకు కూల్ కూల్‌గా బీర్లను తాగుతున్నట్లు గురువారమిక్కడ ఓ వైన్స్ యజమాని ‘ప్రజాతంత్ర’కు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా..బీర్లు అమ్మకాలు పెరిగాయన్నారు.
గతంలో చల్లటివి తాగితే.. కొరోనా వొస్తుందనే భయంతో చాలామంది బీర్లకు దూరంగా ఉన్నారనీ, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి, మద్యం ప్రియులు ఎగబడి మరీ బీర్లు తాగుతున్నారన్నారు. ప్రస్తుతం పెళ్లిల్ల సీజన్ కావడంతో మద్యం ప్రియులు చల్లని బీర్లే గొంతులో పోస్తున్నారు. తాగేవాళ్లు ఏ ఇద్దరూ కలిసినా..నాలుగు బీర్లు తెచ్చుకుని.. చెరో రెండు లాగించేస్తున్నారు. లిక్కర్ షాపుల్లో బుధవారం రాత్రి అమ్మకాలు పూర్తవగానే ఎక్సైజ్ శాఖాధికారులు మద్యం నిల్వలను సీజ్ చేసినట్లు చెబుతున్నా అప్పటికే…ఆయా వైన్స్ దుకాణాల యజమానులు మద్యాన్ని భారీగా అక్రమంగా నిల్వలు చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలను పెంచి మద్యం ప్రియులకు చేదువార్తను అందించిందనీ పలువురు మద్యం ప్రియులు వాపోతున్నారు.