20యేండ్లు పని చేయించుకుని మెడలుపట్టి గెంటేశాడు..
ప్రతి వ్యక్తి వెలకట్టారు..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు
సిఎం కేసీఆర్‌పై గజ్వేల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్
గజ్వేల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: నేను గజ్వేల్‌కు వచ్చింది. నాకు నియోజకవర్గం లేక కాదు. నాతో 20యేండ్లు పని చేయించుకుని నా మెడలుపట్టి బయటకు గెంటివేసిన సిఎం కేసీఆర్‌కు మా సత్తా, బలం ఏమిటో చూపిస్తామనీ, గజ్వేల్ ఎన్నికలు కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ధర్మ యుద్ధం అని గజ్వేల్ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం గజ్వేల్‌లో బిజెపి పార్టీ నిర్వహించిన శంఖారావంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ పార్టీ చీఫ్, సిఎం కేసీఆర్ పార్టీలో ప్రతి వ్యక్తికి వెలకట్టి, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారనీ, చివరకు నా వ్యక్తిగత సిబ్బంది కూడా అన్నారు. హుజూరాబాద్‌లో నేను నా ప్రజల ప్రేమతో మాత్రమే గెలిచానని అన్నారు. నేను రాజీనామా చేసిన తర్వాత 6నెలల తర్వాత ఉప ఎన్నికలు జరిగాయనీ, ఎన్నికల సందర్భంగా నేను ఏ ఊళ్లో నిద్రపోతే ఆ ఊళ్లో కరెంటు బద్ చేసేవారన్నారు. గజ్వేల్ నాకు కొత్త కాదు.. మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేసిన వారికి తగు గుణ పాఠం చెప్పేందుకు మాత్రమే వచ్చానని అన్నారు. 2017లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 1,700 మంది ఉద్యోగాలు తీసేసిన ఘన చరిత్ర సిఎం కేసీఆర్‌ది అని, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనికరం కూడా లేదనీ, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని సిఎం కేసీఆర్ అన్నాడనీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు. నేను 1992 ఇక్కడ న జీవితం మొదలుపెట్టా…. ఇక్కడి రైతులుతో సంబంధం ఉన్న వ్యక్తిని. ములుగు మండలంలో 2002లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరాననీ, నేను కొత్త కాదు…. నా మాటలు కొత్త కాదన్నారు. 2014 వరకు నా పాత్ర ఏంటో అందరికీ తెలుసు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో తెలంగాణంను వినిపించాననీ, 2004లో నేను ఎమ్మెల్యే అయిన తరువాత నేను ఉద్యమంలాగా ప్రజల కోసం పోరాడినట్లు చెప్పారు. తెలంగాణ వస్తేనే మా జీవితం మారుతుంది అని నమ్మి పోరాటం చేశామనీ, కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో ఆర్టీసీ గుర్తు వస్తుందన్నారు. అధికారం లేకపోతే బ్రతక అని కేసీఆర్ కపట ప్రేమను ఒలకబోస్తారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా కూడా గెలవనని నన్ను హేళనగా మాట్లాడారనీ..హుజూరాబాద్ ఎన్నికల్లో నేను ఏమైనా కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచానా?అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాల ప్రజల కన్నీళ్లు తీర్చినవా అని అన్నారు. గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులో ముప్పు గ్రామాల ప్రజలకు ఇంతవరకు డబ్బులు ఇచ్చినవా, ముప్పు గ్రామాల ప్రజల భూములు గుంజుకొని వారికి ఉపాధి లేకుండా చేశావాని అన్నారు. హుజురాబాద్‌లో నన్ను రాసి రాంపన పెడితేనే కదా గజ్వేల్ ప్రాంతం నుండి పోటీ చేస్తున్నాని అన్నారు. ఈటల రాజేందర్ వచ్చినాకనే సర్పంచులకు, ఎంపిటిసిలకు, వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు విలువ పెరిగిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే ఆదాయపు పన్ను కట్టే రైతులకు రైతుబంధు ఇవ్వమనీ, అర్హులైన సన్న,చిన్నకారు రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామనీ, కౌలు రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేస్తామని అన్నారు.