తెలంగాణను పాలించలేని కెసిఆర్ దేశాన్ని ఏలుతడా
జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు
మునుగోడులో ఎగిరేది కమలం జెండానే
బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్
కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని, అలాంటి వ్యక్తి దేశాన్ని నడిపిస్తారని ఎవరైనా నమ్ముతారా అని మండిపడ్డారు. ప్రజలను బోల్తా కొట్టించడంలో కెసిఆర్ నంబర్ వన్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వి•డియా వి•ట్‌లో ఆయన మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తడా? అని ఈటల ఈ సందర్భంగా కెసిఆర్ జాతీయ రాజకీయాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్, దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడతాడా? అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను ఒక బఫూన్‌లా చూస్తున్నారన్న ఈటల…ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన కెసిఆర్ వల్ల ఏవి•కాదన్నారు. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ అన్నారు. కరప్షన్‌కు, కుటుంబ పాలనకు మారుపేరు కేసీఆర్ అని ఈటల దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్ దేశంలో ఏం చెల్లుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్‌లకు బిల్లులు రావాలంటే టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని టీఆర్‌ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. హుజూరాబాద్‌లో ప్రజలు ఏ తీర్పుపై ఇచ్చారో మునుగోడులోనూ అదే తీర్పు పునరావృతం అవుతుందని ఈటల జోస్యం చెప్పారు. ఉప ఎన్నిక వొస్తేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకి వొస్తాడన్నారు. యావత్ భారతదేశం మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక వైపే చూస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి దేశమంతా ఆసక్తితో ఎదురుచూస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన అంతం మునుగోడు నుంచే మొదలవుతుందని చెప్పారు. తెలంగాణ రైతులకు రుణాలను మాఫీ చేయకుండా బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులకు సీఎం కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి వొచ్చిందని ఆయన పేర్కొన్నారు.