కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

  • మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు
  • మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం
  • హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం

బెంగళూరు, జూన్‌ 3: ‌కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సు ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ ‌సహా 35 మందితో కూడిన ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది..మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్‌, ఇద్దరు క్లీనర్లు ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్ ‌బస్సు బీదర్‌- శ్రీ‌రంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వొస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు అంతటికి వ్యాపించడంలో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు. బస్సు అద్దాల పగలకొట్టి వారిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడంతో బస్సులోని.. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యం కోసం క్షతగాత్రులను కలబురిగి జిల్లా హాస్పిటల్‌తో పాటు యునైటెడ్‌, ‌గంగా హాస్పిటళ్లకు తరలించారు. మంటల్లో తీవ్రగాయాలపాలైన మరో ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిని లారీ డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్‌ ‌ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్‌, ‌దీక్షిత్‌ అనే ఇద్దరితో పాటు రవళి, సరళాదేవి, అర్జున్‌ ‌శివకుమార్‌, అనితారాజు, శివకుమార్‌ ‌చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారని పోలీసులు నిర్దారించారు. బర్త్ ‌డే పార్టీ కోసం హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు మే 29న గోవా వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *