ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్ భారతి
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్ పోరాటం వల్లే కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ సోమ్నాత్ భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే, మరణించిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆప్ తెలంగాణ నేత ఇందిరా శోభన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన ఆప్ నిరంతరం పోరాడుతుందని చెప్పారు.
అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న తెలంగాణలో పాదయాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ చేపట్టిన పథకాలను తెలంగాణలో ఇంటిఇంటికి తీసుకుపోతామన్నారు. అదే సందర్భంలో పంచాయితీ సెక్రటరీలు, విద్యా వాలంటీర్లు, పేద, బడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీల వారిగా ఉద్యమిస్తామని తెలిపారు. ప్రతి అంశంపై ఆప్ ప్రతిపక్షాలతో కలిసి పోరాడుతుందని ఇందిరా శోభన్ అన్నారు. జాతీయ పార్టీలైన బిజేపి, కాంగ్రెస్ లు భరోసా కల్పించకపోవడం వల్లే దాదాపు 70 మంది ఫీల్డ్ ఆసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. సమస్య ఎక్కడుంటే, ఆప్ అక్కడుంటుందని అన్నారు.