- పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు
- భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన
- అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం
భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిమంది పోడు సాగుదారులు భద్రాచలం పట్టణంలో కదం తొక్కారు. వేలాది మంది పోడు భూమిసాగుదారుల ప్రదర్శనతో భదాద్రి ఎరుపెక్కింది. ఆ తర్వాత సాగుదారులు, గిరిజన రైతాంగం, డివిజన్ అటవీ శాఖ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ…పోడు సాగు దారులపై అటవీశాఖ నిర్బంధాలు ఆపకపోతే ప్రతిఘటన తప్పదని అన్నారు. అటవీశాఖ అధికారుల దౌర్జన్యం వల్ల ఇప్పటికే జిల్లాలో గిరిజన రైతాంగం భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న పోడు భూములు జోలికి వొస్తే అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రభుత్వం హడావుడిగా మూడు నెలల క్రితం సర్వేలు చేస్తామని చెప్పి సర్వేలు పక్కనపెట్టి దాడులు చేయడం పోడు భూములు లాక్కోవడం హేయమైన చర్య అని అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ..2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూమి సాగు దారులపై దాడి చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దౌర్జన్యంగా భూములపైకి వొచ్చి అటవీశాఖ అధికారులు దాడులు చేస్తే ప్రజలంతా ఐక్యమై తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సిపిఐ ఎంఎల్ ప్రజా పందా రాష్ట్ర నాయకులు కెచ్చేల. రంగారెడ్డి మద్దతు తెలియజేశారు.
ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులుకుంజా శ్రీనివాసరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేసు ఎల్లయ్య, తమ్మళ్ల.వెంకటేశ్వరరావు,నుపా తిరుపతి, ఎంపీటీసీ పాలంచ రామారావు, కొరస రమేష్.బొల్లోజు వేణు, అకోజు సునీల్ కుమార్, బల్లా సాయి కుమార్, నోముల రామి రెడ్డి,అడ్డగర్ల తాతజీ, పేరలా శ్రీనివాసరావు, కల్లూరి శ్రీ రాములు, మీసాల భాస్కరరావు, నర్సింహులు,ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మారెడ్డి గణేష్, తిరుపతి రావు,కొల్లిపాక శివ,భరణి హరీష్, రమణమ్మ, మంగమ్మ, లక్ష్మీ బాయ్, తిరుపతమ్మ ,వేలాది మంది పొడు సాగుదారులు పాల్గొన్నారు.