
తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏదో చెబుతారని ఎంతో ఆశగా ఎదిరిచూసిన వారికి ఒక విధంగా నిరాశే ఎదురైందనే చెప్పాలి. భారతీయ జనతాపార్టీ గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల సందర్భంగా చెప్పిన అంశాలనే అమిత్‌షా ఈ సమావేశంలో మరోసారి వల్లెవేసారే తప్ప అందులో కొత్తదనమేమీ కనిపించలేదు. కాకపోతే ప్రసంగం మధ్యలో పలుసార్లు ప్రజలనుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారాయన. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి అవతల పారేయాలా? వద్దా? అని ఒకటికి రెండు సార్లు అడిగి, వారితో పెకిలేయాలని పించారు.
అదే వరుసలో మోదీ ప్రభుత్వాన్ని తీసుకు రావాలా వొద్దా ? అని రావాలన్న సమాధానం చెప్పించారు. వారు చెప్పే సమాధానం కెసిఆర్ చెవుల్లో పడే విధంగా పెద్దగా చెప్పాలని కూడా కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నిస్తూనే.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా నరేంద్రమోదీ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీని, ఎంఐఎం పార్టీపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. అసలు బిఆర్‌ఎస్ కారు స్టీరింగ్ అంతా ఎంఐఎం పార్టీ కంట్రోల్‌లో ఉందని, నయా రజాకార్ల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్షించడం కెసిఆర్ వల్ల జరిగే పనికాదని, అందుకు బిజెపి ఒక్కటే ప్రత్యమ్నాయంగా ఆయన చెప్పుకొచ్చారు. కెసిఆర్‌తోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదివాసీలకు చేసిందేమీలేదన్న అమిత్‌షా ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వివిధ పథకాలను మరోసారి వల్లెవేశారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 15 మంచి ముహూర్తంగా ఎంచుకున్నట్లుంది. ఈనెల 16న వరంగల్‌లో గొప్ప బహిరంగ సభను బిఆర్‌ఎస్ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ సభలో అధినాయకుడు కెసిఆర్ తమ పార్టీ మానిఫెస్టోను ప్రకటిస్తారనుకున్నారు. కాని, సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కెసిఆర్ షెడ్యూల్ కూడా మారింది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొట్టమొదటి సభ వరంగల్ అనుకన్నదల్లా ఈ నెల ఆఖరికి మారింది. 26 లేదా 27 తేదీల నాటికి ఈ సభను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ నెల 15నుండి ఎన్నికల ప్రచారానికి కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదే రోజున ముందుగా ఎమ్మెల్యేలు అందరితో తెలంగాణ భవన్‌లో సమావేశమై, ఆదే రోజున అభ్యర్ధులకు బిఫామ్‌లు ఇస్తారని తెలుస్తున్నది. పోటీ పడుతున్న పార్టీలన్నీ ఆశ్చర్యపడే విధంగా అక్కడే మానిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాని పక్షంలో అదే రోజున హుస్నాబాద్ బహిరంగ సభలోనైనా మానిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. తగవు తీరిందనుకున్న జనగామలో మరుసటిరోజున అనగా 16న, 17న సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే సభల అనంతరం ఇతర నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసే విధంగా ఆ పార్టీ ప్రణాళిక రచించింది.
కెసిఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేస్తామంటున్న కాంగ్రెస్ కూడా బస్సు యాత్రకు 15 తేదీనే ముహూర్తంగా నిర్ణయించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపు పది రోజులపాటు నిర్వహించే ఈ బస్సుయాత్రలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రారంభించనున్నారు. 20,21 తేదీల్లో రాహుల్ కూడా ఈ బస్సుయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా కేంద్రంలోని ముఖ్యనేతలంతా బస్సుయాత్రలో పాట్గొని ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రెండు రోజులక్రితం ప్రకటించిన ఎన్నిక తేదీ కౌంట్ డౌన్ మొదలైంది. అయినా ఇంకా కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధుల జాబితా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. బిజెపిలో సీనియర్ నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలని అధిష్టానం పిలుపు ఇచ్చినప్పటికీ చురుగ్గా ఉన్న చాలామంది నేతలు పార్లమెంటు ఎన్నికలవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ పార్టీ గట్టిపోటీ ఇచ్చే అభ్యర్ధుల వేటలో ఉన్నట్లు సమాచారం. ఇక కెసిఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేస్తానంటున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వారిమధ్య సీట్ల సర్దుబాటు ఇంకా తెమలటంలేదు. గతంలో కూడా అభ్యర్ధులను ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారానికి సమయంలేక మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, ఇప్పుడు కూడా అలానే జాప్యం జరుగుతుందేమోనన్న భయంలో అభ్యర్ధులున్నారు.