ఉచితాలు బంద్ చేయాలన్న బిజెపిని బంద్ చేయాలి
కాళేశ్వరం నీళ్లు పారలేదని అనవసర విమర్శలు: మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ఉచితాలు బంద్ చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బంద్ చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే 10,041 ఉండగా, అదనంగా 1103 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని, బడా బడా పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు ఓవైపు 10 లక్షల కోట్లు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేస్తూ..
మరోవైపు ఉచితాలు వద్దని అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 52, 722 మంది లబ్ధిదారులకు ఆసరా ఫించన్లు అందిస్తున్నామని తెలిపారు. దిల్లీలో బీజేపీ ప్రభుత్వంకు కళ్లు కనపడక కాళేశ్వరం నీళ్లు పారలేదనీ, అనవసర విమర్శలు చేస్తున్నదని, బీజేపీ ప్రభుత్వానివన్నీ.. పచ్చి అబద్ధాలు, జూటా మాటలని, వారి మాయలో పడొద్దని అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు కేసీఆర్..
రైతు బాంధవుడు..సీఎం కేసీఆర్ అని, సంపద పెంచి పేదలకు పంచాలనే నాయకుడని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన తొగుట మండలంలో ఇప్పటికే 7009 ఉండగా, అదనంగా 853 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా ఇలాంటి ఆసరా ఫించన్లు లేవనీ, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో సైతం కేవలం 500, 600 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని మంత్రి విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వ మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం చేయి దాటదనీ మంత్రి ఎద్దేవా చేశారు. దిల్లీ బీజేపీ ప్రభుత్వం ఉచితాలు బంద్ చేయాలని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వొస్తే 57 ఏళ్లు నిండిన వారికి ఫించన్లు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి లేని లోటు తీరుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.