ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘‌రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు, ఆరోగ్య వంతులుగా ఉండగలరనేది నిర్వివాదాంశం.’’

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ‌సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. ‌రంజాన్‌ ‌మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ ‌మాసం.. మళ్లీ నెలవంక రాకతోనే ముగుస్తుంది. రంజాన్‌ ‌ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ‌ఫితర్‌’ ‌పండుగను నిర్వహిస్తారు. రంజాన్‌ ‌నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు ఈద్‌ ‌జరుపు కుంటారు. నిజానికి ఈ రోజు 10 నెల షవ్వాల్‌ ‌కు మొదటి రోజు. షవ్వాల్‌ ‌నెలలో మొదటి రోజైన ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌ ‌నాడు ముస్లింలు ఉపవాసం చేయకూడ దనేది ఆచారం. ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదాయాలలో అవలంబింప బడుతున్న కేలండర్‌ ‌చంద్ర మాసాలపై ఆధారంగా గలది. దీన్ని ‘తఖ్వీమ్‌-‌హిజ్రి-ఖమరి’ అని కూడా అంటారు. ఈ కేలండర్‌ ‌లో 12 చంద్ర మాసాలు, దాదాపు 354 దినాలు గలవు. హిజ్రీ శకానికి మూలం ముహమ్మద్‌ ‌ప్రవక్త సంబంధిత హిజ్రా, హిజ్రాహ్‌ ‌లేదా హిజ్రత్‌. ‌మహమ్మదు ప్రవక్త , ఆయన అనుయాయులు మక్కా నుండి మదీనా కు క్రీ.శ. 622 లో వలస వెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్‌ అని అంటారు. క్రీ. శ. 622. సెప్టెంబరు లో మహమ్మదు ప్రవక్త తమ అనుయాయులతో కలసి హిజ్రత్‌ (‌వలస) ‘యస్రిబ్‌’ ‌నగరాన్ని చేరు కొన్నట్లు చెపుతారు. యస్రిబ్‌ ‌నగరానికి మదీనా లేదా ‘‘మదీనతున్‌ – ‌నబీ’’ లేదా నబీ (ప్రవక్త) యొక్క నగరంగా పేరు స్థిర పడింది. అలా ముస్లింల శకం హిజ్రీ ప్రారంభ మయినట్లు, ఉమర్‌ ‌కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్‌ ‌ప్రారంభమయినట్లు చెపుతారు.

మహమ్మదు ప్రవక్త వలస . క్రీ. శ.622 సెప్టెంబరు 9 నాడు మక్కానగరం లోని తమ ఇంటిని వదిలి, మక్కాకు దగ్గరలోని తూర్‌ ‌గుహలో మూడు రోజులు గడిపి, 622న సెప్టెంబరు 23న మక్కా పొలిమేరలు దాటి, యస్రిబ్‌ ‌ప్రాంతానికి పయనమైనారు. సెప్టెంబరు 20న మదీనా దగ్గరలోని ‘‘ఖుబా’’ ప్రాంతానికి చేరుకున్నారు ….24 సెప్టెంబరు 34న ఖుబా నుండి మదీనా ప్రయాణం సాగించి, శుక్రవారపు ప్రార్థనలు జరిపారు. 622 అక్టోబరు 4న మదీనా మొదటి దర్శనం జరిగినట్లు తెలుస్తోంది. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాకుండా, ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్‌ అవ్వల్‌ ‌నెలలో హిజ్రత్‌ ‌జరిగింది. అంటే హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్‌ అవ్వల్‌ 22 ‌వ తేదీన ప్రారంభం అవుతుంది. ఇస్లాం క్యాలెండర్‌లోని హిజ్రీ నెల స్థానిక చంద్రోదయంపై ఆధారపడి వుండడంతో మతపెద్దలు నెలవంక కనిపించగానే ఈద్‌ ఉల్‌ ‌ఫితర్‌ ‌ప్రకటిస్తారు.

ఈద్‌ అసలు పేరు ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌. ‌ఫితర్‌ ‌లేదా ఫిత్రా పదానికి అర్థం… మానవునిలో గల ప్రాకృతిక ధర్మం ప్రాతిపదికగా తనతో పాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ధర్మం ప్రకారం భాగ్యము లేని పేద వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ఈ ఫిత్రా రంజాన్‌ ‌పండుగ సందర్భంగా, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్‌ ‌పండుగకు మూడు రోజుల ముందు నుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ సంతోషంగా పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా … పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహార ధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. చంద్ర దర్శనానంతరం చిన్నవారు, పెద్దలకు నమస్కరిస్తారు, శుభాశీస్సులు పొందుతారు. పండుగ రోజున సాధారణంగా ఈద్‌ ‌ముబారక్‌, ఈద్‌ ‌సద్‌ అని శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటారు.

ఈద్‌ ‌నాడు స్నానానంతరం నూతన వస్రాలను ధరిస్తారు. పురుషులు మసీదుకు, ఈద్గాహకు వెళ్ళి, చిన్న పెద్ద, ధనిక పేద, తరతమ భేదాలు లేక వరుసలో నిలబడి నమాజు పఠిస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కుంటారు. ఇళ్ళలో పాయసం తదితర పిండి వంటలు భుజిస్తారు. స్నేహితులకు, బంధువులకు కట్న కానుకలను సమర్పించు కుంటారు. పేదలకు దానాలు చేసారు. రంజాన్‌ ‌నెలలో చేసే దానాలను ‘జకాత్‌’అం‌టారు. రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు, ఆరోగ్య వంతులుగా ఉండగలరనేది నిర్వివాదాంశం. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి ఉధృతం కాస్త తగ్గినట్లు భావిస్తున్న వేళ…పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాత్మిక చింతన, దానాలు, ధర్మాలు చేపడుతూ, నెల రోజులు దీక్షా దక్షులు అయిన ముస్లిం సోదరులు పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపు కునేందుకు ఉద్యుక్తులు అవుతున్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9449595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page