కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయినదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద కనికట్టు విద్య మహాశివరాత్రి రోజున నోట్లోంచి శివలింగాన్ని వెలికి తీయడం. దాన్ని లింగోద్భవం అంటారు. అట్లాగే శూన్యం నుంచి విభూతి సృష్టించడం.
ప్రేమానంద ఆశ్రమంలో ఉండిన మహిళా భక్తుల విషయంలో ఈ అసమాన సంబంధం తప్పనిసరిగా పట్టించుకోవలసిన అంశం. ఆ ఆశ్రమంలో శ్రీలంకకు చెందిన దాదాపు రెండు వందల మంది యువకులు, ‘‘యవ్వనంలో ఉన్న బాలికలు’’ ఉండేవారు. ఈ వ్యవహారంలో ప్రేమానంద ఆశ్రమం పని తీరు బహుశా అత్యంత దారుణమైనది. ఈ కేసును విచారించిన పుదుక్కోటై సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి ఒక మహిళ, ఆర్ భానుమతి, ఆమె ఆ తరువాత హైకోర్టు న్యాయవూర్తిగా పదోన్నతి కూడా పొందారు. ప్రేమానంద ఆశ్రమంలో జరుగుతున్న ఘోరాల గురించి బైటికి పొక్కడం మొదలైన తర్వాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆ నేరాల గురించి ప్రచారం చేసి, నేరస్తులను శిక్షించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టింది. ఆ మహిళా సంఘం ఒత్తిడి వల్ల పోలీసులు ఆ కేసును తగిన విధంగా విచారించి, సరైన చార్జిషీటు దాఖలు చేశారు.
సంస్థ అధిపతి తనకు ఉండగల అనుచిత ప్రభావంతో ఎటువంటి పనులు చేయగలడో ఈ ఉదంతం మంచి ఉదాహరణ. ఆశ్రమంలో పని చేస్తున్న వారు తమ మీద జరుగుతున్న అత్యాచారాలకు అంగీకరించడం ఎప్పుడూ స్వచ్ఛందంగా జరుగదు. అది ఎప్పుడైనా బయటికి కనబడని ఒత్తిడి వల్లనే జరుగుతుంది. తమ మధ్య ఒప్పందం సక్రమంగానే, న్యాయంగానే జరిగిందని, అవతలి పక్షానికి తన మీద ఉన్న మితిమీరిన నమ్మకంవల్ల, తాను వారి మీద అమలు చేసిన మితిమీరిన ప్రభావంవల్ల ఆ ఒప్పందం అనుచితంగా తయారు కాలేదని ఆ ప్రభావం నెరవుతున్నవారే రుజువు చేసుకోవలసి ఉంటుంది. ఎందువల్లనంటే ఇటువంటి సంబంధంలోని లావాదేవీలలో మోసానికి చాలా అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలు, యువతులు ఉన్న సంస్థలలో ఇటువంటి అనుచిత లావాదేవీల అవకాశం ఎక్కువగా ఉంటుందని క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) చట్టం 1983 కూడా గుర్తించింది. సెక్షన్ 376(2)(సి) అనే ప్రత్యేక నిబంధన ద్వారా మహిళలు, పిల్లలు ఉండే సంస్థలను నిర్వచించి, వారు అనుచిత లావాదేవీకి గురికాగల అవకాశాలను వివరించింది.
ఆ నిర్వచనం ప్రకారం ప్రేమానంద ఆశ్రమం ఒక మహిళా సంస్థగా ఆ చట్ట పరిధిలోకి వస్తుంది. ఆధ్యాత్మిక ఆశ్రమాలు మహిళా సంస్థల స్వభావాన్ని కలిగి ఉండవని అందువల్ల ఆ చట్ట పరిధిలోకి రావని వాదించడం కుతర్కమే అవుతుంది. ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఆ పనుల స్వభావాన్ని గుర్తించడం, తత్సంబంధిత చట్ట పరిధిలోకి తీసుకురావడం న్యాయవ్యవస్థ చేయవలసిన పని. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని ప్రేమానంద ఆశ్రమంలో జరిగిన అక్రమాల గురించి 1994లో మొదటిసారి బయట పడిరది. ఆ ఆశ్రమానికి అప్పటివరకూ ఒక అనాథాశ్రమంగా, ప్రత్యేకించి ఆనాథ బాలికలకు ఆశ్రయం కల్పించే ఆశ్రమంగా పేరుండేది. అక్కడ తమిళ బాలికలను,శ్రీలంక శరణార్థుల బాలికలను తీసుకునే వారు. మూడు సంవత్సరాలపాటు నడిచిన కోర్టుకేసు తర్వాత 1997లో న్యాయమూర్తి భానుమతి 13 మంది ఆశ్రమ వాసులైన బాలికలపై అత్యాచారం చేసినందుకు, ఆ అత్యాచారాలను ప్రశ్నించిన ఒక పురుష భక్తుడిని హత్య చేసినందుకు రెండు యావజ్జీవ శిక్షలు, రు.66 లక్షల జరిమానా విధించారు. ఆ జరిమానాను, 13 మంది అత్యాచార బాధితులకు తలా రు.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఆ జరిమానా చెల్లించకపోతే ప్రేమానంద మరొక 32 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని తీర్పు చెప్పారు.
ఈ కేసులో ప్రేమానంద తరపున సుప్రసిద్ద న్యాయవాది రామ్ జెత్మలానీ వాదించారు. ‘‘స్వామీజీ నిర్దోషిత్వం న్యాయవ్యవస్థకు అతీతమైనది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కింది కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టు డిసెంబర్ 2002 లో ద్రువీకరించగా, సుప్రీంకోర్టు ఏప్రిల్2005లో ధృవీకరించింది. జడ్జి భానుమతి ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశం బాధితులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిందితులు దుర్వినియోగం చేసి, తమకు అతీతశక్తులున్నాయని మోసం చేసి వారిపై లైంగికంగా అత్యాచారం జరిపారనే నేరాన్ని నిర్ధారించడం. ఆ అత్యాచారాలవల్ల గర్భవతులైన యువతులకు బలవంతంగా గర్భస్రావాలు చేయించడం , ఆ అత్యాచారాలను ప్రశ్నించిన ఒక పురుష భక్తుడిని హత్య చేయడం మాత్రమే గాక, ఆ మృతదేహాన్ని మాయం చేసి, ఆశ్రమ ప్రాంగణంలోనే పూడ్చి పెట్టడం ఇతర నేరాలు. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించి అభియోగాలు దాఖలు చేయగా అందులో ఆరుగురు పురుషులు, ఒక స్త్రీ విచారణను ఎదుర్కొన్నారు. మరొక స్త్రీ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని పోయింది. నిందితులలో ఇద్దరు పురుషులు అప్రూవర్లుగా మారి తమ నేరాన్ని అంగీకరించారు. ప్రేమానందపై మొత్తం ఏడు అభియోగాలు మోపడం జరిగింది.
ప్రేమానంద తరపున వాదించిన రామ్ జత్మలానీ ఆయనకున్న లోకాతీతశక్తుల గురించి న్యాయస్థానాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. కాని ‘‘నిందితుల తరఫు న్యాయవాది మొదటి నిందితుడికిగల లోకాతీతశక్తుల గురించి, ఆధ్యాత్మిక వైఖరి గురించి చాల వాదనలు ముందుకు తెచ్చారు. గనుక, ఆ అబద్దాన్ని బద్దలు చేయడం మొట్టమొదటి అవశ్యకతగా ఉంది’’ అని జడ్జి అన్నారు. కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయినదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద కనికట్టు విద్య మహాశివరాత్రి రోజున నోట్లోంచి శివలింగాన్ని వెలికి తీయడం. దాన్ని లింగోద్భవం అంటారు. అట్లాగే శూన్యం నుంచి విభూతి సృష్టించడం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందరికన్నా పెద్దబాబా ఇటువంటి ఇంద్రజాల విద్యలు ప్రదర్శించడం మనం గత నాలుగైదు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. నిజానికి ఒకసారి ఈ బాబా అటువంటి అద్భుతం జరుపుతుండగా పత్రికా ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామన్లు ఆ అద్భుతం వెనుక ఉన్న మోసాన్ని బహిరంగంగా పట్టుకున్నారు.
నా మిత్రుడైన ఒక న్యాయవాది, ఆ తర్వాత ఆయన న్యాయమూర్తి కూడా అయ్యారు. ఒకసారి బాబా అతీత శక్తుల గురించి నన్ను ఒప్పించానికి ప్రయత్నిస్తూ ఒక సంఘటన చెప్పారు. ఒకసారి తనకోసం ఎదురు చూస్తున్న ఒక పెద్ద భక్త జన సమూహంలో మాట్లాడుతూ బాబా ప్రత్యేకించి ఎవరివైపు చూడకుండానే తన పేరు పిలిచారట. అంత పెద్ద సమూహంలో తాను ఉన్నానని బాబాకు ఎలా తెలిసిందనీ, తనను గుర్తించడం బాబా అతీంద్రియ శక్తులను నిరద్శనమేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసలు సంగతేమంటే, నా మిత్రుడి పేరు తెలుగువాళ్లలో, ప్రత్యేకించి దక్షిణకోస్తా జిల్లాలలో సర్వసాధారణమైనపేరు. నన్ను నా అపనమ్మకం నుంచి పక్కకు లాగడానికి ఆయన ఈ సంఘటన చెప్పారు. ఆయన ఈ సంగతి చెబుతున్నప్పటికి నాకు ఇప్పటంత పేరు లేదు. అందువల్ల నేనేమన్నానంటే ‘‘మీ బాబా నా పేరు పిలుస్తాడేమో చూద్దాం’’ అని అన్నాను. ఒక గుంపులో ఆయన పేరు పిలవడం చాలా సులభమనీ, ఎంత చిన్న గుంపులోనైనా ఆ పేరు గలవాళ్లు కనీసం కొందరైనా ఉంటారనీ వివరించారు. చాలా రోజుల వరకు కన్నబిరాన్ అనే పేరు ఒకటి వినబడుతుండేది. అందువల్ల ఈ ప్రాంతంలో ఆ పేరు పిలిస్తే పలికే వారు ఎవరూ ఉండరు.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్