ముఖ్యమంత్రి హామీని అమలుచేయాలి : డిటిఎఫ్ డిమాండ్..
వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 30 : ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్, ఇతరుల బదిలీలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు వెబ్ఆప్షన్ లో చూపకుండా కొన్నింటిని మాత్రమే ఖాళీగా చూపించడం సరికాదని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకొని అన్ని పాఠశాలల్లోని ఖాళీలు బదిలీ వేకెన్సీలో చూపాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంను డిటిఎఫ్ (DTF) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య,టి.లింగారెడ్డి కోరారు.
ఏ ఒక్క పాఠశాల కూడా మూసివేయడానికి వీలులేదని, మూతపడిన ప్రతీ పాఠశాల తెరిపిస్తామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో అనేక పాఠశాలల్లో ఖాళీ పోస్టులను చూపించకుండా అనధికార రేషనలైజేషన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య ద్వారా గతంలో మాదిరిగానే చాలా పోస్టులు రద్దు అయి, భవిష్యత్ లో ప్రభుత్వ పాఠశాలల మనుగడనే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ఖాళీలను ప్రస్తుత బదిలీలలో చూపిస్తూ, బదిలీల అనంతర ఖాళీలన్నింటిని TRT ద్వారా భర్తీ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి కోరారు.