సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే సూత్ర పద్ధతిని పాటించి పద్యానికి అర్థ గౌరవాన్ని అందించారు. తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెపుతూ కవిత్వానికి శబ్ద సౌందర్యాన్ని జత చేయడం ఆ కవులకే చెల్లింది. ఆధునికత, సమకాలీనతల సందర్భశుద్ధి పుష్కలంగా కలిగి విభిన్న సామాజిక, మానవాంతరంగిక కోణాలను పద, భావ వ్యక్తీకరణతో అలరించే పద్యరచనా కళను తమ సూక్తి పద్య సుధ శతకంలో ప్రఖ్యాత పద్యకవి పెన్నిక నాగేశ్వరరావు ప్రదర్శించారు. మొత్తం 262 ఆలోచనాత్మకమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. ప్రభావితం చేయగలిగిన మంచి మాటలనెన్నో ఒకచోట కూర్చి పొందికగా ఈ శతకాన్ని మలిచారు.

పండితుల సాన్నిహిత్యం వల్ల విద్యా, వినయాలు లభించి సకలానంద శుభ జీవనం సంప్రాప్తిస్తుందన్న శుభ కామనాకాంక్షను వ్యక్తపరచిన సూక్తి పద్యంతో ఈ శతకానికి కవి శుభారంభం పలికారు. అతి సులభంగా విషయాన్ని వర్ణిస్తూ  చెప్పగలిగిన రచనా కళ ప్రతి పద్యంలోనూ వ్యక్తమైంది. ఔన్నత్యంతో సందేశాన్ని వ్యక్తీకరించిన పద్యాలెన్నో ఈ శతకంలో ఉన్నాయి. తరచి చూస్తే తెరతీసే మార్గదర్శనంతో పద్యాలను కవి ఎంతో శ్రద్ధతో మలిచారని స్పష్టమవుతున్నది.  రాక్షసత్వం మితిమీరినా సాధువులు అధైర్యమెరుగక ప్రజలకు శాంతి సహనాలను ప్రవచిస్తూ నవ్య మార్గాన్ని  ఉపదేశిస్తారని చెప్పారు. మనిషి కష్టపడి స్వీయ సాధనతోనో, గురు శుశ్రూషతోనో విద్యానుగ్రహం పొందడమే ఒక ధన్యకార్యమని వెల్లడిరచారు. స్వేచ్ఛకు మించిన వరం మనిషి లేదని చెప్పే ఈ పద్య సందేశం అవశ్యంగా అందరికీ అనుసరణీయమని చెప్పాలి.

పరుల పంచన బ్రతుకుట పరమరోత
 పశువువలె, పక్షి వలెను చివరకు వనము
 నందలి మృగమ్ము, తరువుగానైన గాని
 స్వచ్ఛగా బ్రతుకు వలయు జీవితమున
విజ్ఞుల జ్ఞానం వెలకట్టలేని అనంత సాగరమన్నారు. అన్ని వేళల్లో విజయమే  అంతిమ లక్ష్యం కాదని చెప్పారు. మంచి వ్యక్తులతో సాగే స్నేహం వివాద రహిత జీవన విజ్ఞతను ప్రసాదిస్తుందని తెలిపారు. గ్రంథ సారాన్ని విపుల అధ్యయనంతో గ్రహించడం ద్వారా  గొప్ప విజ్ఞత అలవడుతుందని ఈ పద్యం విడమర్చి చెప్పింది.

 అన్ని విరులపై వ్రాలి నిరంతరమ్మ
 తేనె గ్రోలెడు విధముగ తేనెటీగ
 వివిధ గ్రంధాల సారమున్‌ విజ్ఞులంత      
 గ్రహణ యత్నము చేయుదు రహరహమ్ము
మౌనం ఎంతో గొప్పదని  అది ఎన్నెన్నో అనర్థాలను తప్పిస్తుందని అంటారు. నలుగురు మెచ్చుకోవాలంటే నడత మంచిగా ఉండాలని తెలిపారు. రాళ్లకు లేని విలువ వజ్రాలకు ఉన్నట్టు ప్రశంస నుండి వచ్చే విలువ విశ్వమంతటా అంచనాకు వస్తుందని తెలిపారు. కారణాలేవైనా సమస్యలకు కాలమే పరిష్కారమని భావించారు. కత్తి వేటుకు కూలిన చెట్టు తిరిగి పచ్చగా మారుతుందని, కఠినమైన మాటలతో పాడువడిన కార్యమెలా చక్కబడుతుందని ప్రశ్నించారు. మృదు స్వభావం కలిగి ఉన్నప్పటికీ సాధించాలనుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదని చెప్పారు. పక్కవారిని నిందిస్తూ నేరాలు మోపుతూ మోసం చేసే వారి కన్నా పాపులు ఈ ధరణిలో ఇంకెవరు ఉండరని వివరించారు. దాహం వేసిన వాడికి నీరందించక లేవని చెప్పి పంపివేసే వాడు కూడా పరమ పాపి అన్నారు. మంచి వారు త్రికరణ శుద్ధితో న్యాయ సమ్మతంగా సాగుతారని చెప్పారు. చెప్పడం కన్నా  ఆచరించి చూపడం మేలన్న  గొప్ప సందేశం ఈ పద్యంలో ఉంది.

ఎట్టి నమ్మకమును, మంచి నెదుటి వారి
నుంచి యాశించుచుంటివో నువ్వు ముందు
నాచరించుట మొదలుపెట్టంగ వలయు
ననియె యుత్తమమైన గుణంబు సుమ్ము
పుట్టింది మొదలు గిట్టే వరకు ఫ్రతి మనిషి తాను చేయదలచుకున్న పనిని వాయిదా వేయకుండా చూడాలన్నారు. మంచి స్నేహితులు  అవసరమని  చెప్పారు. కోపం వలన సంపదలతో పాటు సమస్తం కూలిపోతుందని  హెచ్చరించారు. మంచి వస్త్రాలు ధరిస్తే గొప్పవాడు కాదని వ్యక్తిత్వమే అందుకు గీటు రాయి అని భావించారు. విత్తనం తనను తాను నశింపజేసుకొని మహాతరువుగా మారినట్లు మనుషులు స్వార్థం వీడితేనే విజయం పొందుతారని అన్నారు. సత్యభావన మనిషిని విజయ పథాలకు తీసుకువెళ్తుందని చెప్పారు.

భ్రమర మనుసరించును గద పరిమళమును
సుగుణ వంతునికే లక్ష్మి శోభ గూర్చు
నీరు పల్లమునకె చేరు నిక్కమిదియె
నలువ వ్రాత ననుసరించు నరుని బుద్ధి
విద్య జీవనోపాధికే కాదు ప్రవర్తనను దిద్దుకోవడానికి తోడ్పడుతుందన్నారు. పారకుంటే నీరు స్వచ్ఛత కోల్పోతుందని,  వాడకుంటే ఇనుము తుప్పు పడుతుందని, బద్ధకం వీడకుంటే భవిష్యత్తే  ఉండదన్న సత్యాన్ని ఒక పద్యంలో స్పష్టంగా  వివరించారు. ఓర్పు, సత్యము, నిగ్రహముతో ముక్తి మార్గాన్ని పొందవచ్చని సూచించారు. వెలుగును అడ్డుకునే ముందు ఆ చీకట్లోనే తాను కూడా పరమసత్యాన్ని మనిషి  గ్రహించాలని చెప్పిన పద్యం ఎంతో ఆలోచనాత్మకమైంది.

వంద మందికి వెలుగును పంచుచున్న
జ్యోతి నార్పుటకు మునుపు యోచనమ్ము
చేయుమా!  నీవు కూడ నా చీకటందు
నుండవలెనను మాట గుర్తుంచుకొనుము  
ఇతరులకు భంగం కలిగించకుండా, మాయమాటలు చెప్పడం మానమని, అనవసర విషయాలలో తల దూర్చకుండా అజ్ఞానం వీడి వినయంతో  జీవితాంతం ఉండమని ప్రబోధిచారు. మూర? వాదనలు, చెడు స్నేహాలు వలదన్నారు. సాత్వికతతో జీవనాన్ని సాగించమని చెప్పారు. ప్రేమ పంచి మంచిని పెంచడమే మనిషి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఇతరులను అనుకరించక స్వంత మార్గంలో  సాగి నలుగురిలో నాలుక వలె గొప్ప పేరొందాలన్నారు. శ్రమను నమ్ముకుని సుఖ జీవనం సాగించమని సూచించారు. జిజ్ఞాసతో జ్ఞాన సాధన ముఖ్యమని తెలిపారు. తప్పును సరిదిద్దుకొని సాగాలని చెప్పారు. పరిహితాన్ని కోరమన్నారు. మంచి వలువలు కన్నా వ్యక్తిత్వపు విలువలేమిన్న అని తెలిపారు. తనను తాను తక్కువగా భావించే దుర్భలత్వమే వ్యక్తి పతనానికి కారణమని  అన్నారు. సత్యమెప్పుడూ విజయం వైపు నడిపిస్తుందని చెప్పారు. తనను సంస్కరించుకుంటేనే పరులను సంస్కరించే హక్కు దక్కుతుందని తెలిపారు. ఫలితం కన్నా చేసే పనులపై దృష్టి నిలపాలన్నారు.

నలుదెసల వ్యాపించిన కీర్తి కన్నా అనవరతమైన వినయ విధేయతలే  గొప్పవని  పరిపూర్ణమైనవని తెలిపారు. దానములలో కెల్లా  గొప్పదైన అన్నదానంతో మనిషికి జీవితపు తృప్తి దక్కుతుందన్నారు. మానవత్వమే మహోన్నత రూపమై ప్రపంచాన్ని రక్షిస్తుందని చెప్పారు. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని వివరించారు. రాత్రి నిద్రించేప్పుడు దినమంతా తాను మాట్లాడిన మాటను సమీక్షించుకోవాలని చెప్పారు. నిర్ణయాత్మకమైన బుద్ధి చంచలత్వాన్ని దరికి రానీయదన్నారు. పని పెద్దదైనా, చిన్నదైనా ఏకాగ్రతే ముఖ్యమని తెలిపారు. అవస్థల్లో సహృదయులు చేయూత అవుతారన్నారు. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ అన్నవే మానవునికి అసలైన బంధువులని చెప్పారు. పుస్తక జ్ఞానానికి జీవితానుభవం తోడైతే గొప్ప రాణింపు దక్కుతుందని తెలిపారు. కరుణ కలబోసిన  మంచి మాటలు గెలుపును సాధించడానికి తోడ్పడతాయని చెప్పారు. ఆలోచనాశీలతను పెంచే ఎన్నెన్నో సూక్తులను తేనెవాకల్లా పంచుతూనే సుందర మానవ భవిష్యత్తుకు ఎన్నెన్నో మార్గనిర్దేశాలను సులభ శైలిలో మలచి సూక్తి పద్య సుధగా అందించిన కవి రచనా నిపుణతకు నమస్సుమాంజలి.
-డా.తిరునగరిశ్రీనివాస్‌
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *