- వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..?
- వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు?
- సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..?
(విష్ణుదాసు రామ్మోహన్ రావు, ప్రజాతంత్ర): నవంబర్ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు సర్వం సిద్ధం అయింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత 3వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి సారి 2014లో జరిగిన ఎన్నికలలో 69.0 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018లో అది 79.7 కు పెరిగింది. అసలు దేశంలోని ప్రతి పౌరుడు తన వోటు హక్కును ఎందుకు వినియోగించుకోవడం లేదు…ఎందుకు ఇంత ఉదాసీనత… ఎందుకు ఇంత నిర్లిప్తత…ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి…అనేది అంతుబట్టని విషయం. నిపుణులు, విశ్లేషకులు ఈ అంశపై దానికి కారణాలను విశ్లేషించినా…బాధ్యత గల ఒక పౌరుడిగా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక్క తెలంగాణ అనే కాదు దేశ వ్యాప్తంగా చూసినా మన రాజ్యాగం అమలులోకి వొచ్చిన తర్వాత భారత పార్లమెంట్ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఆమోదించిన అనంతరం 1951-52లో లోక్ సభకు జరిగిన ఎన్నికలలో కేవలం సుమారుగా 45 శాతం పోలింగ్ నమోదు కావడం మొదలుకుని 2019లో సుమారుగా 67 శాతం నమోదు కావడం వరకు పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అయితే నాటికీ…నేటికీ ప్రజాస్వామ్య విలువలను భేరీజు వేసుకుంటే అకాశానికి…భూమికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. క్రమంగా నైతిక విలువలకు తిలోదకాలిస్తూ వొస్తున్నారు. అప్పుడెప్పుడో జార్జ్ బెర్నార్డ్ షా నిర్వచించిన ‘పాలిటిక్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఏ స్కౌండ్రల్’ అనే కొటేషన్ వర్తమాన రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్వయమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజా ప్రతినిధుల ప్రమాణాలు…తద్వారా చట్టాలపై, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలపై విశ్వసనీయత నానాటికీ దిగజారిపోతుండడం అత్యంత విచారకరం…సమాజానికి అత్యంత ప్రమాదకరం.
ఇప్పటికీ ప్రజాస్వామ్యంపై అధిక శాతం ప్రజలకు, ముఖ్యంగా నేటి యువతకు సరిjైున అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. నేటి రాజకీయ నాయకులు ఆశించేది, వాంఛించేది కూడా అదే. పౌరుల్లో ఎంత చైతన్యం వొస్తే…ఎంతగా అవగాహన పెరిగితే వాళ్లకు అంత ప్రమాకరమని వారి భావన. అందుకే వారు ఐదు సంవత్సరాలు ప్రజా సేవకు అంకితమయ్యే బదులు ఎన్నికలు రాగానే ఎంతవరకు వీలైతే అంతవరకు పౌరులను తాత్కాలిక ప్రలోభాలకు లొంగదీసుకుని తమకు రాజకీయ ప్రయోజనం కలిగే విధంగా పకడ్బందీ ప్రణాళికలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి అనంతరం ఖర్చు చేసిన దానికి పదింతలు సంపాదించే పనుల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎంతగా అంటే తెలంగాణలో కొద్ది కాలం క్రితం హుజురాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా పక్క గ్రామాల్లో డబ్బులు పంచారని, తమకు అవి రాలేదని, వాటిని డిమాండ్ చేస్తూ ప్రత్యక్షంగా రోడ్డుకెక్కి నిరసన తెలిపేంతగా దిగజారిందంటే సమాజంలో ఎంత ప్రమాదకర పరిస్థితి నెలకొందో ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే పౌరులు ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి తమ వోటు హక్కును వినియోగించుకుని ఉన్నంతలో మెరుగైన ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనవి..ప్రార్థన…విన్నపం. ఈ సారైనా కనీసం 90 శాతం వోటింగ్ శాతాన్ని ఆశిస్తూ..





