రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పదిలక్షలకు పెంపు
ముందుగా రెండు గ్యారెంటీల అమలు
నిరంతర విద్యుత్ సమర్థంగా అమలు
కేబినేట్ భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్7: మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా పదిలక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి వీటిని అమలు చేస్తామని అన్నారు.ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినేట్ భేటీ అయ్యింది. ఈ భేటీ గురించిన వివరాలను విూడియాకు శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు విూడియాతో మాట్లాడుతూ…ఈనెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచాం. రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తాం. విద్యుత్ అంశంపై ఉన్న గ్యారంటీలో భాగంగా కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల గురించి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విూడియాకు వివరించారు.
తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు. అమలు చేసే పక్రియలో భాగంగా ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి డిసెంబరు 9న వాటిని మొదలు పెడతామని అన్నారు.
2014లో ఇప్పటిదాకా విద్యుత్ రంగంలో అనేక తప్పులతడకలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై కూడా చర్చించామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమై సవిూక్ష జరుపుతారని అన్నారు. దీంట్లో కరెంటు రంగానికి సంబంధించి అనేక అంశాలు చర్చిస్తారని చెప్పారు. ఆరు గ్యారెంటీలపై కేబినెట్లో చర్చించాం. రేపు 2 గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలి. శ్వేతపత్రం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.




