బొగ్గు గనుల వేలంలొ పాల్గొనడమే నిదర్శనం
కాంగ్రెస్, బిజెపిలు తోడు దొంగలు
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కెటిఆర్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : కాంగ్రెస్, బిజెపిలు తోడుదొంగలని, సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని చెప్పారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమదన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు.
అందుకే ప్రభుత్వం ఏ రోజూ వేలంలో పాల్గొనలేదని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని, కానీ బీఆర్‌ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటి దాకా అక్కడ నుంచి ఒక త్టటెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదని తెలిపారు. వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్‌ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ..గనులను కేటాయించినా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి, నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని చెప్పారు. ఆ పూర్తి క్రెడిట్ బీఆర్‌ఎస్‌కు దక్కుతుందన్నారు.
కానీ రేవంత్ పేర్కొన్న ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి, జెన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. తాజాగా బీజేపీకి అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కుట్ర అందరికీ తెలిసిపోయిందని వెల్లడిరచారు. గనుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రెండు జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెప్తారని కేటీఆర్ అన్నారు.


