ఆరోజు… డిసెంబర్ 13 ,1919 న జలియన్ వాలాబాగ్ లో రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్ డయ్యర్ అనే అధికారి ఆర్డర్ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్ వాలాబాగ్ రక్తసిక్తమయింది. ఈ మారణకాండ జరిగిన కొన్నాళ్ళకు ఓ పన్నెండేళ్ళ బాలుడు జలియన్ వాలాబాగ్ కు వచ్చాడు . సభాస్థలం అంతా కలియ జూశాడు . రక్తంతో తడిసిన మట్టిని పిడికిట్లోకి తీసుకొని అమరవీరుల తరుపున ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు . భద్రంగా భక్తితో ఆ మట్టిని సీసాలో నింపుకున్నాడు . ఆ బాలుడే భారత ప్రజల పౌరుషానికి ప్రతీకగా నిలిచాడు.నేటి యువత ,విద్యార్థుల హృదయాల్లో నిలిచి మేల్కొనే తరంకోసం నిరంతరం మండుతున్న స్వేచ్ఛాజ్వాల మహోన్నతమైన దేశభక్తుడు సర్దార్ భగత్ సింగ్ , ఆయన మరణించి నేటికి 93సం. లు అవుతుంది. గదర్ వీరుల పుట్టినిల్లు పంజాబులో లాయపూర్ జిల్లా బంగా గ్రామంలో 28 – సెప్టెంబర్ , 1907 న జన్మించాడు .తండ్రి : కిషన్ సింగ్ రైతు ఉద్యమ నాయకుడు .పినతండ్రి:అజిత్ సింగ్, లాలాలజపతిరాయ్ కి కుడిభుజం.పినతండ్రి పరాక్రమాలు తాత అర్జున్ సింగ్ భగత్ సింగ్ కు చెబుతుండేవాడు.
భగత్ సింగ్ 8 ఏళ్ళ వయస్సులో వుండగా గదర్ వీరుడు కర్తార్ సింగ్ ను బ్రిటిష్ ముష్కర ప్రభుత్వం ఉరితీసింది.ఆ వీరుని వీరగాథ ఇంటింటా చెప్పుకుంటున్నారు . కర్తార్ సింగ్ ధైర్యసాహసాలు,దేశం కోసం చేసిన త్యాగం భగత్ సింగ్ ని కదిలించివేశాయి. ప్రాథమిక విద్య పూర్తయ్యాక లాహెర్ దయానంద ఆంగ్లో వేదిక స్కూల్లో చేరాడు. తరువాత జాతీయ కళాశాలలో చేరాడు . అక్కడే భగత్ సింగ్ కు సుఖ్ దేవ్,యశ్ పాల్ , భగవతీచరణ్ లతో పరిచయమయింది.టాల్ స్టాయ్,తుర్గనేవ్ విక్టర్ హ్యూగో రచనలు చదివాడు. ప్రపంచాన్ని కుదిపి వేసిన పది రోజులు చదివాడు.సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న రోజులవి.కళాశాల వాతావరణం లో మరింత ఉత్తేజం పొందిన భగత్ సింగ్ సహాయ నిరాకరణ ఉద్యమంతో గొంతు కలిపాడు.కానీ దేశాన్ని కుదిపేసిన ఆ ఉద్యమం గాంధీ దుర్మార్గమైన ఎత్తుగడ వల్ల చౌరీచౌరా ఘటన సాకుతో అర్ధాంతరంగా ముగిసింది.లాహోర్‌లో భగత్ సింగ్ తదితరులు జవాన్ భారత సభ స్థాపించారు. వ్యాయామం,కర్రసాము,తుపాకి శిక్షణ రాజకీయ తరగతులు మొదలగు కార్యక్రమాలకు కాలేజీ హాస్టల్ కేంద్రమయ్యింది.ఇది గుర్తించిన ప్రభుత్వం బలవంతంగా హాస్టల్ మూయించింది.భగత్ సింగ్ సుఖదేవ్ మరియు భగవతి చరణ్ ల పై నిఘా పెరిగి,వారు పని చేయడానికి ఆటంకం అయింది.భగత్‌సింగ్ అక్కడి నుండి ఢల్లీి కొన్నాళ్లకు కాన్పూర్ చేరుకున్నాడు అక్కడ సచీంద్రనాద్ సన్యాల్, ఆజాద్ చంద్రశేఖర్, శివవర్మ,భటుకేశ్వర్ దత్తు ఇంకా అనేక మంది విప్లవకారులు పరిచయమయ్యారు. ‘‘ప్రతాప్’’ అనే పత్రికలో కొన్నాళ్ళు పనిచేశాడు. ఉత్తర ప్రదేశ్,పంజాబ్, బీహార్ మొదలైన ప్రాంతాల్లో ఉన్న యువకులు విప్లవ భావాలు గలవారు అందరూ ఒకటై 1924లో ‘‘హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’’ కాన్పూర్ లో స్థాపించారు. భగత్‌సింగ్ తన నాయకత్వంలోని ‘‘నౌజవాన్’’,’’భారత సభ’’ను అందులో విలీనం చేశాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్(హెచ్.ఆర్.ఏ) తమ కార్యక్రమాలకు తుపాకులు, మందుగుండు సేకరించు కుంటుంది. ఆర్థిక వనరుల కోసం 1925 ఆగస్టు 9న కాకోరి వద్ద రైలులో వెళ్తున్న సర్కార్ ఖజానా ను దోచుకోవడానికి ప్రయత్నం చేశారు.
కానీ విఫలమయ్యింది.ప్రభుత్వ గాలింపులో రాంప్రసాద్ బిస్మిల్, సచీంద్ర సన్యాల్ మొదలైనవారు దొరికారు.భగత్ సింగ్, ఆజాద్,అష్పక్ ఉల్లాఖాన్ లు దొరకలేదు.భగత్ సింగ్ తిరిగి పంజాబ్ చేరుకున్నారు. పంజాబ్ చేరిన భగత్ సింగ్ నౌజవాన్,భారత సభ సభ్యులను కూడా కార్యక్రమాలను పునరుద్ధరించాడు.కాన్పూర్ లో తన అనుభవాలను హెచ్.ఆర్.ఏ కార్యక్రమాన్ని వారికి వివరించాడు.పంజాబ్ లో ఆనాటికీ కార్మిక వర్గ పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి .లక్నోలో కాకోరికుట్రకేసు విచారణ మొదలయ్యింది . తరువాత కాలంలో రాజేంద్రలాహిరి , అష్పక్ ఉల్లాఖర్లు దొరికారు . 1927 లో ఏప్రిల్ 7 న కాకోరి కుట్రకేసులో రాంప్రసాద్ బిస్మిల్ , రాజేంద్ర లాహిరి , రోషన్ సింగ్ , అష్పక్ ఉల్లాఖకు ఉరిశిక్ష సచీంద్ర సన్యాల్ కు యావజ్జీవ శిక్ష మిగిలిన వారికి కఠిన శిక్షలు పడ్డాయి. ఉరిశిక్ష వార్త బయటవున్న హెచ్ . ఆర్.ఎ. నాయకత్వానికి విషాదవార్త అయ్యింది .1927 వ సంవత్సరం మే నెలలో లాహెరీర్ లోని పార్క్ లో భగత్ సింగ్ ను అరెస్టు చేశారు. నెలరోజులపాటు చిత్రహింసలు పెట్టారు.అయినా అవేవి భగత్ సింగ్ వజ్ర సంకల్పాన్ని నిలవరించలేదు . సాక్ష్యాధారాలు లేనందున విడిచిపెట్టారు.1927 డిసెంబర్ లో కాకోరి పౌరులను ప్రభుత్వం ఉరితీసింది. 1928 ఏప్రిల్ నెలలో జలియన్ వాలాబాగ్ లో జరిగిన యువజన సభలకు భగత్ సింగ్ హాజరైనాడు . భగత్ సింగ్ సూచన ప్రకారం సంస్థ పేరు నౌజవాన్ భారత సభగా నిర్ణయించారు . మహాసభ తరువాత కొద్ది రోజులకు ‘‘ కీర్తి ‘‘ పత్రికలో చేరాడు . అనేక వ్యాసాలు రాశాడు . కాకోరి పౌరుల మరణం అతనిని నిలువనియ్యలేదు .’’ కీర్తి ‘‘ నుండి విరమించుకొని ఉద్యమానికి పూర్తికాలం వినియోగించాడు . 1928 సెప్టెంబర్ లో ఢల్లీిలో సమావేశం ఏర్పాటు జరిగింది . హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కు బదులు సోషలిస్టు అనే పదం చేర్చి ‘‘ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ( హెచ్ . యస్.ఆర్.ఎ. ) మార్పు చేయాలన్న భగత్ సింగ్ సూచన ఆమోదం పొందింది . రిపబ్లిక్ ఆర్మీని ఏర్పాటు చేసి దానికి నాయకుడుగా ఆజాదును నియమించారు .
1928 అక్టోబర్ 30 న సైమన్ కమీషన్ లార్ లో వచ్చిన సందర్భంలో లాలా లజపతిరాయ్ నాయకత్వాన వేలాది ప్రజల నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంటే స్కాట్ , సాండర్స్ లనే పోలీసు అధికారులు లాలాజీని తీవ్రంగా గాయపర్చారు . ఆ గాయాల వల్ల నవంబర్ 17 న పంజాబ్ కేసరి లాలాజీ మరణించాడు.లాలాజీ విప్లవకారులను మరింత రెచ్చగొట్టింది. డిసెంబర్ 17 కి కాకోరి పౌరుల సంస్మరణ దినం వారు ఉరికంబమెక్కి సంవత్సరమవుతుంది. సరిగ్గా ఆరోజునే లాలాజీ మరణానికి కారణమైన సాండర్స్ ను రాజగురు భగత్ సింగ్ లు కాల్చి చంపారు. ప్రతీకారం తీర్చుకున్నారు. బ్రిటిష్ అధికారులు హడలిపోయారు.మారు వేషాలలో రాజగురు,భగత్ సింగ్ తప్పించుకున్నారు. 1929 మార్చిలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేసి మీరట్ కుట్ర కేసు బనాయించారు.కార్మిక పోరాటాలను అణిచేందుకు పబ్లిక్ సేఫ్టీ బిల్లు,ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు అనే రెండు చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. హెచ్.ఎస్.ఆర్.ఏ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది.రెండుచట్టాలకు నిరసన వ్యక్తం చేసి దేశ ప్రజల దృష్టికి తీసుకు రావాలని నిర్ణయం జరిగింది.‘‘నూరు పూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ’’ ఆలోచనతో… 1929 ఏప్రిల్ 8న పార్లమెంట్ లో ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లుపై చర్చ జరుగుతుంది. భగత్‌సింగ్ చేతిలోని బాంబు అధ్యక్ష స్థానం ఉన్న కుర్చీ వెనకబడిరది.భయంకర శబ్దం, పొగలు కమ్ముకున్నాయి.రెండు బాంబులు భటుకేశ్వర్ దత్తు విసిరాడు.గందరగోళంగా అంతా పరుగులు తీస్తున్నారు.ఆ సభలో విటల్ భాయి పటేల్,మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య,మొహ్మద్ అలీ జిన్నా తదితర భారతీయ నాయకులున్నారు.పొగల మధ్య కరపత్రాల వాన కురిసింది. ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్’’ నినాదాలు మిన్నుముట్టాయి. పారిపోవాలనే ఉద్దేశం లేని పౌరులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వం 1929 జూన్ 12న ఇద్దరినీ విచారించి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ప్రభుత్వం నిర్భంధ విధానాలను తీవ్రతరం చేసింది.జయగోపాల్, హంసలాల్ తదితరులు చిత్ర హింసలు భరించలేక రహస్యాలు వెల్లడిరచారు.
అప్రూవర్లుగా మారారు. సుఖదేవ్,రాజగురు శివవర్మ మరియు జతిన్ దాస్ మరియు ఇంకా అనేక మంది దొరికిపోయారు.అందరిపై కలిపి లాహోర్ కుట్ర కేసు పెట్టారు. జైల్లో ఉన్న భగత్‌సింగ్ తదితరులు రాజకీయ ఖైదీల హక్కుల కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు.నిర్బంధాల తో ఈ దీక్షను అణచలేకపోయింది. ప్రభుత్వం 60 రోజుల ఉపవాసంతో జతిన్ దాస్ మరణించాడు.అయినా దీక్షలు ఆగలేదు.114 రోజులకు చేరింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం తప్పదని ప్రభుత్వం లొంగిపోయింది. ఈ లోగా మరికొందరు దొరికిపోయారు . వారిపై రెండవ లాసూర్ కుట్రకేసు పెట్టారు . పార్టీ నిర్మాణం దెబ్బతిన్నది . నాయకత్వం కొరత ఏర్పడిరది . అయినా చేవతగ్గలేదు . ఆజాద్ చంద్రశేఖర్ వైస్రాయి లార్డ్ యిర్విన్ ని చంపాలని పథకం వేశాడు . బాంబు కొన్ని క్షణాల ఆలస్యంగా పేలటం వలన వైస్రాయి బ్రతికిపోయాడు . గాంధీ ఈ చర్యను పిరికివాళ్ళ చర్యగా అభివర్ణిస్తే సాయుధ పోరాటమే మార్గమని హెచ్ . యస్.ఆర్.ఎ. ప్రకటించింది.లాసూర్ కుట్రకేసుల విచారణను రహస్యంగా జరపాలని లాసూర్ కుట్రకేసు ఆర్డినెన్స్ 1930 అనే ఆర్డినెన్స్ వచ్చింది . దాని ప్రకారం ముద్దాయిలను కోర్టుకు తీసుకరానక్కరలేదు . డిఫెన్స్ అవకాశం లేదు . సాక్ష్యులు లేరు . అప్పీలు లేదు కాబట్టి ఆ కోర్టు తీర్చే అంతిమతీర్పు . ఆ కారణంగా భగత్ సింగ్ తదితరులు తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించారు . వారికి మద్దతుగా దేశంలోని జైళ్ళలో వున్న వారంతా నిరాహార దీక్షలు ప్రారంభించారు . ప్రభుత్వం కొన్ని కోర్కెలను ఒప్పుకొంది . ఎదురుచూస్తున్న తీర్పు 1930 అక్టోబర్ 7 న ఊహించినట్టుగానే వచ్చింది . భగత్ సింగ్ ,రాజగురు ,సుఖ్ దేవ్ కు ఉరిశిక్ష మిగిలిన విప్లవకారులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు విధించారు .
భగత్ సింగ్ ఉరిశిక్ష దేశంలో పెద్దఎత్తున ఆందోళనలకు దారితీసింది .ఈ మధ్యకాలంలో భగవతీచరణ్ మరణించాడు . ఆజాద్ చంద్రశేఖర్ వీరమరణం పొందాడు .దేశవ్యాప్తంగా విప్లవకారులు కొందరు వీరమరణం పొందారు.విప్లవకారులు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ పరిణామాలన్నింటితో భయపడిన ప్రభుత్వం భగత్ సింగ్ సహచరులను త్వరగా ఉరితీయాలనుకున్నది. 1931 మార్చి 5 న గాంధీ – ఇర్విన్ ఒడంబడిక జరిగింది . భగత్ సింగ్ తదితరుల ఉరిశిక్ష రద్దు చేయాలనే షరతు ఉండాలని కాంగ్రెస్ నాయకులు సైతం కోరారు . కాని గాంధీ ఆ షరతులను తిరస్కరించి ఉరితీసి మార్చి 24 న జరగనున్న కరాచీ కాంగ్రెస్ మహాసభలోపే తీయాలని కోరాడు.ఇర్విన్ అందుకు సంతోషంగా అంగీకరించాడు.
మార్చి 23, 1931న భగత్ సింగ్ పదిహేనవ నెంబర్ బారక్ లో లెనిన్ జీవిత చరిత్ర చదువుచున్నాడు.ఎదురుగ నిలిచిన ఆంగ్లేయ అధికారి ‘‘సర్దార్జీ’’ ఉరి తీయడానికి ఆర్డర్ వచ్చింది సిద్దం కండి అన్నాడు. ‘’కొద్దిగాగండి!ఒక విప్లవకారుడు మరొక విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు’’అని చెప్పాడు.
రాత్రి 7:33 నిమిషాలకు నిద్రిస్తున్న విప్లవకారుల గొంతులకు ఉరి బిగిసింది.భగత్ సింగ్, సుఖదేవ్,రాజగురులు అమరులయ్యారు. ఉరితీయ్యటంతో వారి ఊపిరి ఆగింది.కానీ మహోజ్వల ఉద్యమం ఆగలేదు.ఈ నాటికి విద్యార్థి యువజన ఉద్యమాలకు ఊపిరిలందిస్తోంది.ఈనాటి అర్ధ వలస-అర్థ ఫ్యూడల్ వ్యవస్థ పరిరక్షకులై సామ్రాజ్యవాదులకు దేశాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్. మతోన్మాదంతో అధికారాన్ని సాధించుకొని బి.జే.పి,ఆర్.ఎస్.ఎస్ వాదుల వరకు భగత్ సింగ్ కి జోహార్ చెప్తున్నారు.తామే నిజమైన వారసులమని ప్రకటించుకోవడానికి పోటీపడుతున్నారు.ఇదంతా భగత్ సింగ్ యొక్క అచంచల దేశభక్తికి త్యాగనిరతికి ప్రజలు చూపే అభిమానాన్ని మోసపూరితంగా సొమ్ము చేసుకోవడం తప్ప మరొకటి కాదు.అసలు భగత్‌సింగ్ వారసులెవరు? ఈ దోపిడీ వ్యవస్థలో నలిగిపోతున్న పీడిత ప్రజానీకం తమ తమ సంఘటిత శక్తిలో మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి అంతిమంగా సాయుధ పోరాటాలతో సామ్రాజ్యవాద దళారి పెట్టుబడి దారులను తుదముట్టించి అధికారంలోకి వచ్చే వైపుగా కృషి సాగించేవారే భగత్ సింగ్ కు వారసులు కాగలుగుతారు,తప్ప మేము వారసులం అంటే మేము వారసులం అనుకునే వారందరూ కాలేరు.
-శోభరమేష్
8978657327





