మరింకేమి లేదు..!

దోసిట్లో పట్టిన నీళ్లలోకొచ్చిన ఓ కొండను
పిడికిట్లో బందించాలని చూసా
పిడికిట్లో ముడుసుకున్న వేళ్ళు తప్పా
మరింకేమి లేదు

గడప దాటి లోనకచ్చిన వెన్నెల వెలుగులను
తలుపు లేసి బందిద్దామని చూసా
గదంతా పరుచుకున్న చీకటి తప్పా
మరింకేమి లేదు

హాయైన లేత పైరగాలి నొకదానను
నా కౌగిట్లో బందిద్దామని చూసా
ఒకదానికొకటి పెనవేసుకున్న చేతులు తప్పా
మరింకేమి లేదు

నిద్దురలో వచ్చిన ఓ కలను
రెప్పల మాటున బందిద్దామని చూసా
ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్న సప్పుడు తప్పా
మరింకేమి లేదు

మది తెర చాటుగా తొంగిచూస్తున్న నీ తలపులను
నా ఊహల్లో బందిద్దామని చూసా
చిక్కనై బరువెక్కిన నీ జ్ఞాపకం తప్పా
మరింకేమి లేదు
మరింకేమి లేదు!!
– దిలీప్‌.‌వి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మల్లంపల్లి,ములుగు, 8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *