దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే ప్రతిజ్ఞ
(జూన్ 10 పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి )
భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు ప్రముఖం గా వినిపిస్తూ ఉంది.పాఠ్య పుస్తకంలో వీరి పేరు రాయబడు తూవుంది.వీరే పైడిమర్రి వెంకటసుబ్బారావు 1916 జూన్ 10 న జన్మించారు. రాంబాయమ్మ, వెంకట్రామయ్య దంపతులకు నల్లగొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తిలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అన్నెపర్తి, నల్లగొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో వీరు సమర్ధులు.హైదరాబాద్ రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వోద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్లగొండ జిల్లాల్లో పనిచేశారు.ఆయన 1962 లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించారు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాధంతో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతా బాగానే ఉంది కానీ, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా.అని ఆలోచించారు.అప్పటి కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తెన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు.పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమలులోకి వచ్చింది.వీరు 1988 ఆగస్టు 13 న మరణించారు.
‘‘భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడుచుకుంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.’’
ప్రతి రోజు అన్ని పాఠశాలలు దీనిని పాఠశాల ప్రారంభమవడానికి ముందు పాడిన తర్వాతనే ఆ రోజు తరగతులు ప్రారంభమవుతాయి.కలిసి మెలిసి ఉంటూ అందరూ సోదరుల్లా లా ఉండాలని ,మన దేశ గొప్పతనం చాటాలని వివరిస్తూ వుంది.వెంకట సుబ్బారావు సేవలు ఎనలేనివీ.వారిని స్పూర్తిని కొనసాగించుధాం.వారిని స్మరించుకుంధాం.
– కామిడి సతీష్ రెడ్డీ, జడలపేట జయశంకర భూపాలపల్లి..
9848445134.
(జూన్ 10 న రచయిత పైడిమర్రీ వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా)




