- సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చా
- ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆర్ ఆర్ ఆర్
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను, స్వార్థం కోసం కాదని, ఉమ్మడి ఖ్మమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా అభివృద్ధి చేసే అవకాశం వొచ్చింది, ప్రజలందరూ దీవిస్తే మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాహాయం రఘరామ రెడ్డి అన్నారు. ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా చుంచుపల్లి మండలం విద్యానరగ్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ రాష్ట్రంలోనే శక్తివంతమైన నాలుగురు రాజకీయ నేతలు ఖమ్మం జిల్లాలోనే ఉండటం అందులో ముగ్గరు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాగా రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి వున్నారని గుర్తు చేశారు. రాజకీయాల్లో అరుదుగా ఇలాంటి అవకాశం వొస్తుందన్నారు.
చాలా ఏళ్ళ తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ అద్భుత అవకాశం లభించింది అన్నారు. వీరికి తోడుగా ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందన్నారు. ఖమ్మం ఎంపిగా గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు తనవంతుగా కృషి చేస్తాను అన్నారు. కొందరు స్వార్థపూరితంగా రాజకీయ లబ్ది కోసం తనను బయటి వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ నేను పక్కా లోకల్ అని స్పష్టం చేశారు. పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న నాయకులు ప్రజలకు ఈ పదేళ్ళలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ధరల పెరుగుదల, అవినీత తప్ప మరొకటి కాదన్నారు. నిధులు, నీళ్ళు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ సంక్షేమం ముసుగులో అన్ని స్కామ్‌లే చేశారని విమర్శించారు. పేపర్ లీకేజీతో రాష్ట్ర నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని ఆరోపించారు. ధరణి పేరుతో పేదల భూములు బడా బుబులకు దోచిపెట్టారని, ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి చుట్టుకుందని ఎద్దేవ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులను న్యాయం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ళ పాలనలో ఎప్పుడూ ఫామ్ హౌజ్ దాటని నేతలు ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతాము అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలోని బిజెపి దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. అగ్నివీర్ పేరుతో ఆర్మీ రిక్యూట్ మెంట్‌ను సైతం కాంట్రాక్టు పద్ధతి చేసిన ఘనత బిజెపికి దక్కుతుంది అన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పడిపేందుకు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చక్కటి అవకాశం వచ్చిందని, ఎంపిగా తనను గెలిపించాలని అభ్యర్థిచారు.





