వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్ స్కామ్
ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు
కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, ఏప్రిల్ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ ఆరోపణలు వెలుగు చూడడం బిఆర్ఎస్కు రాజకీయపరంగా గట్టిదెబ్బతీసేవిగా తయారైయ్యాయి. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా రాజకీయ వర్గాల్లో ఈ వార్త ప్రకంపనలను లేపుతున్నది. ఫోన్ ట్యాపింగ్ అన్నది ఆశామాషీ వ్యవహారం కాదని నిపుణులు, మేథావులు, రాజనీతిజ్ఞులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ను ఆడుకోవడానికి ఇదొక ఆయుధంగా సంక్రమించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు, పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందంటున్నారు. నాలుగు నెలల క్రితం అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ అయిన ఉదంతం తాజాగా సంచల నాత్మకంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల వ్యూహా, వ్యవహారంపైన గత ప్రభుత్వం ఒక కన్ను వేసి ఉంచేందుకు వారి ఫోన్ మాటలను సీక్రెట్‌గా వినడంపైన ఇప్పుడు దుమారం లేస్తున్నది. మూడవసారి అధికారంలోకి రావడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఎత్తుగడనే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంగా ఇప్పుడు ముమ్మర దర్యాప్తు జరుగుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాల డబ్బు పట్టుకుని వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడానికి దీన్ని గత ప్రభుత్వం ఆయుధంగా వాడుకున్నదన్నది ప్రధాన ఆరోపణ. తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్‌లో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావు సస్పెండ్‌తో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఇందులో పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని గుర్తించారు. ఫలితంగా ఇప్పటికే అడిషినల్ ఎస్పీ స్థాయి అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో వారు వెల్లడిస్తున్న విషయాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, రియల్టర్లు, సినీ ప్రముఖులు, అందులో హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలు మీడియాలో చోటుచేసుకోవడంతో, ట్యాపింగ్ బాధితులు పలువురు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు దర్యాప్తు సంస్థల ముందుకు వొస్తున్నారు. చివరకు న్యాయాధిపతుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం వెలుగులోకి రావడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. దీన్ని బిఆర్ఎస్ నాయకులు కొట్టిపారేస్తున్నా, అధికార కాంగ్రెస్ మాత్రం దీంతో బిఆర్ఎస్ పార్టీని శంకగిరి మాన్యాలను పట్టించవచ్చన్న పట్టుదలతో ఉంది.
ఇది ఖచ్చితంగా పౌరహక్కులను ఉల్లంఘించడమేనంటారు భట్టి విక్రమార్క. పౌరుల వ్యక్తిగతసమాచారాన్ని వారి అనుమతిలేకుండా సేకరించడం, ఇతరులకు పంచడం క్షమించరాని నేరమంటున్నారాయన. నిత్యం అబద్దాలు మాట్లాడే ఆపార్టీ ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరాదని భట్టి తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాగా, దేశ భద్రత, సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దుచేయాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. విపక్షాల ఫోన్లు, పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌కు గురైనట్లు వొస్తున్న వార్తలు ఆశామాషీ వ్యవహారంగా కొట్టిపారేసేదికాదని, అందుకు కెసిఆర్‌పైన, ఆయన కుటుంబ సభ్యులందరిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ టాకూర్ కూడా తీవ్రంగానే స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందంటున్న టాకూర్, టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వొస్తుందని ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉంటే దిల్లీ లిక్కర్ స్క్యామ్‌లో ఎంఎల్సీ కవిత అరెస్టు కూడా పార్లమెంటు ఎన్నికల ముందు జరుగడం బిఆర్ఎస్ను కోలుకోని దెబ్బతీసింది. ఈ విషయంలో తాను నిరపరాధినని, కడిగిన ముత్యంలా బయటికి వొస్తానని చెబుతున్న కవిత మరిన్ని దర్వాప్తు సంస్థల ప్రశ్నలను ఎదుర్కునాల్సి రావడంతో ఇప్పుడప్పుడే ఆమె కేసు నుండి బయటపడుతుందన్న నమ్మకం ఆ పార్టీ వారికే లేకుండాపోయింది.
ఈ రెండు ప్రధాన ఘటనలకు సంబంధించిన ఆరోపణలు ఎంతవరకు నిరూపణ అవుతాయో తెలియదుకాని, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ మాత్రం కుడితిలో పడిన ఎలకలాగా తయారైంది. మరో పక్క పార్టీ రోజురోజుకు క్షీణించిపోతున్నది. పార్టీలోని అతిరథమహారథలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభ బిఆర్ఎస్కు మరో గండంగా మారింది. ఈ సభలో చాలామంది బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నట్లు వార్తలు వొస్తున్నాయి. దీనికి తగినట్లుగా పార్లమెంటు ఎన్నికలు బిఆర్ఎస్కు డెడ్ పాయింటంటూ అటు కాంగ్రెస్, ఇటు బిజెపి వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో చివరకు ఆ పార్టీలో మిగిలేది ఎవరన్నది పెద్ద క్వశ్చన్ మార్క్‌గా తయారైంది. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన మరో రెండు రోజుల్లో వివరణ ఇవ్వనున్నట్లు తాజాగా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొనడం కొసమెరుపు.



