హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 26: పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ సిగ్గు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ భవన్‌లో జగదీశ్ రెడ్డి డియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదు.. దీన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఫిరాయింపు జరిగిన రోజే.. లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం రద్దయ్యే విధంగా చట్టం తీసుకువస్తామని మొన్నటి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పాంచ్ న్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చారు.
ప్రజలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. ఇలాంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు. దానికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు చట్టం ప్రకారం మేం విలీనం అవుతాం అని చెప్పారు. ఆ మేరకు సీఎల్పీని చట్టబద్దంగా విలీనం చేశారు. కేసీఆర్ ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదు. సభ్యులకే పార్టీపై విశ్వాసం లేక 23 మంది ఎమ్మెల్యేల మెజార్టీతో విలీనం చేశారని కోర్టు చెప్పింది. ఇవాళ్నేమో సిగ్గులేకుండా ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎవరికీ కండువాలు కప్పలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా నాడు బీఆర్‌ఎస్‌లో చేరారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.




