ప్రధాని మోదీ ..వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి
వోటర్లు పట్టం కట్టేది ఎవరికో?
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న జరగనున్న పోలింగ్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు, టీపిసిసి అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇదే అంశంపై పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల్లో సర్వత్రా చర్చ నడుస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం వోటర్ల సంఖ్య 16 లక్షల 80 వేల 417. ఇందులో పురుషులు 8,32,080, మహిళలు 8,48,293 ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటాపో టీగా ప్రచారాలు చేస్తున్నాయి.
ఈ నెల 18న బీజేపీ అభ్యర్థిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మరుసటి రోజు 19న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. ఇదే రోజు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మొదటి విడత నామినేషన్ తన అనుచరులతో వేయించారు. ఈనెల 24న భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయను న్నట్లు సమాచారం. ప్రస్తుతం వేసవి కావడంతో ఏప్రిల్ మాసంలోనే ఎండలు తీవ్రమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. ఇక రాజకీయ అభ్యర్థుల ప్రచారాల వేడి కూడా అదే స్థాయిలో ఉంది. అన్ని పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశాన్ని సుభిక్షంగా పాలన కొనసాగిస్తున్నారని. చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు.
అందులో భాగంగానే 500 సంవత్సరాల కాలం నాటి సమస్య అయోధ్య రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉండి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ ప్రజల కోసం కాపలా కాస్తున్న మిలిటరీ విభాగానికి కావలసిన నిధులు ఇస్తూ..ఏ ప్రధాని పట్టించుకోని రీతిలో నరేంద్ర మోదీ వారిని గుర్తించారని ప్రచారం చేస్తున్నారు. అలాగే కొరోనా లాంటి విపత్కర సమయంలో మోదీ ఉచిత టీకాల పంపిణీతోపాటు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, కొరోనా విపత్కర సమయంలోను రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రేషన్ బియ్యాన్ని సరఫరా చేయకున్నా.. ప్రధానమంత్రి చేశారని చెబుతున్నారు. రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలో రూ.10 లక్షల కోట్ల అభివృద్ధి నిధులను కేటాయించినట్లుగా ఆ పార్టీ నాయకులు కార్యక్రమాల్లో వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత వోటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టినా, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీకే పట్టం కడతామని చెబుతున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ సెగ్మెంట్లో అభ్యర్థి డీకే అరుణ తన ప్రచారంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పేరును జపం చేస్తున్నారు. మోదీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. ప్రధాని మోదీ ఒక శక్తివంతమైన నాయకుడని, ఎక్కడ కూడా 10 సంవత్సరాల పాలనలో ఒక్క అవినీతి మచ్చ లేని మహా నాయకుడని, మళ్లీ మూడోసారి ప్రధానిగా అయ్యే యోగ్యత మోదీకి మాత్రమే ఉందని, నేడు యావత్ ప్రపంచమంతా గర్వించే విధంగా పాలన కొనసాగిస్తున్నారని అభ్యర్థి డీకే అరుణ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఎంపిక చేయగా ఆయన గట్టిగా ప్రచారం చేస్తున్నారు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో చల్లా వంశీ చందర్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు.
నాటి నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం ఐదు దఫాలుగా పర్యటించారు. సభలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఈ జిల్లా వాసిగా కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని, లేదంటే ఈ జిల్లా వాసిగా ముఖ్యమంత్రిగా ఉండి తాను ఓటమికి గురైనట్టుగా భావిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేక గురి పెట్టారు. పర్యటనకు వొచ్చినప్పుడల్లా అభ్యర్థి డీకే అరుణ పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా మహబూబ్నగర్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించి చేర్చుకున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి ఇంతగా పాలమూరుపై శ్రద్ధ పెట్టారంటే.. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ముందు ఇంతకు రెట్టింతలు చేసినా వోడిపోతామని భయం ముఖ్యమంత్రి కి చుట్టుకున్నట్టు ఇటీవల ఓ పత్రిక సమావేశంలో అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఇదే విషయం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ త్రిముఖ పోటీ ఉండొచ్చని బహిరంగంగా కొంతమంది అనుకుంటున్నారు.. కానీ అందుకు భిన్నంగా త్రిముఖ పోటీలో అంతర్గతంగా ద్విముఖ పోటీ ఉందని మరికొందరు చెబుతున్నారు . ఎలా అంటే బీఆర్ఎస్, బిజెపి రహస్య ఒప్పందం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అలా జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలుపునకు చాలా దూరంలో ఆగిపోతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రచారం చేపడితే బిజెపి వోట్లు చీలి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 37.5 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి 35 శాతం గెలుపు దిశగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 28న నామినేషన్ గడువు ఉపసంహరణ అనంతరం పార్టీలు వ్యూహాలు ప్రచారాలు ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉండొచ్చు. వొచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వొస్తాయి. అదే రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ వోటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో.. నరేంద్ర మోదీ చరిష్మాకా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు అభ్యర్థి వంశీ చందర్ రెడ్డికా లేదా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికా అనేది తేలిపోతుంది.





