రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర
•విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు
: పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
•అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ ‘అమరుల దినం’ సందర్భంగా జనగణమన అభియాన్ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, క్రాంతి కుమార్, ఆర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో యువతతో ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి హరగోపాల్, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ…రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేయాలని బీజేపీ, ఆర్‌ఎసెస్ కంకణం కట్టాయని, దీనిని ఎదుర్కునడానికి ప్రజలే నిలబడాలని, ముఖ్యంగా యువత నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం హర్షణీయం అన్నారు.
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ప్రాణ త్యాగం చేసినది కేవలం బ్రిటిష్ వాళ్ళను వెళ్లగొట్టడానికి కాదు, వాళ్ళు కలలు కన్న భారత దేశం సాధిస్తామన్న ఆశతో ఆర్థిక సమానత్వం గురించి, సామాజిక న్యాయం గురించి, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఆనాడే వాళ్ళు మాట్లాడారని అన్నారు. అటువంటి స్వాతంత్యోద్యమ విలువల ఆధారంగా, అంబేద్కర్, నెహ్రూ వంటి గొప్ప నాయకుల నేతృత్వంలో మన రాజ్యాంగం ఏర్పడిందన్నారు. సమానత్వం, మాట్లాడే స్వేచ్ఛ, ప్రజలందరికీ ప్రజాస్వామిక హక్కులు, లౌకిక తత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ రాజ్యాంగంలో ముఖ్య విలువలని అన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను విమర్శిస్తూ కార్టూన్లు వేసే శంకర్, ఆర్కే లక్ష్మణ్ వంటి వారిని ప్రోత్సాహించే వారు, ప్రభుత్వంపై మరింత పదునైన కార్టూన్లు వేయాలని అనేవారని గుర్తు చేశారు. ఖలీదా పర్వీన్ మాట్లాడుతూ…నేడు మన దేశంలో అధికారంలో ఉన్నవాళ్లే రాజ్యాంగ రక్షణ కోసం కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ లాంటి చట్టాలు, ఎనార్సీ లాంటి ప్రక్రియలతో మతాల మధ్య అసమాన వైఖరిని రాజ్యాంగ విరుద్ధంగా తీసుకు వొస్తున్నారని అన్నారు. భారత దేశంలో తరతరాల నుండి అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారని, దీనిని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఎలా అయితే విద్వేషపూరిత, అబద్ధపు ప్రచారపు మెసేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్నాయో, దానిని ఎదుర్కునడానికి యువత రాజ్యాంగ విలువల గురించి, మత సామరస్యాన్ని గురించి, మన కలల భారత దేశం గురించి మరింత ఎక్కువ వ్యాప్తి చెందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బహుమతి పొందిన విద్యార్థులు వారి వ్యాసాలను చదివారు.

కొందరు విద్యార్థులు ఈ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సామాజిక కార్యకర్త ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ…యువతీ యువతులు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన వ్యాసాలు విని తనకు ఊరట కలిగిందని, దేశ భవిష్యత్తు మంచి చేతులలోనే ఉన్నట్లు నమ్మకం కలిగిందన్నారు. అయితే మంచి భావాలు కలిగిన వారి సంఖ్య మరింత పెంచి వ్యతిరేక భావాలను ఎదుర్కునే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగ విలువలను, మత సామరస్యాన్ని కాపాడుకోవడం-పౌరుల పాత్ర అనే అంశాలపై జనగణమన అభియాన్ కాలేజీ స్థాయిలో వ్యాసరచన, షార్ట్ వీడియో, నినాదాల పోటీలు జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుండి 35 కాలేజీల నుండి, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల నుండి వందలాది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలకు ప్రొఫెసర్ హరగోపాల్, ఖలీదా పర్వీన్ బహుమతులు అందించారు.
వ్యాసరచన పోటీలో మొదటి బహుమతిని మిర్యాలగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండి.యాస్మీన్, రెండవ బహుమతిని వనపర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి నాయని శ్రీలత, మూడవ బహుమతిని మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి హెచ్.డి.శ్రీకాంత్, గెలుచుకున్నారు. షార్ట్ వీడియో పోటీలో మొదటి మూడు బహుమతులను కరీంనగర్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి గుడెల్లీ నరేష్, షాద్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి కె.ప్రవల్లిక, ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి సౌమ్య సాధించారు. నినాదాల పోటీలో జనగామ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి బొంకూరి దివ్యశ్రీ, మణుగూరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి పుట్టబంతి హేమంత్, సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి జి.రమ్య బహుమతులు గెలుచుకున్నారు.





