- పౌరుల హక్కులను కాలరాశారు
- ప్రశ్నించే గొంతుకలపై నిర్భంధ చట్టాల ప్రయోగం
- సనాతన విలువలను బలవంతంగా రుద్దే ప్రయత్నం
- ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టి కగిరిజన, ఆదివాసీ చట్టాల నిర్వీర్యం
- మహిళలకు భద్రత కరువు..వారి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేక నిర్ణయాలు
- బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ..వ్యవసాయరంగానికి అన్యాయం
- నోట్ల రద్దుతో నల్లధనం రావడమేమోగాని.. ఉన్న ధనాన్నే ప్రజలు నష్టపోయారు
- అబద్ధాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన
- వంద సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలే అమలు
- ‘పదేళ్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు..పర్యవసానాలు’ అంశంపై
- ప్రజాతంత్ర దినపత్రిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిమతం
హన్మకొండ(కాళోజీ జంక్షన్), ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : గత పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో రకరకాల పన్నుల వడ్డింపులతో పేద, మధ్యతరగతి వర్గాల వెన్నుముకను మోదీ సర్కార్ విరిచిందని పలువురు ప్రజాసంఘాల మేథావులు, వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ధనిక కార్పొరేట్లు మరింత కుబేరులుగా అభివృద్ధి చెందారని, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డా రని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్చను, రాజ్యాంగ హక్కులను సైతం కాలరాశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండలోని కాకతీయ హరిత హోటల్‌లో ప్రజాతంత్ర దినపత్రిక ఆధ్వర్యంలో ప్రజాసంఘాల ‘నిగాప్‌ా’ పేరున ‘పదేళ్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు.. పర్యవసానాలు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఎడిటర్ దేవులపల్లి అజయ్ నేతృత్వంలో, రిటైర్డు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన చర్చావేదిక నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటనా రాయణ మాట్లాడు తూ…దేశ ఉత్పత్తి ఫలితాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఒక్కశాతం మాత్రమే వాటా దక్కిందన్నారు. మిగతా సంపద కార్పొరే ట్లకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టిందని వెల్లడిరచారు. ప్రశ్నించే మేథావులు, హక్కుల సంఘాల నాయ కులపై నిర్భంధ చట్టాలను ప్రయోగిం చారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నయవంచనకు గురి చేశారని తెలిపారు. ప్రతి మహిళకు మూడువేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. గత పదేళ్లు కేంద్ర ప్రభుత్వం ధనిక కార్పొరేట్ల కోసమే పనిచేసిందని ఆరోపించారు.
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కేయూ రిటైర్డు ప్రొఫెసర్ కె.కాత్యయనీ విద్మహే మాట్లాడుతూ..
నూతన విద్యా విధానం పేరిట బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతి ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. విద్యారంగంలో ఆధునిక వైజ్ఞానిక దృష్టి లోపించిందన్నారు. దళిత, ఆదివాసీ, బహుజన వర్గాలను మళ్లీ కులవృత్తులకు పరిమితం చేసి సనాతన విలువలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. స్వదేశీ విద్య గురించి గొప్పలు చెబుతూనే విదేశీ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జ్యూడిషరీ వ్యవస్థను పరోక్షంగా శాసిస్తున్నారని పేర్కొన్నారు. పేద మధ్య తరతగతి ప్రజల మీద పెద్ద ఎత్తున పన్నులను బాదుతున్నారన్నారు. సంపన్నులకు తక్కువ పన్నులు వేస్తూన్నారని చెప్పారు. పాలనలో మార్పురాకుంటే భవిష్యత్తు ప్రజల స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడనుందన్నారు.
ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకులు, అధ్యాపకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ….
ప్రజల మెదళ్లను మనుధర్మ ఆలోచనలను బలవంతంగా రుద్దడానకి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసమానతలు, మూఢనమ్మకాల విలువలను పెంచిపోషించే సనాతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మౌలికమైన విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమూహాలు ఐక్యంగా సంఘటితమై ప్రత్యామ్నాయంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు విమర్శకులు డాక్టర్ మెట్టు రవీందర్ మాట్లాడుతూ..దేశంలోని న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారనిచ, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, నియంతృత్వ పాలన కొనసాగుతుందని అన్నారు.’ మోదీ సర్కార్ ప్రజలకు చెబుతున్నది ఒటని, అమలు చేస్తున్నది మరొకటని, సంఘపరివార్ ఆలోచనలు పార్లమెంటరీ వ్యవస్థలో బలవంతంగా రుద్దడం ప్రజాస్వామ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ…
జిడిపి పెరుగుదల, పేదరిక నిర్మూలనకు సంబంధం లేదని, గత పదేళ్లలో ప్రజల జీవనప్రమాణాలు పూర్తిగా క్షీణించాయని, పెరిగినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 18 నుంచి 50 ఏళ్ల పురుషులు పూర్తి నిరుద్యోగులుగా జీవితాలు గడుపుతున్నారని, ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయారని, 70 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం ఆత్మహత్యలకు కారణమవుతుందని, ప్రపంచంలో నిరుద్యోగులు అధికంగా ఉన్నది భారతదేశమేనని అన్నారు.
సామాజిక విశ్లేషకులు లంకా పాపిరెడ్డి మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ విధానం లేదని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు తాత్వికతను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు తెలియకుండా అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని, కేంద్రంలో అధికారం చేపట్టాక విద్యారంగంలో సెంట్రల్ యూనివర్శిటీల్లో సిలబస్ పూర్తిగా మార్చివేశారని, బెనారస్ యూనివర్శిటీలో తాంత్రిక విద్య కోర్సును ప్రవేశపెట్టడం అంటే దేశాన్ని సనాతన ధర్మం పేరుతో వెనక్కి నడపటమేనన్నారు. ప్రజల్లో సాంస్కృతిక వైరుధ్యాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకుముందు రైతులకు గిట్టుబాటు ధరపై ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, చట్టసవరణల పేరుతో నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టి కార్మికుల 12 గంటల పనిభారం పెంచారని అన్నారు. దేశంలో 22 శాతం ఆదాయం కార్పొరేట్ శక్తులకు ఆదాయం చేకూరిందని, 60 శాతం ఉన్న వ్యవసాయ రంగాన్ని పరిగణించకుండా బహుళజాతి కంపెనీలకు పెద్దపీటలు వేశారని దుయ్యబట్టారు.
భారత్ బచావో జాతీయ నాయకుడు జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ..
దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీ తెగల భిన్న సంస్కృతులను, సంప్రదాయాలను కనుమరుగు చేయడానికి కుట్రను అమలు చేస్తున్నారు. గత పాలకులు అమలు చేసిన పలు గిరిజన సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేశారని, ఐదో షెడ్యుల్‌లోని గిరిజన చట్టాలను పూర్తిగా నిర్వీరం చేశారని, అటవి ప్రాంతంలో ప్రాజక్టులు, ఖనిజాల తవ్వకం పేరుతో గిరిజన స్వయంప్రతిపత్తికి గండికొట్టారని విమర్శించారు.
చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ…
మోదీ పాలనలో దేశంలో మహిళలకు పూర్తి భద్రత లేకుండా పోయిందని, పేద ప్రజలు ధరల పెరుగుదలతో కడుపునిండా తిండిదొకని దుస్థితి నెలకొందని, బీజేపీ మహిళల ఆర్థికాభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అబద్ధాలతోనే బీజేపీ మనుగడ సాగిస్తుందని, నిజాలతో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మేధావులకు ఉందని, పదేళ్లలో ఉన్నావ్, హత్రాస్, కథువా సంఘటనలతో దేశంలో మహిళల భద్రతలోని డొల్లతనం బయటపడిరదని దుయ్యబట్టారు.
తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్ సోమరామూర్తి మాట్లాడుతూ…
ఆధునిక రాజకీయ సరిహద్దులను ధ్వంసం చేస్తామన్న బీజేపీ తాత్వికతను అర్థం చేసుకుంటే మోదీ భయంకర స్వరూపం తెలుస్తుందని, స్వదేశీ ముసుగులో విదేశీ కార్పొరేట్లకు మద్దతుగా పాలన సాగుతుందని, రైతులు తమ భూములను కార్పొరేట్లకు అమ్ముకోమని ప్రోత్సహించడం దారణమన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ నాయకుడు వలీ ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ..దేశంలో గత పదేళ్ల పాలనలో అవినీతి చట్టం బద్ధం చేశారని, నిరుద్యోగులను మోసం చేశారని, ప్రపంచంలోనే మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు.
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ..
మళ్లీ మోదీ అధికారంలోకి వొస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రమాదం ఉందని, ప్రణాళిక బద్ధతలేని వృత్తి విద్యాకోర్సులతో యువత భవిష్యత్తు నిర్వీరం కానుందని, నాలుగేళ్ల డిగ్రీతో విద్యార్థులకు ప్రయోజనం ఏమీ లేదని, దేశంలో ప్రజావ్యతిరేక విధానాలతో మోదీ పాలన సాగుతుందన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నున్నా అప్పారావు మాట్లాడుతూ…దేశంలో కార్మికుల హక్కులు, పనిభద్రత చట్టాలను క్రూరంగా రద్దు చేశారని, కార్మికులకు పనిభారం పెంచే లేబర్ కోడ్ ప్రమాదకరమైందని, మహిళలను రాత్రివేళల్లో పనిచేయిండంతో వారికి భద్రత లేకుండా పోయిందన్నారు. విదేశాల నుంచి సీక్లాస్ బొగ్గును 30వేలకు టన్ను దిగుమతి చేసుకొని దేశీయ ఏ బ్లాకు బొగ్గును మూడువేలకు అదానీకి అమ్ముకుంటున్నారన్నారు.
భారత్ బచావో నాయకుడు ఓం బ్రహ్మం మాట్లాడుతూ..
నాగపూర్ కేంద్రంగా సోషల్ మీడియాను తప్పుదోవ పట్టిస్తూ ప్రతిరోజు లక్షల్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేత వేస్తున్నారని, మత గురువులను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి పాచికలు వేస్తుందని, దేశంలోని అన్ని రకాల వ్యవస్థలపై సంఫ్‌ు పరివార సర్జికల్ అటాక్ చేస్తుందని, ఆర్యన్ క్యాపిటలిస్టు లకు మద్దతుగా నిలుస్తుందని అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ నరేందర్ మాట్లాడుతూ..
దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, వాస్తవానికి ప్రాథమిక పాఠశాల విద్యా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, విదేశాల్లో ప్రాథమిక విద్య బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటున్నాయని తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్య వరకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, బిజెపి ప్రభుత్వం వొచ్చాక యుజిసి ఫెలోషిప్‌లన్నింటినీ రద్దు చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందని, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచర్లకు 25 వేల వేతనంతో శ్రమదోపిడికి గురవుతున్నారని విమర్శించారు. ముస్లిం మైనార్టీ నాయకుడు కవి రచయిత రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అడుగడుగునా అవమానాలకు గురిచేస్తుందని, మైనార్టీల మనోభావాలను సోషల్ మీడియా ద్వారా దెబ్బ కొడుతున్నారని, ముస్లింల సామాజిక ఆర్థిక స్థితి అధ్వానంగా మారిందని, దేశంలో బేకరీలో మెకానికులుగా సైకిల్ పంచర్లు పనులు చేసే దినసరి కూలీలుగా ముస్లిం పేద వర్గాలు బతుకులను కొనసాగిస్తున్నాయని, కేంద్రం ముస్లిం పేద వర్గాలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
బీసీ జేఏసీ నాయకుడు తిరునగరి శేషు మాట్లాడుతూ…
దేశంలోని 40 శాతం ప్రజల సంపద ఒక్క శాతం ధనికుల చేతుల్లోకి ఈ పదేళ్లలో చేరిందని అన్నారు. ప్రజలను దేవుళ్ళ మాయలో ముంచెత్తారని, దేశాన్ని అభద్రతా నిప్పుల కొరిమిల్లో నిలబెట్టారని విమర్శించారు. మోదీ విదేశీ సంబంధాల నిర్వహణలో వైఫల్యం చెందారని, రైతుల ఆర్థిక ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, అందుకే రైతు ఉద్యమాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయని, నరేంద్ర మోదీ ముఖంలో ఆదాని, అంబానీలు మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. భారత్ బచావో జిల్లా చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…దేశంలోని 40 శాతం ప్రజలని నియంతృత్వానికి అలవాటు పడేలా మెదళ్లను మార్చివేశారని, బిజెపి మాయలు, అబద్ధాలు, అసత్యాలను ప్రచారం పెట్టడంలోనే దాని ఉనికి ఉందని ఆరోపించారు.
టిపిసిసి సభ్యురాలు సదాలక్ష్మి మాట్లాడుతూ…
గత పది ఏళ్లలో సమాజంలోని హేతువాదులను బుద్ధి జీవులను బిజెపి హత్యలు చేయించిందని, ప్రశ్నించే మేధావులను హక్కుల నాయకుల మీద తప్పుడు కేసులతో నిర్బంధానికి గురి చేశారని, దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం లేదని, మహిళలపై అత్యాచారాలు హత్యలు యథేచ్ఛ్నగా కొనసాగుతున్నాయని, మోదీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లలో తప్పుడు విధానం ఉందని, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ మాట్లాడుతూ…
10 ఏళ్లలో ప్రతి ఏటా రెండు లక్షల కోట్ల అన్ క్లెయిమ్‌డ్ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, తమ చెప్పు చేతుల్లో మెదిలే అధికారులకు ఈసీ బాధ్యతలు అప్పగించిందని, సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, లద్దాఖ్ ప్రజల స్వయంప్రతిపత్తి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓబీసీ సంఘం నాయకుడు మల్లీశ్వర్ మాట్లాడుతూ…
గత పది ఏళ్లలో ఓబీసీలకు విద్యా ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీ కార్డుతో అధికారంలోకి వొచ్చిన మోదీ బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని, దేశంలోని సబ్బండ వర్ణాలు తీవ్ర అణిచివేతకు గురయ్యాయని, జనగణన చేస్తామని కేంద్రం మోసం చేసిందని దుయ్యబట్టారు. బీసీ సంఘాల జేఏసీ నాయకుడు సాయిని నరేందర్ మాట్లాడుతూ…మోదీ దేశీయ కంపెనీలను ప్రైవేటుకు అప్పగించిండని, విదేశీ కంపెనీలకు కోట్ల రూపాయల పన్ను రాయితీలు కల్పించిండని, బిజెపి అవినీతిని చట్టబద్ధం చేసి కార్పోరేట్లకు వెన్నుదన్నుగా నిలిచిందని, కొరోనా సమయంలో, నోట్ల రద్దు సమయంలో సామాన్య మధ్య తరగతి ప్రజల కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేమని, ప్రజలకు కేంద్రం మీద పూర్తి నమ్మకం పోయిందన్నారు.
ముస్లిమ్ మైనార్టీస్ ఇంటలెక్చువల్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ సిద్ధిక్ మాట్లాడుతూ…
దేశంలో 12 కార్పొరేట్ గోవధ కేంద్రాలు నడుస్తున్నాయని, గతంలో ప్రపంచంలోనే అత్యధికంగా బ్రెజిల్ గోమాంసాన్ని ఉత్పత్తి చేసేదని, ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే గోమాంసం ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ప్రథమ స్థానంలో మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నిలిచిందని, దేశంలో సామాన్య ముస్లిమ్ తన ఆహారపు అలవాట్లలో గోమాంసం తింటే కొట్టి చంపుతున్నారని, ఇదెక్కడి న్యాయమంటూ మండిపడ్డారు. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేస్తున్నారని, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వతంత్ర జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ…
మోదీ పాలన వన్ నేషన్ నో ఎలక్షన్ దిశగా సాగుతుందని, దేశంలోని ప్రధానమైన సంస్థల్లో మోదీ జోక్యం విపరీతంగా పెరిగిందని, దేశంలోని ప్రజలను అబద్ధాలతో మభ్యపెడుతున్నారని, దేశంలో ఎన్నికలు పూర్తవకముందుకే హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే పదిమంది ఎమ్మెల్యేలుగా ఎలా ఎన్నికవుతారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు తమ పెదవి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, మేధావులు, ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారని, తన మీద 75 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మోదీ నోట్ల రద్దు విషయంలో నల్లధనం మాటేమో కానీ..ఉన్నదనాన్నే ప్రజలు నష్టపోయారని విమర్శించారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షురాలు బి. రమాదేవి మాట్లాడుతూ…
ప్రజా జీవితంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అసమానతలు తీవ్రంగా పెరిగాయని, రాజ్యాంగ ఉల్లంఘన బిజెపి ప్రధాన ఎజెండా అని, జీవించే స్వేచ్ఛను కొల్లగొట్టారని, మహిళలపై ఆంక్షలు పెంచారని, వ్యక్తిగత జీవన స్వేచ్ఛను హరించారని దుయ్యబట్టారు. వందేళ్ళ క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చేసిన కుట్రలే నేడు అమలవుతున్నాయని, భావ సారూప్యత కలిగినటువంటి ఐక్య ఉద్యమాలతోనే పాలకులకు బుద్ధి చెప్పాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడు ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ..
దేశంలో ఫాసిజం తారా స్థాయికి చేరుకుందని, అన్ని ప్రభుత్వ వ్యవస్థలను కార్పొరేట్ల కోసం భ్రష్టు పట్టించింది బిజెపి ప్రభుత్వమని, మోదీ పాలనలో అల్లరి మూకలదే రాజ్యాంగా మారిందని, సంఫ్‌ు పరివార్ నాయకత్వ ఆలోచనలే కేంద్ర ప్రభుత్వంలో అమలు అయ్యాయని విమర్శించారు. రౌండ్ టేబుల్ చర్చావేదిక కార్యక్రమంలో ఇంకా బాసిత్, వడ్డెబోయిన శ్రీనివాస్, టిపిటిఎఫ్ నాయకుడు తిరుపతి, ప్రొఫెసర్ రామిరెడ్డి, బిల్ల మహేందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్, బాదవత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.





