తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌ బాండ్ల మీద దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలయింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017 ఆర్థిక బిల్లు ద్వారా ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టారు. 2018లో ఇవి అమల్లోకి వొచ్చాయి. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు..రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు వీటిని తీసుకొచ్చామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. బ్యాంక్‌ ద్వారా జారీ అయ్యే ఈ వడ్డీ రహిత ఎన్నికల బాండ్లను డోనర్‌(దాత) కొనుగోలు చేస్తారు. చెక్కు లేదా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా ఇది జరుగుతుంది. విరాళాలిచ్చేవారి రక్షణ కోసమే ఇది. అది కాస్త భారతీయ జనతా పార్టీకి వరప్రదాయినిగా మారిందన్న ఆరోపణలున్నాయి. విరాళాల సేకరణలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది. ఎన్నికల విరాళాలాలంటే పబ్లిక్‌గా తెలిసిపోతుంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్నికల బండ్ల పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని వల్ల నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి కార్పొరేట్‌, భారీ పారిశ్రామిక వేత్తలకు వీలవుతుందన్నది నిర్వివాదాంశం. సమాచార హక్కు చట్టం ఉద్యమకారులు, కార్యకర్తలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

నల్లధనానికి తెలుపు పూత పూసి యథేచ్ఛగా వాడుకునేందుకు మోదీ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్న విమర్శలున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా అందులో భాగమే..పెద్ద నోట్ల రద్దుతో తేలిన నల్ల ధనం కేవలం 90 వేల కోట్ల రూపాయలేనని తేలింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూన్న బడా బాబుల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి పౌరుని ఖాతాలో రు.15 లక్షలు జమ చేస్తామన్న బీజేపీ వాగ్దానం కూడా ఎన్నికల జుమ్లా అని తేలిపోయింది. విదేశీ బ్యాంకుల్లో నిధులను వెనక్కి తేవడంలో మోదీ విఫలమయ్యారు. ఇందుకు ఆ బ్యాంకుల చట్టాలు నల్ల కుబేరులకు అనుకూలంగా మారాయి. బీజేపీ ప్రభుత్వం 2017 ఆర్థిక బిల్లు ద్వారా ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకంలో కొన్ని నిబంధనలను గమనిస్తే..పారదర్శకత నీటిమూట లాగే కనిపిస్తుంది. నగదు మూలాల గురించి డోనర్‌(వ్యక్తి/సంస్థ) వెల్లడిరచాల్సిన అవసరం లేదనేది ఓ నిబంధన. రాజకీయ పార్టీలు కూడా ఆ విరాళాలు ఎక్కడ నుంచి వొచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొనుగోలు చేసిన బాండ్లను డోనర్లు ఏ రాజకీయ పార్టీకి అందజేశారన్న విషయం వారు వెల్లడిస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు. తమ లాభనష్టాల నివేదికలో కంపెనీలు ఈ ఎన్నికల బాండ్లను చూపించనక్కర్లేదు. పైగా కార్పొరేట్‌ విరాళాలు 7.5% మించరాదన్న సూత్రం ఈ బాండ్ల విషయంలో వర్తించదు. అలాగే కంపెనీలు ఏవైనా 3 ఏళ్లుగా మనుగడలో ఉంటే..రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసేందుకు అర్హత ఉన్నట్టే. డొల్ల కంపెనీలకు ఊతమిచ్చేందుకు ఇది పరోక్షంగా దోహదపడుతుందనేది సుస్పష్టం. నల్లధన ప్రవాహానికి ఇదో రాచమార్గంగా మారిందనేది అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) వాదన. ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ సుప్రీమ్‌ కోర్టులో ఏడీఆర్‌ 2017లో పిటిషన్‌ వేసింది. 2019, 2021లలో బాండ్ల జారీపై స్టే కోరినా..సుప్రీమ్‌ కోర్టు తోసిపుచ్చింది.

ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్బీఐ మాత్రమే బాండ్లను జారీ చేస్తుంది కాబట్టి..కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఈ సమాచారాన్ని తమకు అనువుగా వినియోగించుకునే ప్రమాదమూ ఉంది. లెక్కలకు మించి ఆదాయం ఉన్న సంస్థలు/వ్యక్తులు బాండ్లను విరాళంగా అందజేసి..అధికార పార్టీలను ప్రసన్నం చేసుకునే సౌలభ్యం ఈ పథకంలో ఉండటం గమనార్హం. బాండ్ల ద్వారా విరాళాలు అందుకోవడంలో అధికార పార్టీలదే అగ్రస్థానమనేది సుస్పష్టం. ఏడీఆర్‌ తన పిటిషన్లో ఎన్నో విషయాలను సుప్రీమ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన ఆడిట్‌ నివేదికలు, ఆదాయపన్ను నివేదికలను పరిశీలిస్తే ఎన్నికల బాండ్లతో అధిక లబ్ధి చేకూరింది బీజేపీకేనని తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మేరకు 2021-22లో బీజేపీ అత్యధిక మొత్తంలో(రూ.1032 కోట్లు) .. కాంగ్రెస్‌(రూ.528 కోట్లు), టీఎంసీ(రూ.236కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పెద్ద సంస్థలు, కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలు విరాళాలు ఇవ్వడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. కాంగ్రెస్‌ హయాంలో ఇది ఒక యాగంల జరిగేది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారం లోకి వొస్తే ఈ జాడ్యాన్ని తొలగిస్తామని వాగ్దానం చేసింది. కానీ అది సాధ్యం కాలేదు. కార్పొరేట్‌ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి పన్నును 25 శాతానికి తగ్గించింది. ఎన్నికల బాండ్ల పథకం కూడా ఆ కోవలోనిదే ..గత దశాబ్ద కాలంగా ఎన్నికల బాండ్ల పథకం కమలనాథులకు ప్రతి ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీలకు కంపెనీల విరాళాలను నిషేధించాలన్న డిమాండ్‌ ఐదారు దశాబ్దాలుగా పార్లమెంటులో మారుమోగుతూనే ఉన్నది. కాంగ్రెస్‌ హయాంలో బీజేపీ నాయకులు..అంతకు ముందు భారతీయ జనసంఫ్‌ు నాయకులూ, సంయుక్త సోషలిస్ట్‌, వామపక్ష నాయకులూ పదే పదే డిమాండ్‌ చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించు కోలేదు. ఎన్నికల్లో నల్ల ధనం ప్రభావాన్ని నిర్ములించేందుకు రాజకీయ పార్టీలకు విరాళాలను నిరోధించేందుకు వోహ్రా కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులను సమకూర్చాలని సిఫారసు చేసింది. కానీ ఆ సిఫారసును అన్ని ప్రతి పక్షాలు తోసిపుచ్చాయి. నల్ల ధనం గత 8 సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల బాండ్ల రూపంలో ప్రభావం చూపింది. రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదు, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందే..ఇప్పుడు రాజకీయ విరాళాలన్నీ తేటతెల్లం కానున్నాయని ఆశిద్దాం ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *