తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌

హైకోర్టు మాజీ చీఫ్  జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం


హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంతకు ముందు కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి వ్యవహరించారు.
అయితే సుప్రీమ్‌ కోర్టు సూచనలతో ఆయన రాజీనామా చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు…యాదాద్రి, భద్రాద్రి సబ్‌క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి మొదటగా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిని నియమించిన విషయం విధితమే.
విచారణ జరుగుతున్న సమయంలో..కమిషన్‌ ఏర్పాటు, దాని ఛైర్మన్‌ నిష్పాక్షికతను సవాల్‌ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది.
అదే సమయంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌ను సైతం కొట్టేయాలన్న కేసీఆర్‌ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీమ్‌ కోర్టుకు సమర్పించగా..సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన చైర్మన్‌ను నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *