‘డ్రగ్స్‌’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు, సిఎస్‌ డీజీపీ రవీ గుప్తాలతో కలిసి సమీక్షా సమావేశం నిర్తహించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కొటిక్‌ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు ఆ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్‌, ఆక్టోపస్‌ మాదిరిగా టీఎస్‌ నాబ్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా రూపొందించాలని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంకా ఇంటలీజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీ శివధర్‌ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి శేషాద్రి ఎక్సయిజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్‌ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *