కేసీఆర్‌ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్‌ ఓటమి

బిఆర్‌ఎస్‌ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు  
విజయ సంకల్ప యాత్రలో  కిషన్‌ రెడ్డి

మంచిర్యాల, ప్రజాతంత్ర ,ఫిబ్రవరి23:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపేర్కొన్నారు. కెసిఆర్‌ అవినీతే ఆయనను బొందపెట్టిందన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర లో కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందన్నారు. ఫామ్‌ హౌస్‌కు వెళ్లి కాలు విరగొట్టుకున్నాడన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే వృథా అవుతుందన్నారు. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలిచినా.. తెలంగాణకు లాభం లేదని.. గెలవకున్నా రాష్టాన్రికి నష్టం ఉండదన్నారు. మోసపూరిత కాంగ్రెస్‌ ను కూడా నమ్మొద్దని.. అవినీతి కి చిరునామా ఆ పార్టీ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని.. మోదీతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదన్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్‌ నాయకులే వద్దంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఏలి రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసిందని ఆరోపించారు. దేశంలో సకల సమస్యలకు కాంగ్రెస్‌ కారణమన్నారు. ఆర్టికల్‌ 370 ని రద్దుతో కశ్మీర్‌లో జాతీయ జెండా రెపరెపలాడుతోందన్నారు.

500 ఏళ్ల క్రితం నాటి అయోధ్య సమస్యను కేంద్ర ప్రభుత్వం శాంతి యుతంగా పరిష్కరించి, రామ మందిరాన్ని నిర్మించిందని తెలిపారు. 370 పార్లమెంటు స్థానాలు బీజేపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అందులో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కూడా ఉండాలన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిరదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏ ఉండదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని విమర్శించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ని గెలిపిస్తేనే హాలు అమలు చేస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ విజయ్‌ సంకల్ప్‌ యాత్రలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులనెలా సమకూర్చుకుంటారో బయట పెట్టాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారని కిషన్‌ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400లకు పైగా సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు సైతం మోదీనే ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *