కార్పోరేట్‌ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?

తామంతా సర్కార్‌ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి.   ఈ క్రమంలో స్కూళ్ల పై శ్రద్ద పెడతారా? అని తల్లిదండ్రులు ఎంతో  ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే కార్పోరేట్‌ స్కూళ్లకు కల్లెం వేయగలం.  గతంలో ఎపిలో ఆంగ్ల మాధ్యమం పేరుతో, నాడునేడుతో  హడావిడి చేసినా..క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో దశలవారీగా స్కూళ్లను ఆధునీకరించాలి. మౌలిక వసతులు కల్పించాలి. విద్యపై పెట్టుబడి దేశ సంపద అన్న సిఎం రేవంత్‌ మాటను నిలబెట్టుకుని చిత్తశుద్దితో పని చేయాలి. పాఠశాల విద్యను ఎంతగా బలోపేతం చేస్తే సమాజం అంతగా బలోపేతం అవుతుంది. మంచి సమాజం  ఏర్పడడానికి పునాది పడుతుంది. విద్యకు ఎన్నివేల కోట్లు ఖర్చుచేసినా..అది భవిష్యత్‌ పెట్టుబడి గానే చూడాలి. అనవసర పథకాలకు దుబారా చేసేకన్నా విద్య,వైద్యంపై శ్రద్ధ పెట్టి నిధులు కేటాయిస్తే మంచిది. ఇలా చేయడం కోసం తెలుగు రాష్ట్రాల  ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆరోగ్యశ్రీ పేరుతో కార్పోరేట్‌ స్కూళ్లకు తగలెయ్యడం మానకోవచ్చు ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాలను, స్కూళ్లను బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తేనే మంచిది.

దీంతో కార్పోరేట్‌ స్కూళ్ల దోపిడీ నుంచి తల్లిదండ్రులు బయటపడగలరు. కార్పోరేట్‌ స్కూళ్లు  ముక్కుపిండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా నియంత్రణ లేకుండా పోయింది. ఏ అధికారి కూడా వారివైపు కన్నెత్తి చూడడం లేదు. లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నా..అడపాదడపా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వాలు కిమ్మనకుండా ఉన్నాయి.  స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. ప్రైవేట్‌ స్కూళ్లను పలుచోట్ల ఇప్పటికే ప్రారంభించారు. ఫీజులను ముందే వసూలు చేసుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు ఫీజులను వసూలు చేశాక మెల్లగా నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ క్లాసులంటూ  విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు. బడిబాట పేరుతో ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్‌ స్కూళ్ల పై నియంత్రణ కోల్పోయాయి. బడిబాటను మొక్కుబడిగా గాకుండా పక్కాగా నిర్వహించి, పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. ప్రైవేట్‌ యాజమాన్యాలు ఇచ్చే ఆమ్యామ్యాలే వారికి ముఖ్యం కనుక అధికారులు కార్పోరేట్లపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. నిజానికి వారు చట్టం పరిధిలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలగమానదు. ఇక సర్కార్‌ బళ్లల్లో ఉపాధ్యాయుల కొరత, పదోన్నతులు వంటి సమస్యలు ఏటా ఉండనే ఉంటున్నాయి.  ఈ దశలో విద్యారంగం పటిష్టత కోసం ప్రభుత్వాలు నడుంబిగించాలి. కేంద్రం కూడా విద్యారంగానికి ఉదారంగా కేటాయింపులు పెంచాలి. కెజి టూ పిజి అన్న ప్రతిపాదన కోల్డ్‌ స్టోరేజీకి వెళ్లింది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇంగ్లీష్‌ మాధ్యమం పేరుతో హడావిడి చేస్తున్నా…బోధనోపాధ్యాయుల నియామకం జరగడం లేదు. అలాగే పుస్తకాల ముద్రణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఉపాధ్యాయులు లేక నేటికీ తెరవని పాఠశాలలు కోకొల్లలు.

తెలంగాణలో గత కెసిఆర్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల వేలాది స్కూళ్లు మూతపడ్డాయి.  గిరిజన ప్రాంతంలో ఉపాధ్యా యులు లేక అనేక స్కూళ్లు మూతపడి వున్నాయి. గిరిజన గ్రామాలకు నేటికీ రవాణా సౌకర్యం లేదు. వారికి కరెంట్‌ అంటే ఏమిటో తెలియదు. విద్య,వైద్యం వారి దరికి చేరడం లేదు.  కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు, లెక్కలు, భౌతిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు సబ్జెక్టు టీచర్లు లేరు. కొన్ని వేల స్కూళ్లు 5 తరగతులకు కలిపి ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. విద్యలో తెలుగు రాష్ట్రాలు   వెనకబడి పోవడానికి సరైన దృక్పథం, చిత్తశుద్ది లేకపోవడంగానే చూడాలి. ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం కారణంగా విద్యారంగం కుదేలవుతోంది.  దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. ఇకపోతే ఇంగ్లీషు మాధ్యమంతో ముందుకు పోదామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలుగు విూడియం ఎందుకు వద్దని అడిగితే పేదలకు ఇంగ్లీషు వద్దా అన్న చర్చ సాగింది. నాయకుల పిల్లలు ఇంగ్లీషులో చదువుకుంటుంటే పేదల పిల్లలు చదువు కోకూడదా? అన్న మౌలిక ప్రశ్నలు వచ్చాయి. డబ్బున్న వాళ్ళు లక్షల రూపాయలు పోసి ఇంగ్లీషు లో చదువుకోగా, పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీషు చదువు చెప్పడం తప్పా? అని వేస్తున్న ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. అయితే అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందిని, మౌలిక వసతులను కల్పి స్తే ఎవరూ కాదనరు.

అలాగని తెలుగును నిర్లక్ష్యం చేయరాదు. ఇంగ్లీషు మాధ్యమం పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయొద్దనే అడుగుతున్నారు. అయితే ఇంగ్లీష్‌ విూడియం ప్రకటించడానికి ముందు ఆ మేరకు స్కూళ్లను, తయారు చేసి టీచర్లను నియమించాల్సి ఉంది. ప్రకటనలు బాగున్నా ఆచరణలో పక్కా ప్రణాళిక ఉండాలి. మాధ్యమం గొడవ పక్కన పెట్టి పిల్లలందరికి విద్యను చేరువ చేసే కార్యక్రమం జరగాలి. ఏ ఒక్క పిల్లవాడు బడిబయట లేకుండా చేయాలి. అప్పుడు తెలుగా, ఇంగ్లీషా అన్న తర్కం చేయవచ్చు. మాతృభాష ద్వారానే జాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయని అందరి అభిప్రాయం. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, వికాసానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత పరిశోధనలు పరిగణలోకి తీసుకోవాలి. భాషా శాస్త్రవేత్తలు, సంఘాలు, రాజకీయ పార్టీలతో సంప్రదించాలి, చర్చించాలి. మన దేశంలో అన్ని రాష్టాల్రు వారి భాషా మాధ్యమంలో విద్యను కొనసాగిస్తు న్నాయి. విద్యలో దేశంలోనే కేరళ ముందున్నది. అది కూడా మాతృభాష లోనే ప్రాథమిక విద్యను అందిస్తున్నది. కేరళ ప్రజలే ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం లో తప్పులేదు. మాతృభాషలో బోధన చేస్తూనే ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్పితే సరిపోతుంది.

ఇక జూన్‌ మాసం వచ్చిందంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయపనులు ప్రారంభమవుతాయి. కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్‌ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్‌, డొనేషన్‌ ఫీజులు చూసి  జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ’వామ్మో జూన్‌’ అంటూ తలపట్టు కుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్‌లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు.  జిల్లాలోని ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్‌, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్‌ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్‌ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది.

జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్‌, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్‌ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్‌ స్కూల్‌ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఏటా రైతులకు వానాకాలం సీజన్‌ భారంగా మారుతోంది.

ఈ యాసంగి పంటలు పండినా ధాన్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రావిూణుల్థు ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్‌నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ముందుగా ప్రతి ఒక్కరికి చదువు అన్నది నినాదంగా..దేశంలో జాతీయోద్యమంగా సాగాలి. ముందు ప్రైవేట్‌ స్కూళ్లపై అజమాయిషీ చేయాలి. డబ్బులు గుంజే విధానాన్ని అరికట్టాలి. వారు చట్టానికి లోబడి ఉండేలా చూడాలి. అంతేగాని వారిని పట్టించుకోకుండా..వసూళ్లు చేసుకునేలా ప్రోత్సహించడం అరాచకం తప్ప మరోటికాదు. ఫీజుల నియంత్రణపై వేసిన కమిటీలు ఇచ్చిన సూచనలు బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఆలోచించేలా తప్ప యాజమాన్యాల పక్షాన కాదని గుర్తించాలి. సర్కార్‌ బడులను నిజగానే బలోపేతం చేసి, బోధానా సిబ్బందిని నియమించి, మౌలిక వసతులు కల్పిస్తే ప్రజలు తప్పకుండా సర్కార్‌ బడులనే ఆశ్రయిస్తారు.

-ఎమ్మెస్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *